ఎర్ర సినిమాలకు చిరునామా: నారాయణమూర్తితో కాసేపు
|
సినీ నిర్మాణంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా తన శైలిని మాత్రం నారాయణమూర్తి విడిచిపెట్టకపోవడం విశేషం. ఆయన తాజాగా నిర్మించిన ఎర్రసముద్ర చిత్రం మేడే రోజున విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు...
ప్రశ్న : ఆనాటి అర్థరాత్రి స్వతంత్రం నుంచి నేటి ఎర్రసముద్రం చిత్రం వరకు మీ పయనం ఎలా సాగుతోంది ?
నారాయణమూర్తి : అప్పటికీ, ఇప్పటికీ ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు. అప్పుడున్న సమస్యలే ఇప్పుడూ ఉన్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారమైన కొత్తవి పూడుతూనే ఉన్నాయి. నేను దండోరా చిత్రం తీసినపుడు మహిళలు మద్యపానాన్ని ఎదిరించారు. అప్పట్లో గ్రామాల్లో చాలామంది మహిళల పుస్తెలు సైతం తాగుడుకు తాకట్టు పెట్టబడ్డాయి.
దీంతో దూబగుంటలో వచ్చిన మద్యపాన వ్యతిరేక విప్లవం అందరికి తెలిసిందే. ఆ తర్వాత నిరుద్యోగ సమస్యపై చిత్రాలు నిర్మించాను. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న సెజ్ నిర్మాణలపై చిత్రం నిర్మించాను. అభివృద్ధి పేరుతో పచ్చని పంటపొలాలను ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఎర్రసముద్రం చిత్రం నిర్మించాను. ఆనాడు ప్రారంభించిన నా పయనంలో ఒక్కోసారి తడబడినా చాలావరకు సాఫీగానే నా ప్రయాణం సాగుతోంది. ఇది నిరంతర పోరాటం. ఆగేదికాదు.
ప్రశ్న : మీ సినిమా అంటే మొత్తం చిత్రం అంతా మీరే కన్పిస్తారని, మిగిలిన వారికి ఛాన్సే ఉండదనే విమర్శ ఉంది. దీనిపై మీ స్పందన?
నారాయణమూర్తి : బ్రదర్ కరెక్టుగా అడిగావ్. ఇది బయటివారి అపోహ మాత్రమే. ఒకప్పుడు అలా ఉండేది. కానీ రానురాను నా చిత్రాల్లో నాకంటే ఇతరుల పాత్రల ప్రాధాన్యం పెరుగుతోంది. ఏది ఏమైనా కథకు అనుగుణంగా వెళ్లడమే జరుగుతుంది.
సపోజ్... ఏ అగ్రహీరో సినిమా అయినా తీసుకోండి. ఆయన హీరోగా అంటే ఆయనకే ప్రాధాన్యం ఉంటుంది. అలా కాక మిగిలిన పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందా. అలా ఉంటే హీరో డమ్మీ అయ్యాడనే వార్త పుట్టుకొస్తుంది. ఏది ఏమైన కథ మేరకే నేను వెళ్తుంటాను. నా చిత్రాల్లో అందరి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎంతోమంది రంగస్థల నటుల్ని ఎలా పరిచయం చేయగలను చెప్పండి.
ప్రశ్న : ప్రతి సినిమాలో నాలుగు సమస్యల్ని ఎంచుకుని చివరకు తుపాకీ పట్టడం చూపిస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం?
నారాయణమూర్తి : కరెక్టే... ఓ కథ అనుకున్నాక అందులో ఒకే సమస్యతో సినిమాను తీయడం కుదరదు. ప్రజలన్నాక అనేక సమస్యలతో సతమతమౌతుంటారు. ఆ సమస్యల్నే కథకు అనుగుణంగా చూపించడం జరుగుతుంది. దేనీకైనా సామదాన దండోపాయాలుంటాయి. ఏవీ కుదరనపుడు తుపాకే సరైన మార్గం అని చూపించడం తప్పులేదు. అలా తుపాకీ చూపించాక, దానివల్ల వచ్చే రియాక్షన్ కూడా చూపిస్తాను.
ప్రశ్న : ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు ఇంకా చూస్తారనుకుంటున్నారా?
నారాయణమూర్తి : ఏం... ఎందుకు చూడరు... వాళ్లు తప్పకుండా చూస్తారు. కేవలం ప్రేమ, దోమ అంటూ నాలుగు పాటల్తో ప్రజల్ని మభ్యపెట్టి సినిమాలు తీసేకన్నా తమ సమస్యల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ఎటువంటి చిత్రాన్నైనా చూస్తారు. అలా చూడకపోతే ఇన్ని చిత్రాలు ఎలా వస్తాయి.
ప్రశ్న : ప్రేమ కథా చిత్రాలని కూడా మీ నుంచి ఆశించవచ్చా?
నారాయణమూర్తి : మీ పాయింట్ నాకర్ధమైంది బ్రదర్... ఆ మధ్య ఆర్.పి. పట్నాయక్ అందమైన మనస్సులో చిన్న పాత్ర వేశాను. అది కూడా ఊహించుకునే పాత్రే. అలా అని అన్ని ప్రేమ చిత్రాల్లో నటించనని కాదు. నా చిత్రాల్లోను ప్రేమలుంటాయి. కానీ అవన్నీ టీనేజ్ ప్రేమలు కావు.
ప్రశ్న : ప్రభుత్వంపై తిరుగుబాటు తరహాలో ఉండే మీ చిత్రాలకు సెన్సార్ ఎలా లభిస్తుంది?
నారాయణమూర్తి : చాలాసార్లు నా చిత్రాలకు సెన్సార్ లభించలేదు. అందుకే సెన్సార్ నిబంధనల ప్రకారం చెన్నై, ఢిల్లీ వెళ్లి అక్కడ సెన్సార్ చేసుకుని వచ్చేవాడ్ని. చాలా చిత్రాలకు చాలా ఇబ్బందులు పడ్డాను. వాటి నుంచి అనుభవాలు నేర్చుకున్నాను.
ప్రశ్న : ఇకముందు చేయబోయే ప్రాజెక్ట్?
నారాయణమూర్తి : ప్రస్తుతం విడుదలైన ఎర్రసముద్రం పాస్ అయ్యాక... దండకారణ్యం అనే చిత్రాన్ని తీయబోతున్నాను. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. త్వరలో ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను.
ప్రశ్న : ఈ మధ్య సినిమా, రాజకీయాలు అవినాభావ సంబంధాన్ని కల్గి ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలపై మీ స్పందన
నారాయణమూర్తి : చాలా జఠిలమైన సమస్య ఇది. ఏదైనా ఉభయ కమ్యునిస్టులు కలిసి ముందుకొస్తే చూడాలని ఉంది. వారు కలిసుంటే మూడో పార్టీ రావడమనేది కల్ల. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను.
