ఇటీవల ఓ షూటింగ్‌లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంకు ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. క్రికెట్ ఆట ఆడుతున్నట్లు ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బంతి అతని కాలికి బలంగా వచ్చి తగిలింది. దాంతో జాన్ మెలికలు తిరుగుతూ గ్రౌండ్‌పై కూలబడ్డాడు.
నిర్మాతకు నష్టం కలుగకూడదనే తలంపుతో ఆ సాయంత్రం వరకూ కుంటుతూనే షూటింగ్ లో పాల్గొన్నాడట జాన్. పొద్దుపోయేసరికి కాలు వాచిపోయిందట. దీంతో వైద్యుని సంప్రదించగా వైద్యుడు అతనిపై విరుచుకుపడ్డాడట. కాలికి దెబ్బతగిలినా అలానే నడవడం వల్ల గాయం మరింత పెద్దదైందనీ, నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడట.
జాన్‌కు గాయమైన సంగతి తెలుసుకున్న బిపాసా పరుగు పరుగున హాస్పిటల్‌కు వచ్చిందట. అప్పటికే అన్ని సంగతులను తెలుసుకున్న బిపాసా అబ్రహాంపై ఇంతెత్తున లేచిందట. "నువ్వింత తెలివితక్కువ మేళామని నేను అనుకోలేదు. దెబ్బ తగిలితే ఆస్పత్రికి రావాలా... లేదా..? కాలు చూడు. ఎంత లావున వాచిపోయిందో..." అని అంటూ తన చేతితో మృదువుగా నిమర సాగిందట.
బిపాసా స్పర్శతో జాన్ కమ్మగా నిద్రలోకి జారుకున్నాడట. "పిచ్చి మొద్దు.. నా చేయి పడితే చాలు వెంటనే గుర్రు పెడతాడు" అని తన ప్రక్కనే ఉన్న నర్సుతో అందట బిపాస. ఆ నర్సు మాత్రం బిడియపడుతూ బిలబిలమంటూ బయటకు పెరుగెత్తిందట. అయినా అంత సిగ్గుపడటానికి కారణమేమిటో...?