పాత్రపై పవిత్ర భావనతో ఉండేవాళ్లం: అంజలీదేవి
శుక్రవారం, 18 జనవరి 2008( 17:58 IST )
లవకుశ చిత్రంలో నటించేప్పుడు మీ ఫీలింగ్స్...?
నిజానికి లవకుశ మాత్రమే కాదు అప్పట్లో మేము చేసే ఏ పాత్రలోనైనా పవిత్ర భవనతో
ఉండేవాళ్లం. అంతేకాక సన్నివేశం గురించి ముందుగా దర్శకుడు చక్కగా వివరించేవారు. దీనివల్ల మాకు పాత్రలో ఎలా ఇన్‌వాల్వ్ అవ్వాలో ఇట్టే తెలిసిపోయేది. అప్పట్లో నటించడం తప్ప మరో పని పెట్టుకునే వాళ్లం కాదు.
హీరోయిన్‌గా నటిస్తూ కీలుగుర్రం చిత్రంలో రాక్షసి పాత్ర వేయడానికి గల కారణం..?
ఈచిత్ర నిర్మాత మీర్జాపూర్ రాజా.. ఈ పాత్ర చేయాలని అడిగారు.. నేను చేయనంటే సినిమా తీయనన్నారు. ఆ తర్వాత నువ్వు ఆర్టిస్టా... లేక అంజలీదేవివా.. అని అడగడంతో దాదాపు మూడు నెలల తర్వాత చేస్తానని ఒప్పుకున్నాను.
అప్పట్లో అభిమానులు మీమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు..?
అప్పట్లో అభిమానులను చూసినపుడు చాలా కొత్తగా అనిపించేది. మమ్మల్ని చూడగానే అరుపులు, కేకలు, ఈలలు వేస్తుంటే ఏదో తప్పు చేశామా అనే ఫీలింగ్‌తో భయం కూడా వేసేది. తర్వాత నాగేశ్వరరావుగారు అన్నారు. వాళ్లు మెచ్చుకుంటున్నారు.. తిట్టడం లేదులే.. అని చెప్పారు.
అప్పటి సినిమాల్లో గ్రాంథికం ఎక్కువగా వాడేవారు.. మరి మీకది కష్టంగా అనిపించలేదా..?
చిన్నతనంలోనే డ్రామాల్లో నటించాను కదా.. అప్పుడే ఎలాంటి పద్యాలైనా కంఠస్థం చేసేవాళ్లం. అలా అలవాటైన పద్ధతి సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా మార్చుకోలేదు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే దాన్ని రాసిన కవిచేత అర్థం చెప్పించుకుని అందులో ఇన్‌వాల్వ్ అయ్యేవాళ్లం.
నిర్మాతగా మారిన తర్వాత కష్ట, నష్టాలు ఏవైనా...?
ఒడిదుడుకులనేవి సహజం. కొన్ని సినిమాలు నష్టాలు తెచ్చిపెడితే.. నా భర్త ఆదిలో బాగా ఫీలయ్యేవారు. ఆ తర్వాత మనో నిబ్బరంతో ముందుకు సాగిపోయేవాళ్లం. ఇదే విధంగా అంజలీ పిక్చర్స్ బ్యానరుపై చాలా చిత్రాలు నిర్మించాము.
కెరీర్‌లో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా..?
అప్పట్లో భాషాభేదాలు లేవు. చాలా మందిమి ఆప్యాయంగా ఉండేవాళ్లం. అసూయ, ద్వేషాలు లేనేలేవు. ప్రభాకర్ అనే వ్యక్తిని ఆదుకునేందుకు అశినీపిక్చర్స్ సంస్థ నిర్మాతలుగా నాగేశ్వరరావు, మేము మారాం. ఆ తర్వతే ఆ బానరే అంజలీ పిక్చర్స్‌గా మారింది.
టీవీ సీరియల్స్ గతంలో తీశారు. ప్రస్తుతం మళ్లీ తీసే ప్రయత్నాలేవైనా చేస్తున్నారా...?
సినిమాల్లో నష్టపోయాక షిర్డీ వెళ్లాం. అక్కడి సాయిబాబా దర్శనం అనంతరం ఆయనపై సీరియల్ తీద్దామని అనుకున్నాం. ప్రస్తుతం ఆయన కృపతోనే షిర్డీసాయి భక్తిసాయి అనే సీరియల్‌ను తీశాం. దీనికి మంచి రెస్పాన్స్ రావడమే కాక కాస్త ప్రశాంతత నిచ్చింది.
దర్శకత్వం చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా..?
దర్శకత్వం కంటే నాకు ఎడిటింగ్ చేయడమంటేనే ఇష్టం. కాబట్టి దర్శకత్వం చేయాలన్న ఆలోచన లేదు.