ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్" చిత్రంలో యువ ప్రేమజంటగా ప్రేక్షకులను అలరించిన జమాల్, లతికాలు నిజజీవితంలోనూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. జమాల్, లతికా పాత్రలో తెరపై రొమాన్స్‌తో ఆకట్టుకున్న దేవ్ పటేల్, ఫ్రెడా పింటోలు నిజజీవితంలో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ప్రస్తుతం దేవ్‌తో డేటింగ్ చేస్తున్న పింటో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహన్ అంటావోను వదిలేసినట్లు ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా దేవ్, పింటోల మధ్య ఏదో వ్యవహారం సాగుతోందా? అని అమెరికాలోని ఓ రేడియో వ్యాఖ్యాత ర్యాన్ సీక్రెస్ట్ అడిగిన ప్రశ్నకు క్విజ్ మాస్టర్‌గా నటించిన అనిల్ కపూర్ సమాధానమిస్తూ.. నిజం చెప్పాలంటే.. వీరిద్దరిని తాను కలుసుకున్నప్పుడు ఏదో ఉందనిపించిందని అన్నారు. కానీ వారు మాత్రం ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదంటూ దాటవేశారని వెల్లడించారు.
ఇదే విషయాన్ని పటేల్, పింటోలు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాలన్ని వదంతులేనని కొట్టిపారేస్తున్నారు. స్లమ్‌డాగ్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు యూకే, అమెరికాల్లో జోరుగా పర్యటిస్తున్న సందర్భంగా వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం.
ఇదిలా ఉండగా.. మాజీ ప్రియుడు రోహన్‌ను పింటో రహస్యంగా వివాహమాడిందని, ఫేస్‌బుక్ పేజ్‌లో వారి పెళ్లి ఫోటో కూడా వచ్చిందని, కొద్ది రోజుల క్రితమే దానిని తొలగించిందని కొందరు చెబుతున్నారు.
మరీ ఇందులో అసలు విషయమేమిటో..!? వెలుగులోకి వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే..!