"శ్రీ రామదాసు" చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపిక కావడం వెనుక సమిష్ట కృషి దాగివుందని యువసామ్రాట్ నాగార్జున అన్నారు. మూడోసారి నంది అవార్డును గెలుచుకోవడం పట్ల ఆయన ఎంతో అనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఈ సందర్భంగా పలు విషయాలను "వెబ్‌దునియా తెలుగు"కు వెల్లడించారు.
ముందుగా వెబ్‌దునియా తెలుగు తరపున మీకు శుభాకాంక్షలు.. థ్యాంక్యూ సార్.. ఇదంతా సమిష్టి కృషికి దక్కిన ఫలితం.
హ్యాట్రిక్ సాధించడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు? చాలా సంతోషంగా వుంది. "అన్నమయ్య", "సంతోషం" చిత్రాల తర్వాత "శ్రీరామదాసు"కు వచ్చింది. "నిన్నే పెళ్ళాడతా" చిత్రానికి ఉత్తమ నిర్మాతగా నంది అవార్డు వచ్చింద. మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం మరోసారి రుజువైంది.
"శ్రీరామదాసు"లో మీ నాన్నగారితో కలసి నటించారు కదా? నంది అవార్డు మీకే దక్కడం ఎలా అనిపిస్తోంది.? (పెద్దగా నవ్వుతూ).. ఆయనో లెజెండ్. మామధ్య ఎటువంటి గొడవలు పెట్టకండి. అసలు ఈ వార్త విని నాకంటే ఆయనే ఎక్కువ సంతోషపడ్డారు.
సినిమా చిత్రీకరణలో మీ అనుభవాలు..? "శ్రీరామదాసు" చిత్రాన్ని ముందుగా చేస్తానని అనుకోలేదు. కథ, కథనం అన్నీ చక్కగా కుదిరాయి. అసలు "అన్నమయ్య" కంటే బాగా తీయాలని కృషి చేశాం. సినిమా చేసేటప్పుడు ముందు భయపడ్డాం. ఇలాంటి సినిమాలు ఇప్పటి కాలంలో ఆదరిస్తారో లేదోనని సందేహం. అంతా రాముడిదే భారమని దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత భారవి అన్నారు. నిర్మాత కొండా కృష్ణంరాజుకు చాలా ధన్యవాదాలు తెలపాలి. ఆయనే లేకపోతే ఈ సినిమా లేదు. నా అవార్డుకు వీరితో పాటు కీరవాణి సంగీతం కూడా చాలా తోడయింది. వీళ్లందరి కృషి ఫలితమే ఈ అవార్డు వచ్చిందని నా అభిప్రాయం. ముఖ్యంగా మేకప్ రామచంద్రారావు చాలా కృషి చేశారు. పాత్రకు తగినట్లుగా ఆయన మార్చిన తీరు అద్భుతం. ఆయనకు కూడా అవార్డు రావడం మరింత ఆనందం కలిగించింది.
భవిష్యత్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నారా? నంది అవార్డు ప్రకటించిన వెంటనే చాలా మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఫోన్లద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. చాలా మంది మళ్లీ అటువంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఆల్‌రెడీ చాలా పాత్రలు చేశాను. తగిన కథలతో ఎవరైనా ముందుకు వస్తే నేను సిద్ధమే.
"అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి అవార్డు చిత్రాలు బయట నిర్మాతలతో చేశారు. మరి స్వంత బేనర్‌లో అటువంటి సబ్జెక్టుతో మీరే నిర్మించవచ్చుకదా? నిజమే. ఆ ఆలోచనా వచ్చింది. ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఒక జానపద చిత్రాన్ని చేయాలని వుంది. కథ ఖరారు కాలేదు. అన్నీ సమకూరితే తప్పకుండా నా బేనర్‌లో చేస్తాను.
తదుపరి ప్రాజెక్టు వివరాలు చెపుతారా? శ్రీను వైట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించే చిత్రం షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి ఇదొక్క ప్రాజెక్టే.