రెండు, మూడు కోలీవుడ్ తమిళ చిత్రాలలో పాటలు పాడి, గాయకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న ప్రఖ్యాత నటుడు, పద్మభూషణ్ కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్ త్వరలో సంగీత దర్శకురాలిగా అవతారమెత్తనుంది.
"దశావతారం" తర్వాత కమల్ హాసన్ నటించే "తలైవన్ ఇరుక్కిరాన్" సినిమాకు శృతిహాసన్ సంగీతాన్ని అందించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఒకవైపు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటూనే, తన తండ్రి నటించే సినిమాకు శృతి సంగీతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని సినీ వర్గాల్లో టాక్.
ఇకపోతే.. సోహమ్ షా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా తన టాలెంట్‌ను "లక్" ద్వారా నిరూపించుకోవాలనుకుంటున్న శృతికి మరో ఛాన్స్ దొరికింది. అదేమిటంటే...? తన మొదటి బాలీవుడ్ సినిమాలోనే శృతి ఓ పాట పాడనుందట.
తండ్రికి తగ్గ కూతురుగా చిన్న నాటి నుంచే కళలంటే ఆసక్తి కనబరచే శృతి హాసన్, తన ఆరవ ఏటనే కమల్ హాసన్ "దేవర్ మగన్" చిత్రంలో ఓ పాటను ఆలపించింది. ఇకపోతే... ప్రితం సంగీతం సమకూర్చుతున్న "లక్" సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
కమల్ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ ఖాన్... శృతిని తన చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేయాలని దర్శకుడు సోహమ్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌కు ఇమ్రాన్ ఖాన్ బంధువు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... తమిళంలో మాధవన్ సరసన శృతి హాసన్ నటించాలనుకున్న చిత్రం రద్దైన సంగతి తెలిసిందే.