1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"మగధీర" సరసన కాజల్ సిస్టర్..!?"

వినోదం వెండితెర గుసగుసలు చిరు నాగార్జున నాగ చైతన్య రామ్ చరణ్ కాజల్ ఇష్తా అగర్వాల్ సుశాంత్ నగ్మ శిల్పాశెట్టి జ్యోతిక
టాలీవుడ్‌లో అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వారసులను వెండితెరకు కథానాయకులుగా పరిచయం చేయడం పరిపాటి. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్ తేజను "చిరుత" చిత్రం ద్వారా హీరో చేశారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున తన వారసుడు నాగచైతన్యతో కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు.. తన మేనల్లుడు సుశాంత్‌ను కూడా "కాళిదాసు" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు.

ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ కూడా తన కుమారుడిని హీరోగా చేస్తున్నారు. అదేవిధంగా.. దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ కూడా తన సోదరుడు సాయికిరణ్‌ను తెరపైకి తెచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

హీరోల పరిచయం సంగతిని అటుంచితే.. ఈ మధ్య టాప్ హీరోయిన్లు కూడా తమ బంధువులను సినీ రంగంలోకి దించుతున్నారు. ఇదే తరహాలో.. బాలీవుడ్ అందాలరాశి శిల్పాశెట్టి, తన సోదరి షమీతా శెట్టిని సినీతెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఆనవాయితీ దక్షిణాది సినీ రంగంలోనూ కొనసాగుతోంది. ఇదే కోవలో.. నగ్మా-జ్యోతిక సిస్టర్స్ కూడా హీరోయిన్లుగా పరిచయమైన విషయం విదితమే.

తాజాగా "చందమామ" చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ తన సోదరి ఇష్తా అగర్వాల్‌ను వెండితెరకు పరిచయం చేసేందుకు నానా తంటాలు పడుతోందని సినీ వర్గాల సమాచారం. అదీ మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ తాజా చిత్రం "మగధీర" (పేరు ఇంకా ఖరారు కాలేదు) సినిమాలో నటింపజేయాలని కాజల్ తహతహలాడుతోందట..!.

ఇప్పటికే ఇష్తా ఫోటోలను దర్శకుడు తేజ, ప్రముఖ నిర్మాత పూరీ జగన్నాథ్, అల్లు అర్జున్, రాజమౌళి, రాఘవేంద్రరావు వంటి సినీ దిగ్గజాలు చూశారట...!. తప్పకుండా "మగధీర"లో ఇష్తాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చేస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ అగ్రహీరోయిన్ ఇలియానా కూడా తన సిస్టర్‌‌ను కోలీవుడ్, టాలీవుడ్‌లకు హీరోయిన్‌గా పరిచయం చేయనుందని తెలిసింది. ఇప్పటికే.. తమిళ యంగ్ యాక్టర్ సిలంబరసన్ (సింబు), వి.వి. వినాయక్‌లకు ఫోటోలను పంపించిందట..!
About Writer
SELVI.M