1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ

వైవిధ్యమైన పాత్ర ముఖ్యం ఆలీ
WD PhotoWD
హాస్యనటునిగా, కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆలీ. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ తరహా పాత్రల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడీ వైవిధ్య పాత్రల నటుడు. ఒకవైపు కామెడీ తరహా పాత్రలను పోషిస్తూనే... మరో వైపు కామెడీ హీరోగాను నటిస్తు.. తనకెలాంటి పరిమితుల్లేవు అని నిరూపిస్తున్నాడీ సొట్టబుగ్గల ఆలీ.

యమలీల చిత్రంలో హాస్యాన్ని పండించడమే కాక అందులో హీరో పాత్రలోను డిగ్నీటీతో కూడిన నటనను కనబరిచాడు. కానీ యమలీల తర్వాత అంతటి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. అయితేనేం.. ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. కామెడీ పాత్రలతో ఇంత కాలం తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మళ్లీ ఇప్పుడు హీరోగా తిందామా.. పడుకుందామా.. తెల్లారిందా..చిత్రం ద్వారా రానున్నాడు. ఈ సందర్భంగా ఆలీతో ఓ చిన్న ఇంటర్వ్యూ...

మీ కొత్త చిత్రానికి ఈ టైటిల్‌నే పెట్టడానికి కారణం చెప్పగలరా..?
కారణం అంటూ ఏమీ లేదు గానీ... తొలుత ఏ టైటిల్‌ను ఖరారు చేయాలో తెలీక యూనిట్ అంతా చాలా వరకు ఆలోచించి చర్చించాం.. కానీ దొరక్కపోయేసరికి నేను ఇంటికి వెళ్లా.. ఇంటిలో మా పాప పోకిరి చిత్రం చూస్తోంది.. అందులో నేను వెళ్లేసరికి షిండే అంటున్న డైలాగ్స్ విన్నాను...అంతే ... ఈ చిత్ర కథ కూడా అందుకు తగ్గట్టుగా ఉండడంతో ఈ టైటిల్‌నే ఖరారు చేయడం జరిగింది.

మీ కెరీర్‌ గురించిన విశేషాలు ఏవైనా..?
కేరీర్.. చాలా వింతగా ఉంటుందండీ బాబు.. చిన్న చిన్న పాత్రల కోసం బాలనటునిగా మద్రాసులో తిరిగుతుండగా.. వాహినీ స్టూడియోలో ఓ తమిళ చిత్రంలో నటిస్తుండగా.. రామానాయుడు గారు వస్తే.. ఆయన్ను ఓ వేషం ఇమ్మని అడిగాను.

ఆయన సరేనన్నారు. రోజులు గడుస్తుండగా.. ఓ రోజు రూంకి రాగానే రూమ్మేట్ చెప్పాడు రామానాయుడు గారి మేనేజర్ వచ్చి వెళ్లాడని.. అయ్యొయ్యో ఇప్పుడెలా వచ్చిన అవకాశం పోయిందే అని ఫీలయ్యా.. కాని మా వాడు చెప్పాడు. మేనేజర్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లాడని..

సరేనని మేనేజర్‌కి ఫోన్ చేశా.. ఆయన ఉన్నపలంగా రమ్మనగానే బయలుదేరా.. నా దరిద్రం ట్రైన్ వెళ్లపోయింది. మరుసటి రోజు వరకు ట్రైన్ లేదు. సరే ఎలాగో ట్రైన్ పట్టుకుని వెళ్లుతుండగా మళ్లీ బ్రేక్... స్టేషన్ రాక ముందే ట్రైన్ ఆగిపోయింది ఎంటా అని చూస్తే.. జెండాలు పట్టుకుని ఎవరో రాస్తారోకోలు చేస్తున్నారు.

ఏంచేయాలో తెలీక నడుచుకుంటూ స్టేషన్‌కు వచ్చి అక్కడ రామానాయుడు స్టూడియోకు వెళ్లేందుకు ఆటో వాడిని అడిగితే రూ. 200 చెప్పాడు. హు... నా దగ్గర డబ్బుల్లేవు.. మళ్లీ నడక.. ఎలాగోలా కొండలు ఎక్కి స్టూడియో చేరుకుని రామానాయుడు గారికి జరిగిన విషయం చెప్పాను.

ఆయన సర్లే వెళ్లి స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పాడు. అలా వచ్చిన ఛాన్సే ప్రేమఖైదీ. మంచి పాత్రండీ అందులో. ఆ సినిమా బాగా హిట్ కావడంతో చాలా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందండీ.. ఇప్పుడు కారుల్లో వచ్చి వేషాలు ఇస్తుంటే.. నేను కూడా వేషాల కోసం కారులో స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాను.. కానీ రామానాయుడు గారి స్టూడియో చూసినప్పుడల్లా గతాన్ని మరిచిపోలేను..

హాస్యరస హీరోలు, రెగ్యులర్ హీరోలకు పోటీగా మారనున్నారా..?
ప్రేక్షకులు కామెడీ హీరోల నుంచి సీరియస్ యాక్షన్ చూడలేరు.. హాస్యాన్నే ఆశిస్తారు.. అలాంటప్పుడు రెగ్యులర్ హీరోలకు, కామెడీ హీరోలు ఎలా పోటీ కాగలరండీ..

కథల ఎన్నికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు...?
ముందు తీసుకునే వాడిని కాదు.. కాని ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఓ నిర్మాత నాకో వేషం ఉందని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి మంచి పాత్ర అని చెప్పాడు. సరేలే చిన్న వేషమే కదా ఎందకడగడం అని వదిలేశాను. తీరా.. షూటింగ్ అప్పుడు నా పాత్ర గురించి తెలిసి.. ముందు వెళ్లి నిర్మాతకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను.. అందులో నా పాత్ర దేశముదురు చిత్రంలో పోషించిన పాత్రే కావడం నాకు నచ్చలేదు. నాకు కథలో వైవిధ్యముండాలి.. నటించే పాత్రలోను వైవిధ్యముండాలి.. రొటీన్‌ను ఎప్పుడూ నేను ఆస్వాదించలేను. ఆ విషయాన్నే దర్శకుడికి చెప్పాను. అప్పటి నుంచి కథే కాదు నా పాత్ర గురించి కూడా తెలుసుకుంటున్నాను.
About Writer
Hanumantha Reddy