1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

మెగాస్టార్‌లా లాంగ్‌టర్మ్ నటుడు కావాలి : ఉదయ్‌కిరణ్

మెగాస్టార్‌లా లాంగ్‌టర్మ్ నటుడు కావాలి : ఉదయ్‌కిరణ్
ఉదయ్‌కిరణ్. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి. తొలి ''చిత్రం''తో ఉదయించే కిరణంలా దూసుకువచ్చి ''నువ్వు-నేను'' చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకున్న నటుడు.
WD
'మనసంతానువ్వే'తో హాట్రిక్ కొట్టిన ఉదయ్ ఆ తర్వాత పలు చిత్రాలు చేసిన అంతగాపేరు దక్కలేదు. మధ్యలో తన పెండ్లి విషయంలో కొంత కలతచెంది దాదాపు 4 సంవత్సరాలుపాటు సినీరంగానికి దూరంగా ఉన్నాడు. బాలచందర్ చిత్రం 'పొయ్' ( తెలుగులో 'అబద్దం') ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఉదయ్‌కిరణ్‌తో 'ఎవడిగోల వాడిది' చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ 'వియ్యాలవారి కయ్యాలు' అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఉదయ్ పుట్టినరోజు రావడం గమనార్హం. జూన్ 26న ఆయన పుట్టిన రోజు. యాదృశ్చికమేమంటే 26 సంవత్సరాలు పూర్తయి 27వ వసంతంలోకి ప్రవేశించడం. తన పుట్టిన రోజును పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో కొద్ది మంది విలేకరులతో ముచ్చటించారు.


'వియ్యాలవారి కయ్యాలు'లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు?
నా పాత్ర స్టైలిష్‌గా ఉంటుంది. బ్యుటీషియన్‌గా నటిస్తున్నాను. బార్బర్‌కు, హెయిర్ స్టైలిస్ట్‌కు తేడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు చేసిన చిత్రాలకంటే భిన్నమైన పాత్ర. నా పాత్ర, శ్రీహరి, షిండే పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. లగడపాటి శ్రీధర్‌గారు ఈ కథ‌కు ముందు రెండు కథలు చెప్పారు. ఇంకా మెరుగైన కథకావాలని అడిగితే 'వియ్యాలవారి కయ్యాలు' కథ చెప్పగానే అందరికీ నచ్చే అంశాలున్నాయని వెంటనే అంగీకరించాను.

కథల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నాకున్న క్లాస్ ఆడియన్స్, లేడీ ఫాన్స్‌ను దృష్టిలోపెట్టుకుని.. నన్ను.. ఇలా ఉంటే చూడాలనుకుంటున్నారని వారికి నచ్చినవిధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.

అందరూ మాన్‌హీరోగా ఎదగాలని చూస్తుంటారు? మరి మీరు?
మాస్ హీరోగా అనేది ప్రేక్షకుడి దృష్టిలో నానాలి. ఉదయ్‌కిరణ్ అంటే సిటీలో తప్పితే గ్రామాల్లో తెలీదు. నాకంటూ ఒకరకమైన ఆడియన్స్ ఉన్నారు. ముందువారిని శాటిస్‌పై చేయాలి. ఒక్కో మెట్టు ఎక్కినట్లుగా వెళ్ళాలి. ఒకేసారి మాస్ హీరో అవ్వాలనుకుంటే కుదరదు. ఇలాంటి విషయాల్లో సీనియర్ నటుల్ని ఆదర్శంగా తీసుకుంటాను. వాళ్ళు ఎలా పైకి వచ్చారు. మాస్ హీరోగా ఎన్నాళ్ళకు నిలదొక్కుకున్నారనేవే పరిశీలిస్తుంటాను.

తమిళ చిత్రాలపై శ్రద్ధ చూపుతున్నట్లున్నారు?
నేనేమీ తమిళరంగానికి జంప్‌కాలేదు. హీరోగా పదిమందికి తెలియాలి. మనవాళ్ళే‌కాక పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆదరించాలనుకోవడం తప్పుకాదుగా.
పొయ్ తర్వాత అవకాశాలెలా ఉన్నాయి?
బాలచందర్ ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. హిట్ కాకపోయినా ఆ చిత్రం తర్వాత ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం 'వంబు సండై' అనే తమిళ చిత్రం చేస్తున్నా. త్వరలో విడుదలకానుంది.

బాలచందర్ వంటి పెద్ద దర్శకుని సినిమాలో చేసినా ఆ సినిమా ప్రజల్లో చేరకపోవడానికి కారణం?
ఆ సినిమా విడుదలయ్యాక తోటి నటులు, శ్రేయోభిలాషులు ఒకటే అన్నారు. సినిమా ఎలా ఉంది అనేకంటే... ఇంతకాలం గ్యాప్ తర్వాత సినిమాచేశావా లేదా? అన్నదే చూడాలి. పైగా పేరున్న దర్శకుడి సినిమా అని అభినందించారు. బాలచందర్‌గారితో పనిచేసిన ఒక్కో నిముషం అదృష్టంగా భావిస్తున్నాను. 'అబద్ధం' సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆయనతో పనిచేయడమే అవార్డు వచ్చినంత సంతోషంగా ఉంది.

గ్యాప్ ఎలా అనిపించింది?
అబద్రతా భావానికి లోనయ్యాను. తెలుగువారికి దూరం అయ్యానని అనుకున్నా. నా సినిమా చూడాలనుకున్న వారికి టైప్ గ్యాప్ కంటే క్వాలిటీ ముఖ్యమని కూడా తెలుసుకున్నాను. తెలిసోతెలియకో సినీపరిశ్రమలోకి రావడం, ఊహించని రేంజ్‌కు వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. మొట్టమొదటి సినిమానే హిట్. అలా వరుసగా సిల్వర్‌జూబ్లీ వంటి సినిమాలు చేశాను. అది అదృష్టంగా భావిస్తున్నాను. దాని తర్వాత ఎటువంటి సినిమా చేయాలా? అన్న సందిగ్ధానికి కూడా గురయ్యాను. 'నీకు నేను నాకు నువ్వు', 'లవ్‌టుడే' వంటి బ్యాడ్ సినిమాలు ఎప్పుడైతే చేశానే ప్రేక్షకులికి దూరమయ్యాను. పీక్ స్టేజీ నుంచి అగాథంలోకి వెళ్ళినట్లయింది.

ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా క్రింది స్థాయికి పడిపోవడం మీ స్వయం కృపరాథమా?
అది దౌర్భాగ్యం అని కొట్టిపారేయలేను. సక్సెస్‌లో ఉండగా తగు నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ కావడం. ఏది సరైందో, కాదో చెప్పే వ్యక్తులు దొరక్కపోవడం. అదంతా మేజింగ్‌లా జరిగిపోయింది. హీరోగా చేసుకుంటూ పోవడమేకగానీ సినిమా వెనుక ఉన్న వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోలేకపోయాను. అందుకే సరైన టైమ్‌లో సక్సెస్ రాలేదు. ఆ విషయాల్లో ఇప్పటికీ బెటర్‌కాలేదు. గతంకన్నా కొంచెం బెటర్. ఏది ఏమైనా ఒక్కసారి ఫెయిల్ అయితే లైన్‌లోకి వస్తాం. అలా జరగడం మంచికే అనుకుంటున్నాను.

'వియ్యాలవారి కయ్యాలు' అనే టైటిల్ మీ నిజజీవితానికి సరిపోతుందనుకుంటున్నారా?
(పెద్దగా నవ్వి) దానికి అదనపు మీనింగ్ తెలీదు. ఎవరితోనూ వియ్యం రాలేదు. ఇంక కయ్యం ఎక్కడిది. గతంలో కృష్ణగారు నటించిన సినిమా టైటిల్ ఇది. నిర్మాత శ్రీధర్‌గారే ఈ టైటిల్ పెట్టారు.

శ్రీహరి లాంటి హీరోతో కలిసి చేయడం వల్ల మీకు మైనస్ అనిపించిందా?
ఆయనతో చేయడంవల్ల నష్టమా.. అన్న భయం కలగలేదు. కాకపోతే సెట్లో ఆయన్ను చూస్తే భయమేసేది. గంభీరంగా ఉండేవారు. ఆయన పనిచేసే విధానం నచ్చింది. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనతో నటించినా ఆయకున్న ఆడియన్స్ వేరు. నాకున్న ఆడియన్స్ వేరు. అలాగే అవకాశం ఉంటే నాతోటి హీరోలతో కలిసి నటించడంలో అభ్యంతరంలేదు. కానీ రాజకీయాలు లేకుండా ఉంటేనే...

లవ్ పట్ల మీ ఫీలింగ్?
ఇప్పుడు అందులో పరిపక్వత చెందాను. మెచ్చూర్డ్ వచ్చి రీసెర్చ్ పెరిగింది. లవ్‌ ఒక పట్టాన విశ్లేషించే విషయం కాదు.

భవిష్యత్ ప్రణాళికలు?
ఎక్కువ సినిమాలు చేయాలనేదే. స్లో అండ్ స్టడీ... పాలనీ. గబగబా సంపదించేసి వేరేట్రాక్‌లో వెళ్ళాలని సినిమారంగంలోకి రాలేదు. మెగాస్టార్‌ను ప్రజలు ఎలా చూస్తున్నారు. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి నేను అనా వుండాలి. ఫలానా అప్పుడు ఉదయ్‌కిరణ్ అని చెప్పుకోకుండా... లాంగ్ టర్మ్‌గా ఎదగాలి. నాకు ఊహతెలిసినప్పుటి నుంచీ చిరంజీవి చిత్రాలు చూస్తున్నాను. ఇప్పుడూ చూస్తున్నాను. నా చిత్రాలూ అలా కావాలి. నాతోపాటే ఆడియన్స్ పెరగాలి.

చిరంజీవి కుమార్తె వివాహంపై మీరెలా ఫీలవుతున్నారు?
చదువు ఉద్యోగం, పెండ్లి అనేవి జీవితంలో భాగాలు. ఒకరి చెడుగురించి ఆలోచించే ధోరణికాదు. అందరూ మంచిగా ఉండాలి.

చాలా కాలం మీడియాకు దూరంగా ఉండడానికి కారణం?
నేను రిజర్వ్‌గా ఉండడం వల్లనేమో అలా జరిగి ఉండవచ్చు. నా జీవితం లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉంది. వరసనే సక్సెస్‌లు చూస్తే తట్టుకోలేకపోయేవాడ్ని. తక్కువ వయస్సులోనే ఇలా జరగడం హ్యాపీగా ఉంది. నాలుగేళ్ళపాటు ధైర్యాన్ని కూడకట్టుకున్నా. ఇప్పుడు రైజింగ్ పొజిషన్‌లో ఉన్నాననుకుంటున్నాను. నేను మొట్టమొదటి నుంచి ముగ్గురు 'పి'లంటే ఇష్టం, 'పబ్లి‌క్', 'ప్రెస్', 'ప్రొడ్యాసర్స్'. బహుశా ఆ టైమ్‌లో చివరి 'పి'కి దూరమయ్యానుకుంటా.
About Writer
WD