ప్రశ్న: ఏవిధమైన తప్పులు చేశారని భావిస్తున్నారు? జ: చాలామంది కథ బాగా చెప్పగలరు. కానీ ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేరు. దీనివల్ల కొన్ని చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అవి ఏమిటనేవి మీకూ తెలుసు. అయినా నా పాత్రపరంగా బాగా చేశాననే అనిపించుకున్నా.
ప్రశ్న: "ఆనంద్" లాంటి విజయవంతమైన చిత్రంలో నటించి కూడా ఆ తరువాత మీకు ఎక్కువగా గ్యాప్ రావడానికి కారణం? జ: నేను ఆశించినంత మంచి అవకాశాలు రాకపోవడంతో దేనినీ ఒప్పుకోలేను. దీర్ఘకాలం ఈ పరిశ్రమలో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే తొందరపడి సినిమాలు చేయాలనుకోవట్లేదు. మంచి అవకాశాల కోసం వేచి చూద్దామనే ఉద్దేశంతోనే ఆచితూచి అడుగులేస్తున్నాను.
ప్రశ్న: మీరు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఆశిస్తున్నారు? జ: ఎలాంటి పాత్రలైనా చేయడానికి నేను సిద్ధమే. దాంతో పాటు ప్రేక్షకులు నన్ను నటుడిగా గుర్తు పెట్టుకునే పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏది చేయాలన్నా అది ఈ వయస్సులోనే... 40 ఏళ్ళ తర్వాత ఎవ్వరు ఇవ్వరు కదా.
ప్రశ్న: హీరోగా చేస్తూ సపోర్టింగ్ పాత్రలు చేయడానికి కారణం? జ: ఒక్కటే... మనీ... ఒక సమయంలో నా చేతిలో సినిమాలు లేవు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి. పోషణకు చాలా ఖర్చవుతుంది. ఆ సమయంలో ఎలా? అనే ఆలోచనలో పడ్డ సమయంలో ఓసారి దర్శకుడు గుణశేఖర్ ఫోన్ చేసి మహేష్‌బాబు పక్కన నటించే పాత్ర ఉంది అన్నారు. వెంటనే "థ్యాంక్ గాడ్" అనుకున్నాను. ఆ తర్వాత "బంగారం" ఇలా కొన్ని చిత్రాల్లో చేశాను. ప్రస్తుతం శ్రీహరి సినిమాలో కూడా చేస్తున్నాను. నా సంతోషమే కాదు. నన్ను నమ్ముకున్నవారిని కూడా సంతోషపెట్టాలి.
ప్రశ్న: మీ లక్ష్యం? జ: సినిమా చరిత్రలో చక్కటి నటుల్లో నేను ఒకడని అనిపించుకోవాలనేదే..
|