రిషీకపూర్ కుమారుడు రణవీర్ కపూర్ సావరియా చిత్రం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించటానికి రంగం సిద్ధమైంది. అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సహజంగానే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రణవీర్‌తో ఇంటర్యూ...
ప్ర: ఆర్ కె బ్యానర్ నుంచి చాలా మంచి చిత్రాలు వస్తుంటాయి. మీ కుటుంబంలో కూడా చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ మీరు బయటి బ్యానర్ వారి చిత్రంతో మీ కెరీర్‌ను ఎందుకు ప్రారంభించబోతున్నారు? జ: మేము మంచి కథకోసం వెతికాం. కానీ అనుకున్న కథ లభించలేదు. ఇంతలో అకాస్మాత్తుగా సంజయ్‌కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఆయన మంచి పేరున్న దర్శకుడు కావటంతో వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే త్వరలోనే మా బ్యానర్‌లో కూడా ఓ సినిమా చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను.
ప్ర: మీరు సినిమా చేస్తున్నప్పుడు మీ నాన్న, తాతల నటనలతో మీ నటనను పోలుస్తున్నారేమోనన్న ఒత్తిడి మీలో కలుగుతోందా? జ: నాలో అలాంటి ఒత్తిడికి లొంగిపోయే లక్షణాలుంటే ఈ పాటికే మరింత కృంగిపోయి కనిపించేవాడిని. ముఖ్యంగా గొప్ప వంశంలో పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. కానీ నేను పూర్తిగా సినిమాకు కొత్తవాడిని. ఆ మహానుభావులతో నన్ను పోల్చటం సరికాదు. నేను కేవలం వారి అభిమానిని మాత్రమే. నా నటనకు సంబంధించి ప్రేక్షకులు తమ నిర్ణయాన్ని కేవలం సినిమా చూశాక మాత్రమే నిర్ణయించగలరు.
ప్ర: సావరియా గురించి కాస్త చెపుతారా? జ: ఇది ఒక అద్భుత ప్రేమ కథ ఆధారంగా రూపొందిన చిత్రం, ఎంతో మనసుపెట్టి సంజయ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని సంజయ్ చిత్రం అనడమే సముచితం.
ప్ర: సావరియా చిత్రంలో మీకు సల్మాన్, రాణీ ముఖర్జీలతో నటించే అవకాశం దక్కింది కదా... ఆ అనుభవం ఎలా ఉంది? జ: సల్మాన్ వద్ద నటనకు సంబంధించి ఎన్నో మెలకువలు తెలుసుకున్నాను. రాణి అద్భుతమైన నటి. ఆమె నన్ను బాగా ప్రోత్సహించింది. వారితో కలిసి నటించటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.
ప్ర: మీ నాన్నగారు ఎంతోమంది కొత్త హీరోయిన్లతో నటించారు. మీరు కూడా ఆయన బాటలోనే పయనిస్తారా? జ: చాలా మంది కథానాయికలతో మా నాన్నగారికి కలసిరాలేదు. అందుకే ఆయన కొత్తవారితో నటించాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నాకు రాకుండా ప్రయత్నిస్తాను. అలాగని కొత్త హీరోయిన్లతో నటించటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు.
ప్ర: మీ నాన్నగారు సావరియా చూశారా? జ: చూడలేదు. నేను ఆయన ప్రతిస్పందనకోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏదీ మనసులో దాచుకోరు. మనసులో ఏది అనిపిస్తే దానిని ముఖానే చెప్పేస్తారు.
ప్ర: సోనమ్‌కి సంబంధించి మీకు నచ్చని అంశం ఏమిటి? జ: కొంచెం అతిగా మాట్లాడుతుంది.
ప్ర: రాజ్ కపూర్, సంజయ్‌లీలా భన్సాలీలలో ఒకర్ని కోరుకోమంటే ఎవర్ని కోరుకుంటారు? జ: రాజ్ కపూర్
ప్ర: భవిష్యత్తులో మీరు ఎటువంటి పాత్రలు చేద్దామనుకుంటున్నారు? జ: ఒకే రకమైన చట్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు. రొమాంటిక్, యాక్షన్, కామెడీ... ఇలా అన్ని రకాలైన పాత్రలను చేయాలని ఉంది.
ప్ర: 'సావరియా', 'ఓం శాంతి ఓం' ఒకే రోజున విడుదలవుతున్నాయి కదా! ఇది సావరియా చిత్ర విజయావకాశాల మీద ప్రభావం చూపదని మీరు భావిస్తున్నారా? జ: షారుఖ్ ఉండటంతో సహజంగానే 'ఓం శాంతి ఓం'కి క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఆ సినిమా హిట్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. కాని ఓ విషయం... రెండూ హిట్టయితే మాత్రం 'సావరియా'నే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుంది.
|