1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

ఎక్స్‌పోజింగ్ తప్పులేదు: అంకిత

ఐ లవ్ యూ రస్నా మూడేళ్ళ చిరు ప్రాయం బేబీ అంకిత
'ఐ లవ్ యూ రస్నా' అంటూ మూడేళ్ల చిరు ప్రాయంలోనే దక్షిణ భారతదేశాన్ని ఆకర్షించిన బేబీ అంకితను 'లాహిరి..లాహిరి.. లాహిరిలో' అనే చిత్రంలో దర్శకనిర్మాత వైవీఎస్.చౌదరి తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత కథానాయకిగా 'సింహాద్రి' ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'మనసు మాటవినదు', 'సీతారాముడు' వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ మరోవైపు 'రారాజు', 'ఖతర్నాక్' వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లలో నటించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు పరిశ్రమకు తిరిగి వచ్చిన అంకిత తన మకాంను హైదరాబాద్‌కు మార్చేసింది. 25 ఏళ్ళ పడుచుగా తన పుట్టినరోజున గృహప్రవేశం చేసిన అంకిత మే 27వ తేదీన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెతో ముఖాముఖీ...

ప్ర... ఇక్కడ సక్సెస్ కాగలరనే నమ్మకం మీకుందా?
అం.. చాలా గ్యాప్ తర్వాత తెలుగు పరిశ్రమకు రావడం ఇది రెండో ఇన్నింగ్స్‌గా భావిస్తున్నాను. ప్రస్తుతం సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో తరుణ్, ఆకాష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నాను. నాతో పాటు.. ప్రియమణి మరో హీరోయిన్. జయాపజయాలు అనేవి సహజమే. నటింగా 'సింహాద్రి' చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతకంటే మంచి సక్సెస్ ఇక్కడే సంపాదిస్తాను. ఆ నమ్మకం నాకుంది. రెండు మూడు సినిమాలు నటించాక మళ్లీ కనిపించని వాళ్లు చాలా మంది ఉన్నారు. వారికంటే నేనెంతో అదృష్టవంతురాలిని. ఎందుకంటే మళ్లీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్ర.. సెంటిమెంట్ పట్ల మీ అభిప్రాయం?
మూడేళ్ళ వయస్సులో నన్ను మూద్రా ఏజెన్సీస్ 'ఐ లవ్ యు రస్నా' అనే యాడ్ ద్వారా పాపులర్ చేసింది. హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది. అందుకే దక్షిణ భారతదేశంలోనే స్థిరపడిపోవాలని సెంటిమెంట్‌గా ఫీలయ్యాను. ఏది ఏమైనా గడచినదేదే గడచిపోయింది. శుభఘడియలు ఈ రోజునుంచి ప్రారంభమయ్యాయి. నా లక్కీ నెంబర్ తొమ్మిది. పుట్టిన రోజు 27. (2+7). ప్రస్తుతం నా వయస్సు 25 సంవత్సరాలు.

ప్ర.. మీ జీవితాశయం ఏమిటి?
అం.. ఈ మధ్య చాలాకాలం తెలుగు పరిశ్రమలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో యూఎస్ వెళ్లాను. అక్కడ స్క్రిప్ట్ వర్క్‌లోను , దర్శకత్వ శాఖలోను శిక్షణ పొంది వచ్చాను. పాజిటివ్‌గా ఆలోచించడం కూడా నేర్చుకున్నాను. ఏ రంగంలోనున్న వారికైనా ఇలా ఆలోచించడం చాలా మంచిదని భావిస్తున్నాను. అలా ఉన్నపుడే సక్సెస్ అవ్వగలరని తెలుసుకున్నాను.
ప్ర.. మీ మనోభావాలు ఎలా ఉంటాయి?
అం.. నేను మూడీ మనిషిని. రకరకాల మనస్తత్వాలు గల వ్యక్తుల్ని పరిశీలించాను. అందుకే ఎవరితోను ఎక్కువగా మాట్లాడను. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. యూఎస్ వెళ్లాలనిపించి వెళ్లి వచ్చాను. న్యూమరాలజీ నమ్ముతాను.

ప్ర.. ఐటమ్ సాంగ్‌లు చేయడం తప్పుగా భావించడం లేదూ?
అం.. రవితేజ నటించిన 'ఖతర్నాక్' చిత్రంలో ఐటం సాంగ్ చేశాను. ఆతర్వాత అటువంటి అవకాశాలే వచ్చాయి. కథానాయికగా చేసి ఐటమ్ సాంగ్‌లలో చేయడం తప్పని తెలుసుకున్నాను. అందుకే తదుపరి అంగీకరించలేదు. 'సింహాద్రి' తర్వాత అటువంటి పాత్ర మళ్లీ రాలేదు. ఆ చిత్రం నాకెంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. జాలీగా ఉండే పాత్రలు, హోమ్‌లీ పాత్రలు చేయడమంటే నాకెంతో ఇష్టం.

ప్ర.. ఎక్స్‌పోజింగ్ పట్ల మీ అభిప్రాయం?
అం... సినిమా అంటేనే షో, గ్లామర్ వ్యాపారం. ఆధునికయుగంలో ఎక్స్‌పోజింగ్ ఒక భాగమైంది. నేనే కాదు. నేడు చాలామంది హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. 'లాహిరిలాహిరిలో..' చిత్రంలో హోమ్‌లీగా నటించాను. అలా చాలా చిత్రాల్లో చేశాను. మొత్తం 13 చిత్రాల్లో నటించాను. అందులో 'ఇంద్ర' రీమేక్ చేసిన కన్నడ చిత్రంలో ఒకటి. ఓ తమిళ చిత్రంలోను నటించాను.

ప్ర.. మీ గ్లామర్ రహస్యం?
అం.. ఏ ముందీ.. యోగా, డైటింగ్, వ్యాయామం చేస్తున్నాను. అందుకే అంతకుముందున్నదానికంటే.. కాస్త బరువు తగ్గాను. ఇపుడంతా చాలా స్లిమ్‌గా ఉన్నావని అంటున్నారు.

ప్ర .. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది?
అం.. నాన్నగారు గుజరాతీ. నగల వ్యాపారీ. నా చెల్లెలు అక్షిజవేరి ఆ వ్యాపారం చూసుకుంటూ నాన్నకు తోడుగా ఉంటుంది. అమ్మ అందరిగా గృహిణి. సినిమా రంగంలో ప్రవేశించడానికి కుటుంబసభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. సో.. నా పూర్తి పేరు అక్షిఅంకిత.
About Writer
WD