తమిళ సూపర్ స్టార్, రజినీ కాంత్ 20 కేజీల బరువెక్కారట. మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ సరసన రజినీ కాంత్ నటించే తాజా కోలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం "ఎందిరన్" సినిమా కోసం శివాజీ బరువెక్కారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఈ చిత్రం ద్వారా రోబో మ్యాన్‌గా ప్రేక్షకులను అలరించనున్న రజినీ కాంత్ వయ్యారి భామ ఐష్ సరసన నటించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అదే సమయంలో సినిమాలోని తన పాత్రకు తగినట్లు కూడా తన బరువును ఎక్కించారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇటీవల పెరులో ఒక నెలపాటు జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై నగరంలో జరుపుకుంటోంది. ఈ మధ్యలో తమిళనాడులోని వేలూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, చిత్ర యూనిట్ అందరికీ చిత్ర నిర్మాతలు ఆంబూర్ బిర్యానీ ఏర్పాటు చేశారట. అదీ రజినీ కాంత్ కోసం స్పెషల్ ఆంబూర్ బిర్యానీని నిర్మాతలు అరేంజ్ చేశారట.
ఈ స్పెషల్ ఆంబూర్ బిర్యానీని రజినీ కాంత్ చాలా ఇష్టపడి తినడంతో, కొద్ది రోజుల్లోనే ఏకంగా ఆరు కేజీల బరువెక్కారట. ఇలా ఈ సినిమాలోని తన పాత్ర కోసం రజినీ కాంత్ తీసుకుంటున్న ఆహారంతో... శివాజీ ఏకంగా 20 కేజీల బరువు ఎక్కి, చిత్ర యూనిట్‌ను ఆశ్చర్య పరిచారంటే నమ్మండి..!