1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

వేదికతో వెబ్‌దునియా టాక్

మగాళ్లకేకాదు ఆడవాళ్ళకూ ముఖ్యం: వేదిక
రెండేళ్ళ క్రితం జగపతిబాబు, అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన ద్విబాషా చిత్రం ''శివకాశి'' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయినప్పుడు వేదికను ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఉండే హిట్‌ఫార్ములా ఆమెకు లేకపోవడంతో వెనుకడుగువేసింది. కానీ ఆమెలోని భరతనాట్య ప్రావీణ్యాన్ని కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ గుర్తించాడు.

ద్విబాషా చిత్రంగా తీసిన ''ముని‌''లో అవకాశం కల్పించాడు. ఆ సినిమా మోస్తరుగా ఆడడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. చూపులకు సదా, నగ్మాల్లా కన్పించడం ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ప్రస్తుతం ఆమె నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన విజయదశమిలో నటిస్తోంది. ఇటీవలే ఆ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోని నానక్‌రామగూడా సినీవిలేజ్‌కు వచ్చిన సందర్భంగా ''వెబ్‌దునియా తెలుగు'' పలుకరించింది.

మీ గురించి చెప్పండి?
నా మాతృభాష కన్నడ. పుట్టింది పెరిగింది ముంబాయిలో. లండన్‌లో ఎం.ఎస్.సి (మార్కెటింగ్) చేశాను. చిన్నతనం నుంచి ఏదో కొత్తదనంగా కనబడాలనే అనుకునేదాన్ని. పెద్దయ్య ఏ రంగంలోనైనా సృజనాత్మకతను ప్రదర్శించాలనే భావాలు అలవడ్డాయి. ఆ ఆలోచనే కొన్ని యాడ్స్‌లో చేసేందుకు ప్రేరేపించింది.

సన్‌ఫీస్ట్ యాడ్‌లో హీరో సూర్యతో కలిసి చేశాను. ఆ తర్వాత ఆయుర్ యాడ్ చేశాను. అది మంచి పేరు తెచ్చింది. ఇక మోడల్‌గా గుర్తింపు వచ్చింది. నా మోడలింగ్ హీరో అర్జున్ దృష్టిలో పడడం. ఆయన నటించి, దర్శకత్వం వహించే "శివకాశి''లో (తమిళ్‌లో 'మదరాసి' దాని పేరు) అవకాశం రావడం జరిగిపోయాయి.

తొలి సినిమానే నిరాశపర్చడాన్ని ఎలా ఫీలయ్యారు?
గొప్ప నటుడి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందమేసింది. పైగా రెండు భాషల్లో రూపొందండం వల్ల మంచి హిట్ సినిమా అవుతుందని భావించాను. కానీ ఆదిలోనే హంసపాదులా అయింది. అయినా ఈ రంగంలో ఇవన్నీ మామూలేనని అర్జున్‌గారు నాకు ఆ తర్వాత ధైర్యాన్నిచ్చారు. అయినా అది పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు రాలేదు.

ఆ గ్యాప్‌లో ఏంచేశారు?
నాకు డాన్సంటే ప్రాణం. చిన్నతనంలోనే భరతనాట్యం, కథక్, జాబ్‌లో శిక్షణ పొందాను. యాడ్స్ చేస్తూనే అవకాశం వస్తే నాట్యప్రదర్శన ఇచ్చేదాన్ని.

''విజయదశమి''లో అవకాశమెలా వచ్చింది?
మొదటి సినిమా మోడలింగ్ ద్వారా అవకాశం కల్పిస్తే. ముని చిత్రం ద్వారా సముద్ర నాకు ఈ అవకాశాన్ని కల్పించారు.

ఎలాంటి నటి కావాలనేది మీ అభిలాష?
మొదటి సినిమా మోడలింగ్ ద్వారా అవకాశం కల్పిస్తే. ముని చిత్రం ద్వారా సముద్ర నాకు ఈ అవకాశాన్ని కల్పించారు.

ఎలాంటి నటి కావాలనేది మీ అభిలాష?
మొదటి నుంచి ఏదో కొత్తదనాన్ని చూపించాలనే ఉవ్విళూరుతూ ఉంటాను. నేను చేసే భరతనాట్యం కూడా అంతే. అదే సినిమాలకు అప్లయి చేస్తాను. భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటాను. గ్లామర్‌ను ప్రదర్శిస్తూనే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించాలనుంది.

అన్ని సినిమాల్లోనూ అటువంటి అవకాశంరాదుగదా?
కరెక్టే. అందుకే ఎడాపెడా వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోను. ప్రస్తుతం 'విజయదశమి'లో నటిస్తున్నాను. అది ఫ్యామిలీసెంటిమెంట్ ఉన్న సబ్జెక్ట్. నా పాత్ర వైవిధ్యమైన పాత్ర. తమిళ్‌లో విజయం సాధించిన శివకాశి చిత్రమది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించి నాకు పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

మీ నటనకు స్పూర్తి ఎవరు?
నా అభిమాన నటి శ్రీదేవి. గ్లామర్‌ను ప్రదర్శిస్తూనే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించింది. వర్మ చిత్రం ''క్షణక్షణం''లో ఆమె నటించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి పాత్రలు మదిలో నిలిచిపోతాయి.

తీరికవేళల్లో మీ వ్యాపకాలు?
బాస్కెట్‌బాల్, బాడ్మింటన్ ఆడతాను. ఛాంపియన్ అవ్వాలని కాదు. ఇవన్నీ ఫిట్‌నెస్ కోసమే. ఫిట్‌నెస్ మగవారికే కాదు. ఆడవాళ్ళకూ ఎంతో ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాంగదా.

కొత్త చిత్రాలు?
''దిల్'' రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్నాను. ఇటీవలే టాక్స్ పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి కులుమనాలిలో పాటలు చిత్రీకరణ కోసం వెళుతున్నారు. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో తిరిగి వచ్చి విజయదశమిలో ఆఖరి షెడ్యూల్లో పాల్గొంటాను.

తెలుగు సినిమా రంగం ఎలాఉందని భావిస్తున్నారు?
జాతీయస్థాయిలో తెలుగు సినిమారంగానికి ప్రత్యేక స్థానముంది. ఇక్కడ సక్సెస్‌లు ఎక్కువగా ఉన్నాయని విన్నాను. ఇక్కడవారికి వృత్తిపట్ల అంకిత భావం ఉంది. పరబాషీయులను గౌరవించే సంప్రదాయం ఎంతో నచ్చింది.

నటిగా మిమ్మల్ని ప్రశంసిస్తే ఎలా ఫీలవుతారు?
(నవ్వూతూ) ఇటీవలే విజయదశమి షూటింగ్ నిమిత్తం జర్మనీ వెళ్ళాం. అక్కడ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. అంత చలిలోకూడా డాన్స్ చేయాల్సి వచ్చింది. వెంటనే చేసేశాను. చలికి తట్టుకోవడానికి ఎక్సర్‌సైజులు చేసి పాట చిత్రీకరణలో పాల్గొన్నాం.

మీ లాంటి హీరోయిన్లుంటే నిర్మాతలకెంతో లాభమంటూ దర్శకుడు సముద్ర ప్రశంసించారు. కొంత మంది హీరోయిన్లు వాయిదా వేద్దామంటారని దర్శకుడు చెప్పారు. ఆ ప్రశంస రావడానికి హీరో కళ్యాణ్‌రామ్ ప్రోత్సాహం కూడా ఉంది. ఆయన ఎంతో ఎంకరేజ్ చేసేవారు.

మీకు ఇష్టమైన దుస్తులు?
చీరె, జీన్స్ రెండూ ఇష్టం.
About Writer
PNR