1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

చాలా ఇష్టమైన పాత్ర అది: మమతామోహన్ దాస్

చాలా ఇష్టమైన పాత్ర అది మమతామోహన్ దాస్
WD PhotoWD
ఒకప్పుడు నటి అంటే పాటలుకూడా పాడాల్సివచ్చేది. రాను రాను దానికి ప్రాధాన్యత పోయి నటిగా సరిగ్గా చేస్తే చాలు అనే స్థితికి పరిస్థితులు మారాయి. గాయనిగా, నటిగా భానుమతి రామకృష్ణ పెట్టింది పేరు. కాలమార్పుల రీత్యా రెండింటికి న్యాయం చేసేవారు చాలా అరుదు. అటువంటి వ్యక్తుల్లో మమతా మోహన్‌దాస్‌ను చెప్పుకోవచ్చు.

"రాఖీ రాఖీ రాఖీ నా కవ్వాసాకీ..."అంటూ యువతను ఉర్రూతలూరించిన ఆమె తర్వాత "శంకర్‌దాదా జిందాబాద్" "ఆకలేస్తే అన్నం పెడతా..." అంటూ మాస్‌ను తన గాత్రంతో బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆర్. ఆర్. మూవీమేకర్స్ పతాకంపై రవి సి.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో నితిన్ పక్కన మమతా నటిస్తోంది. ఈ సందర్భంగా గురువారం నాడు రామానాయుడు స్టూడియోకి వచ్చిన సందర్భంగా ఆమెతో కాసేపు...

ప్రశ్న: గాయనిగా, నటిగా రెండింటిలో మిమ్మల్ని డామినేట్ చేసేది ఏది?
రెండూ సమానంగానే స్వీకరిస్తున్నాను. డామినేట్ అనేది ఖచ్చితంగా చెప్పలేను. రెండూ ప్రాధాన్యతగలవే. నా పాత్రకు నేనే పాడితే దానికను గుణంగా నటించాలి. ఆ పాత్ర నటించినప్పుడు దానికనుగుణంగా పాడాలి. రెండూ సమానమే.

ప్రశ్న: శంకర్ దాదాలో నటించకపోయినా పాడారు కదా... ఇలా కంటెన్యూ చేస్తారా?
గాయనిగా కెరీర్ ఎక్కువ రోజులు ఉంటుంది. నటిగా వయస్సు అయ్యాక పాత్రలు చేయలేం. కానీ గాత్రం అలా కాదు. నటించకపోయినా గాయనిగానే కొనసాగుతాను.

ప్రశ్న: ఇందులోనూ పాట పాడుతున్నారా?
ఒక పాట పాడుతున్నాను. సంగీత దర్శకుడు చక్రి మెలోడి బేస్‌డ్ చక్కటి ట్యూన్ ఇచ్చారు. దాన్ని ఇంకా రికార్డ్ చేయాలి. ఇప్పటివరకు పాడిన పాటల్లో మంచి మెలోడి పాటగా పేరు వస్తుందనుకుంటున్నాను. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు రవి. సి. కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్రశ్న: మీరు నటించే చిత్రాలన్నింటిల్లో పాడతారా?
అవకాశాన్ని బట్టి పాడతాను. ఇంకా సింగర్స్ చాలామంది ఉన్నారు కదా... అన్నీ నేనే పాడేస్తే వాళ్ళంతా ఏమయిపోవాలి (నవ్వుతూ)

ప్రశ్న: సినిమా రంగంలోకి రావడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు?
మాది కేరళ. అమ్మ గృహిణి, నాన్న బ్యాంక్‌లో పనిచేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కొన్నాళ్ళు ఉన్నాం. అక్కడ నుంచి ఫ్యామిలీ బెంగళూరు షిఫ్టయింది. బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. అసలు నటిని కావాలనే అనుకోలేదు. డిగ్రీలో ఉండగా ఓ పెండ్లికి వెళ్లాను. అక్కడ మలయాళ దర్శకుడు హరిహరన్ నన్ను చూసి తన సినిమాలో నటించమని అడిగారు. అవకాశం ఉండి వెళ్ళి నటించాను. ఇదంతా యాదృశ్చికంగా జరిగిందే.

ప్రశ్న: యమదొంగలో మీ పాత్రకు ఎటువంటి గుర్తింపు వచ్చింది?
తారక్, రాజమౌళి కాంబినేషన్‌లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అందులో ధనలక్ష్మి పాత్ర చేశాను. పెర్‌ఫార్మెన్స్‌కు అవకాశం ఉంది. బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ వైవిధ్యమైన పాత్ర చేశాను. తెలంగాణ మాండలికంలో హావభావాలు వ్యక్తం చేస్తూ చేయాల్సివచ్చింది. చాలా ఇష్టమైన పాత్ర అది. ఇకముందు చేయబోయే చిత్రాల్లో అటువంటి పాత్ర రాదు. ఐలైక్ ధనలక్ష్మి.
WD PhotoWD


ప్రశ్న: "ఓ లమ్మీ తిక్కరేగిందా..." పాట పాడినప్పుడు మీరు పొందిన అనుభూతి?
నేను సినిమాల్లోకి రాకముందే ఎన్టీఆర్ చిత్రాలు చూశాను. ఆయన నటించిన చిత్రంలోని పాటను పాడుతున్నానని తెలిసి కొంచెం గర్వంగా ఫీలయ్యాను. ఆ పాట పాడిన తర్వాత "మీ వాయిస్‌తో ఈ పాటకు కొత్త అందం వచ్చిందని" కీరవాణి అభినందన మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ప్రశ్న:గాయనిగా ఎలా మారారు?
ఉత్తరప్రదేశ్ సుధాకర్ దేవ్లే అనే గురువు వద్ద హిందూస్థానీ సంగీతం నాలుగేళ్ళు నేర్చుకున్నాను. చిన్నతనంలోనే బెహ్రెయిన్‌లో కర్నాటక సంగీతం నేర్చుకున్నాను. అలా చిన్నప్పుడే తెలిసిన వారి ఫంక్షన్లో పాడేదాన్ని. నా గురించి కొరియోగ్రాఫర్ సుచిత్రకు బాగా తెలుసు. ఆమె ఓసారి దేవీశ్రీ ప్రసాద్‌కు చెప్పడంతో "రాఖీ రాఖీ..." పాట ట్యూన్ ఇచ్చి పాడమన్నారు. మొదటిసారి వినగానే ఓకే చేశారు.

ప్రశ్న: ఈ ఫీల్డుకు రాకపోయి ఉంటే ఏమి చేసేవారు?
ఉన్నత విద్యకోసం రష్యా వెళ్ళాలని అనుకున్నాను. నాకు తెలిసిన కంప్యూటర్స్‌లో ప్రయోగాలు చేసేదాన్ని.

ప్రశ్న: కొత్త చిత్రాలు?
ప్రస్తుతం వాసు దర్శకత్వంలో విష్ణుపక్కన నటిస్తున్నాను. అందులో నాగార్జునకూడా మంచిపాత్ర పోషిస్తున్నారు. జెడి. చక్రవర్తి రూపొందిస్తున్న "హోమం"లో జగపతిబాబు పక్కన నటిస్తున్నాను. ఇంకా రెండు చిత్రాలు కమిట్ అయ్యాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా...
About Writer
Selvi