1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

డబుల్ హిట్‌తో ''జల్సా'' చేస్తున్న ఇలియానాతో ముచ్చట్లు

డబుల్ హిట్‌ జల్సా చేస్తున్న ఇలియానా ముచ్చట్లు
WD PhotoWD
అతి తక్కువకాలంలో తెలుగులో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగి కోటిరూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న ఇలియానా ప్రారంభం నుంచి పలుకే బంగారమాయేరా... అన్న రీతిలో మీడియాకు దూరంగా ఉండేది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమధ్య ఇంటర్యూలకు సై అంటోంది. అలా బెట్టు సడలించిన ఈ గోవా ముద్దుగుమ్మతో కాసేపు...

జల్సా, భలేదొంగలు విడుదల ఆశాజనకంగా ఉందా ?
రెండు చిత్రాలు ఆదరణ చూరగొన్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక డబుల్ బొనంజాలా ఉంది.

దేవదాసు, పోకిరి చిత్రాలు హిట్ అయ్యాయి కదా. వీటిలో మీకేది ఇష్టం?
'దేవదాసు' కన్నా 'పోకిరి' పెద్ద హిట్ అయినా తొలిచిత్రం 'దేవదాసు'లోని పాత్ర నా మనసుకు చేరువైంది. ఎందుకంటే అది నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.

తక్కువ కాలంలో పెద్ద దర్శకుల చిత్రాల్లో నటించిన అనుభూతి ఎలా ఉంది ?
వై.వి.యస్. చౌదరి, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, వి.ఎన్.ఆదిత్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయభాస్కర్ వంటి దర్శకులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తాను. దీనికి తోడు కష్టపడి పనిచేసే తత్వం పెద్ద దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని కల్పించింది.

దర్శకులతో మీ ఇంట్రాక్షన్ ఎలా ఉండేది ?
నటనలో ప్రతిసారీ ఓ కొత్త విషయం నేర్చుకున్నాను. వై.వి.ఎస్. చౌదరి గారికి ఎక్కువ రుణపడి ఉంటాను. దేవదాసులో నటిస్తున్నప్పుడు సినిమాల గురించి నటన గురించి ఏమీ తెలియదు. ప్రతి విషయాన్ని ఓపికగా చెప్పేవారు.

మీలోని నటి గురించి చెప్పమంటే... ?
ఇది బైటవాళ్లు చెప్పాలి. నా గురించి నేనే చెప్పుకోకూడదు (నవ్వుతూ...) సినిమా సినిమాకు నటనను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

మీ హీరోల గురించి... ?
పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ఇతరుల వర్క్ గురించి పట్టించుకోరు. తమ పనేదో తమది అన్నట్టుగా ఉంటారు. ఎన్టీఆర్ అందరితో తొందరగా కలిసిపోతాడు. అతనితో నటించడమంటే ఫన్నీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వృత్తి పట్ల అంకితభావంతో కష్టపడుతుంటారు.

మరి సిద్ధార్థతో మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్... ?
నో కమెంట్.


ఇకముందు కూడా తమిళంలో నటించే అవకాశం ఉందా ?
నేను నటించిన తమిళ చిత్రం బాగా ఆడలేదు. అదొక చేదు అనుభవం. మంచి అవకాశమొస్తే తప్ప తమిళంలో నటించాలని అనుకోవడంలేదు. తమిళ పోకిరిలో నటించే అవకాశం వచ్చినా డేట్స్ లేక నటించలేక పోయాను.

మీ పారితోషికంపై రకరకాలుగా అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ?
అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకుంటున్నానని ఎవరు చెప్పారు ? అవన్నీ అసత్య ప్రచారాలు. నన్నెవరూ చేరుకోలేనంత ఎత్తులో ఉన్ననని అనుకోవడం లేదు. అందుబాటులో ఉండే పారితోషికమే తీసుకుంటున్నాను.

హిందీ చిత్రాల వైపు వెళుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ?
అలాంటిదేమీ లేదు. తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటించడానికి ఇష్టపడుతాను. అలాగే అందుబాటులో ఉంటాను కూడా.

నటిగా ఫ్యామిలీని, స్నేహితులను మిస్ అవుతున్నామనే బాధ ఉందా ?
అనుకోకుండా నాకు ఈ స్టార్‌డమ్ వచ్చింది. అది అదృష్టంగా భావిస్తాను. వేళ్ల మీద లెక్కపెట్టే క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. వాళ్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. ఇక నా ఫ్యామిలీ నాతోపాటే ఉంటుంది.

ఖతర్నాక్, మున్నా చిత్రాల అపజయ ప్రభావం మీపై ఎంతవరకు పడిందని భావిస్తారు ?
ప్లాప్ అయిన్ చిత్రానికి తక్కువ, హిట్ అయిన చిత్రానికి ఎక్కువ కష్టపడడం ఉండదు. రెండింటికి ఒకేలా శ్రమిస్తాం. కాకపోతే ప్లాపుల ప్రభావం కెరీర్‌పై ఖచ్చితంగా ఉంటుంది. వరుస విజయాలు వరిస్తాయని మాత్రం నేను అనుకోను.

తదుపరి చిత్రం ఏంటి ?
ప్రస్తుతం కొంత విరామం తీసుకుంటున్నాను. ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతవరకూ ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు.

ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా ?
(నవ్వుతూ...) లేదు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాను. తెరవెనుక ప్రేమలో పడేంత టైం లేదు.
About Writer
Munibabu