నందమూరి బాలకృష్ణ నటించిన "విజయేంద్రవర్మ" సినిమాకి దర్శకునిగా పరిచయమైన హర్షవర్ధన్ అసలు పేరు స్వర్ణా సుబ్బారావు. తొలి చిత్రంతో విజయం వరించక పోవటంతో తదనంతరం కొంత పాఠాలు నేర్చుకుని "హారేరామ్" చిత్రానికి దర్శకత్వం వహించానని ఆయన చెబుతున్నారు. తొలి సినిమాకి రెండోవ చిత్రానికి మధ్య నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్నానని అన్నారు కథ, స్క్రీన్‌ప్లేపై సరైన శ్రద్ధ పెట్టడం కోసమే ఈ గ్యాప్ అని మరీ అంటున్నారు.
ఫెయిల్యూర్ దర్శకుడిని నిర్మాతలు దూరంగా ఉంచే ఈ రంగంలో తనగురించి తెలిసి కూడా చక్కని అవకాశాన్నిచ్చిన నందమూరి కళ్యాణ్‌రామ్‌కు, హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. తనలాగా మంచి కథ కథనాలతో ముందుకు వచ్చిన దర్శకులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించాల్సిందిగా పలువురు నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ కార్యాలయంలో కలిసి మీడియాతో ముచ్చటించారు.
ప్రశ్న... "విజయేంద్రవర్మ" తర్వాత నాలుగేళ్ళ గ్యాప్‌లో మీరు ఏం నేర్చుకున్నారు? జ... అపజయం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాను. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ట్రెండ్‌ను బట్టి ఎలా సరిచేసుకోవాలో గమనించాను. "విజయేంద్రవర్మ" సినిమాలో సెకండాఫ్‌లో 20 నిమిషాల తర్వాత కథలో పట్టుసడలిందని, అది గుర్తించి చివరి నిమిషం వరకు కథ చెప్పించి, ప్రేక్షకులు పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యేలా "హరేరామ్" సినిమాలో సరైన జాగ్రత్తలు తీసుకున్నాను.
ప్రశ్న... మీ పేరు మార్చుకోవడానికి కారణం? జ.. తొలి సినిమా ఫైయిలయిందనే రెండో చిత్రానికి పేరు మార్చుకున్నాను. మా అబ్బాయి పేరు హర్షవర్ధన్.. అతని పేరే దర్శకత్వంలో పెట్టాను. సహజంగా తాతల పేర్లు కొడుకులకు పెడుతుంటారు. అయితే నా విషయంలో మా వాడి పేరును నేను పెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా నమ్మకంతో... ఇప్పుడు ఆ నమ్మకం ఫలించిందనుకుంటున్నాను.
ప్రశ్న... "హరేరామ్" చిత్రం గురించి మీ కొచ్చిన స్పందనలు ఎలా ఉన్నాయి? జ... "హరేరామ్" సినిమాను చూసిన వారి నుంచి మంచి స్పందన వచ్చింది. వివిధ జిల్లాలనుండి ఫోన్లు చేస్తున్నారు. తీసుకున్న పాయింట్‌తో చెప్పాల్సిన విషయం కరెక్ట్‌గా చెప్పానని తనకు రిపోర్ట్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి బాగుందని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సినిమా విడుదలై తొలిరోజు ఎలా ఉన్నదో... అంతే తీరులో పదో రోజుకూడా "హరేరామ్" కలెక్షన్ల వెల్లువలోఉన్నాడు.
ప్రశ్న... ఈ చిత్రంపై "హరికృష్ణ" చూసి ఎలా స్పందించారు? జ... చాలా బాగా చేశావని అన్నారు. మళ్ళీ సినిమా చేసి పేరు నిలబెట్టుకోమన్నారు.
ప్రశ్న... అంటే మళ్ళీ ఇదే బేనర్‌లో చేస్తున్నారా? జ... తనను నిలబెట్టిన సంస్థ కాబట్టి.. వేరే చిత్రాలు చేస్తే కూడా తప్పకుండా మళ్ళీ ఇదే పతాకంలో చేస్తాను.
ప్రశ్న... "హరేరామ్"కు "మన్మథుడు" పోలికలున్నాయని అంటున్నారు. ఈ విషయం మీ దృష్టికి రాలేదా? జ... సహజంగా ఒక సినిమాకి మరో చిత్రానికి ఎక్కడో ఓ చోట పోలికలు కనిపిస్తుంటాయి. ఇంగ్లీషు కథల్లో బాలీవుడ్, బాలీవుడ్ కథల్లో టాలీవుడ్ పోలికలు కనిపిస్తుంటాయి. "హరేరామ్" కథను లక్ష్మీ కళ్యాణం టైమ్‌లో కళ్యాణ్‌రామ్‌కు చెప్పాను. కథ నచ్చి ఓకే అన్నారు. తర్వాత విజయదశమిలో బిజీగా ఉండటంవల్ల తర్వాత చేద్దామన్నారు. అప్పటికి నేను "మన్మథుడు" చిత్రాన్ని చూడలేదు. కథా చర్చల్లో టీమ్‌లో ఒకతను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ... అప్పుడు చూశాను. అయితే ఆ చిత్రానికి ఈ సినిమాకు చాలా తేడా ఉంది.