ఆర్టిస్టు నుంచి దర్శకుడిగా మారిన జె.డి. చక్రవర్తి "హోమం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానికి సంగీతం కూడా ఆయనే సమకూర్చారు. యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని జగపతిబాబు చక్కని ఫెర్‌ఫార్మెన్స్ అందించారని చెబుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో తాను మూడు రకాలుగా లాభం పొందానని చెబుతున్నారు.
ప్రశ్న... దర్శకుడిగా ఎలా ఫీలవుతున్నారు? జ... "హోమం" చిత్రం మూడు రకాలుగా సంతృప్తినిచ్చింది. ఈ చిత్రం రిలీజ్ ముందే చిత్ర నిర్మాత కిరణ్ కుమార్ నాకు మరో అవకాశాన్ని కల్పించారు. పార్ట్-2గా "మారణహోమం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. రెండోది...రాంగోపాల్ వర్మ "హోమం" చిత్రాన్ని చూసి బాగుందని మెచ్చుకోవడం, మూడోది.. సినిమా రంగంలో ఐ.ఎస్.ఐ మార్కులా... దిల్‌రాజు నా చిత్రాన్ని రిలీజ్ చేయడం.
ప్రశ్న..."హోమం" ద్వారా ఏం చెప్పబోతున్నారు? జ.. ఫలానా అని చెప్పలేను. ప్రేక్షకులే చూసి అం చెప్పానో తెలుసుకుంటారు. "శివ" చిత్రాన్ని తీసినప్పుడు రామ్‌గోపాలవర్మ సమాజానికి ఏదో చెప్పాలని ప్రయత్నించారు. నేను కూడా ఏదో చెప్పాలని చూశాను. అది ఏమిటనేది.. చూసి తెలుసుకోవాల్సిందే...
ప్రశ్న... సంగీతం కూడా మీరే చేయడానికి కారణం? జ... ముందుగా ఓ మ్యూజిక్ డైరక్టర్‌ను అనుకున్నాం. కానీ అనారోగ్య కారణాల వల్ల చేయలేకపోయాడు. వేరే సంగీత దర్శకుడిని పెడదామనుకుంటుండగా నిర్మాత... నన్నే చేయమని అడగటం, తప్పనిసరి కావడంతో చేశాను.
ప్రశ్న... జగపతిబాబును తీసుకోడానికి కారణం? జ... ముందుగా జగపతిబాబుకు థ్యాంక్స్ చెప్పాలి. నా సినిమా అనగానే చాలామంది ఆయన్ను వద్దని వారించారు. జె.డి. చక్రవర్తి పిచ్చివాడు. వాడి సినిమాలో నటించి స్పాయిల్ కాకు అన్నారు. ఆ విషయాన్ని జగపతిబాబే ఓసారి చెప్పారు కూడా. నాకు ఆయన నటించిన "గాయం", "సముద్రం", అంతఃపురం చిత్రాల్లోని పాత్రలు నచ్చి ఆయన్ను ఎంపికచేశాను. హైలీ ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది. అది ఆయన మాత్రమే చేయగలడు.
ప్రశ్న... ఆయన పాత్ర ఎలా ఉంటుంది? జ... ఆయన ఓ పోలీస్ ఆఫీసర్. నేనుకూడా ఓ పోలీస్‌నే. కానీ ఏ తరహాలో పోలీస్‌నో సినిమా చూస్తేనే తెలుస్తుంది.
ప్రశ్న...టెక్నాలజీగా ఎటువంటి ప్రయోగాలు చేశారు? జ... టెక్నాలజీ కంటే టెక్నికల్‌గా మంచి ప్రయోగాలు చేసిన సినిమా ఇది. టెక్నాలజీ వేరు టెక్నిక్ వేరు. జిమ్మీజిప్, క్రేన్ వంటివి టెక్నాలజీ.. అదే టెక్నిక్ సినిమాలంటే రామ్‌గోపాల్ వర్మ సినిమాలు. ఆయన చిత్రాల్లో శబ్దంకన్నా... నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సౌండ్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. నా చిత్రాల్లోనూ ఆ తరహా చూస్తారు.
ప్రశ్న... ఈ చిత్రం నిర్మాతకు లాభమా? నష్టమా? జ... తొలిసారిగా డైరక్ట్ చేశాను. నాపై నిర్మాతకు లేనిపోని తేడా సృష్టించొద్దు. అయినా కిరణ్ కుమార్ నా స్నేహితుడు. నాపై నమ్మకం ఉండబట్టే రెండో సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంత ఎక్కువైందని అనే కంటే.. ఎంత బాగా తీశామనేది ఇంపార్టెంట్.. ఎక్స్‌పోజింగ్ తక్కువా? ఎక్కువా? అని అడిగేరు... అదంతా సినిమాలో చూడాల్సిందే...
ప్రశ్న... ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? జ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నెలాఖరులో విడుదల కానుంది. అది గురువారమయితే బాగుంటుందని దిల్‌రాజు, నిర్మాత నిర్ణయించారు. శుక్రవారం కానీ, శనివారం కానీ అయితే బెటర్ అని సలహా ఇచ్చాను. కానీ వారు మరో అడుగు ముందుకు వేసి బుధవారం ఖాయం చేశారు.