ప్రశ్న... అందరూ తెలుగురంగంలో వస్తుంటే మీరు ఇతర రంగాలపై దృష్టి పెట్టడానికి కారణం? జ... అదేమీ లేదండీ.. ఇతరభాషల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బీజీగా ఉన్నాను. హాలీవుడ్ చిత్రంలోనూ నటించాను. నా అనుభవం రీత్యా తెలుసుకున్నదేమంటే... ఇండస్ట్రీ అనేది దేవాలయం లాంటిది. దేవాలయంలోకి పేదవాడు రావచ్చు, కోటీశ్వరుడు రావచ్చు.
ఎంతస్థాయిలో ఉన్నవాడైనా దేవుణ్ని అందరితో కలిసే చూస్తాడు. ఇండస్ట్రీ అంటేనే కులమతాలకు అతీతంగా, భాషా ప్రాంతాల కతీతంగా ఆహ్వానం పలుకుతుంది. తమకున్న టాలెంట్‌ను చూపించుకుపోతే ఎప్పుడో ఓసారి మంచి గుర్తింపు వస్తుంది. అంటే మన బండి వచ్చేదాకా ఆగాలి.
అప్పటి వరకు ఓపిక, సహనం ఉండాలి. దీనికితోడు అదృష్టం కూడా ఉండాలి. నా కెరీర్‌లో ఎంతో మందిని చూశాను. నటుడు కావలని వచ్చిన వాడు దర్శకుడు అయ్యాడు. డైరక్టర్ అవ్వాలని కోరికతో అడుగుపెట్టి నటుడయ్యారు. ఇలా రకరకాల ఆలోచనలతో వస్తూ ఈ రంగంలో ఏదోవిధంగా సెటిల్ అయిన వారిని చూశాను. ఇదొక కల్పవృక్షం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
ప్రశ్న... హీరోగా వేసి చిన్నచితకా వేషాలు వేయడానికి కారణం? జ.. ఇండస్ట్రీలో మనం ఉన్నామా... లేదా అనేది కావాలి. ఒకప్పుడు హీరోగా చేశాను. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడంతా కుర్రకారు వస్తున్నారు. అప్పుడు నేను చేశానంటే నేను యువకుడ్నే కదా. వయస్సు రీత్యా వస్తున్న వ్యత్యాసం వల్ల అలాంటి పాత్రలు చేయలేను. అందుకే తండ్రిగా, అన్నగా పలు పాత్రలు పోషిస్తున్నాను. నాకు నచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలుసు. అలా చేసుకోబట్టే... ఇంకా సుమన్ ఉన్నాడని దర్శకుడు శంకర్ పిలిపించి మరీ "శివాజీ"లో వేషం ఇచ్చారు. ఇటువంటి పాత్రలే చేస్తాను. అనే నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు.
ప్రశ్న... రాజకీయ బాధ్యతలు స్వీకరించే ఆలోచన ఉందా? జ... ఇప్పటికి లేదు. రాజకీయ రంగంలో ఉంటే పూర్తి న్యాయం చేయాలి. ఏదో సరదాగా కాసేపు ప్రచారానికో వెళ్ళి మళ్ళీ షూటింగ్‌లకు పోతుంటే దేనికీ సరైన న్యాయం చేయలేం. నేను గతంలో తెదేపాలో పనిచేశాను. కానీ నాకంటూ కుటుంబం అనేది ఉంది. పూర్తికాలం చేయలేనని అప్పుడే చంద్రబాబు గారితో చెప్పాను.
ప్రశ్న... చిరంజీవి రాజకీయ ప్రవేశంపై మీరేమంటారు? జ... తప్పకుండా ఆయన నా ఓటు. ఆయన రావడం ఆహ్వానించదగిందే. ఎందుకంటే. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక ప్రతినిధి రావడం గర్వకారణం. గతంలో ఎన్.టి.ఆర్ వచ్చారు. ఆయన చేసిన సంక్షేమ అందరూ అభినందించారు. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఛామింగ్ పర్సనాలిటీ రాలేదు.
ప్రస్తుతం చిరంజీవి నటుడిగా మాస్ ఫాలోయింగ్ ఉంది. అటు పలు సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ చేరువయ్యారు. పార్టీపెట్టి సేవచేసే స్టామినా ఆయనకుంది. ఒకరకంగా ఇండస్ట్రీకి చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయడం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపంలో ఆదాయం వస్తుంది.
అదంతా ఇండస్ట్రీకి వెచ్చించడంలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి వస్తే మా వాయిస్ విన్పించడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చిరంజీవి రావడం సమర్థనీయం. ఆయన ఎప్పుడు వస్తారు. ఏమిటి అనేది ఇంకా నిర్ణయాలు జరుగుతున్నాయి.. కనుక... ఆయన రైలు వచ్చాక ఆ బోగీలో నేనుకూడా ప్రయాణిస్తా...!