బాలీవుడ్ సెక్సీతార రాఖీ సావంత్ స్వయం వరం ఫలించింది. వచ్చేనెల (ఆగస్టు) 2వ తేదీన రాఖీ సావంత్ పెళ్లి చేసుకోనుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. వరుడి ఎంపికకోసం రాఖీ సావంత్ "రాఖీ కా స్వయంవర్" కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి విదితమే.
ఈ స్వయం వరంలో పాల్గొన్న వారి నుంచి చిటిజ్ జైన్, ఎలేష్ పరుజన్ వాలా, మవస్ కత్యాల్ అనే ముగ్గురు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఎలేష్‌ను రాఖీ పెళ్లాడనుందని విశ్వసనీయ సమాచారం. అంతేగాకుండా స్వయంవరానికి వచ్చిన వారిలో ఎలేష్ పట్ల రాఖీ ఆకర్షితురాలయ్యిందని ఆమె స్నేహితులు తెలిపారు.
ఇకపోతే.. పెళ్లి సంగతిని ఇంకా నిర్ధారించి చెప్పకున్నా... ఆగస్టు రెండో తేదీన అందరికీ వాస్తవం తెలుస్తుందని రాఖీ సావంత్ అంటోంది. వైవాహిక వ్యవస్థను అపహాస్యం చేయాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సావంత్ చెప్పింది.
భార్యాభర్తలు విడిపోయిన సంఘటనలు తాను చాలా చూశానని, తన తల్లిదండ్రులు కూడా అలానే విడిపోయారని రాఖీ పేర్కొంది. తాను కోరుకున్న నిస్వార్థ ప్రేమ ఎలేష్‌లో ఉందని తెలిపింది. అయితే ఇప్పుడే తన కెరీర్‌ను విడిచిపెట్టే ఆలోచన లేదని, పెళ్లయ్యాక తాను, తన భర్త ఎవరి వృత్తుల్లో వారు కొనసాగుతామని రాఖీ సావంత్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. రాఖీకి పెళ్లి అలంకరణలన్నీ నీతాలుల్లా చేయనున్నట్లు సమాచారం. ఆభరణాలను ఫరాఖాన్ డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది.