మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండో చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమే "మగధీర" విజయమని చిత్ర యూనిట్ చెపుతోంది. ఈ విజయం సక్సెస్‌ను తలకెక్కించుకోకుండానే తన తదుపరి చిత్ర ప్రాజెక్టుపై దృష్టి సారించారు.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో కె.నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, రామ్‌చరణ్ తన 'మగధీర' చిత్రం బాక్సాఫీస్ విజయంతో తెలుగు చిత్రసీమలోని కుర్ర హీరోలకు ఓ సవాల్ విసిరాడని అంటున్నారు. చిత్రం కోసం రేయింబవుళ్లు శ్రమిస్తే సక్సెస్‌లు వాటికంతటికి అవే వస్తాయని రుజువు చేశారు.
దీంతో చరణ్ కంటే ముందుగానే చిత్ర రంగ ప్రవేశం చేసి, విజయాలను చవిచూసిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కళ్యాణ్ రామ్, నితిన్, రామ్, తరుణ్.. వంటి హీరోలు తాము చేస్తున్న, చేసిన వర్క్‌పై పునరాలోచన చేస్తున్నారు. ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్‌కు "మగధీర" సాధించిన విజయం వెనుక గల రహస్యం అంతుచిక్కడం లేదు.
అందుకే ఆచిత్రాన్ని ఇప్పటికే అనేక మార్లు చూస్తూ.. నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో తాను నటించే చిత్రాలపై మరింతగా శ్రద్ధ చూపాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా.. ఈ మధ్య కాలంలో తనపై వచ్చిన ఆరోపణలకు సైతం ఓ బాక్సాఫీస్ విజయంతో సమాధానం ఇవ్వాలనే కసితో జూనియర్ ఎన్టీఆర్ రగిలి పోతున్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఏది ఏమైనా.. "మగధీర" విజయం మన కుర్ర హీరోలకు ఓ కనువిప్పులా మారిందని సినీ విమర్శకులు అంటున్నారు. ఇకనైనా.. తాము అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని వారు అంటున్నారు.