1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

భిల్లాలో స్పెషల్ ఆఫీసర్‌గా చేస్తున్నా : కృష్ణంరాజు

వినోదం వెండితెర ముఖాముఖి భిల్లాలో స్పెషల్ ఆఫీసర్ కృష్ణంరాజు గోపీకృష్ణా మూవీస్ ప్రభాస్
WD
రౌద్రరసాన్ని పండించే నటుడిగా పేరు తెచ్చుకుని రెబల్‌స్టార్‌గా ఎదిగిన నటుడు కృష్ణంరాజు. భక్తిరసంతో "భక్తకన్నప్ప"గా, రౌద్రంలో "కటకటాల రుద్రయ్య"గా, "బొబ్బిలి బ్రహ్మన్న"గా, "తాండ్ర పాపారాయుడు"గా పలు విభిన్నమైన పాత్రలను పోషించిన నటుడాయన. కొంతకాలం రాజకీయ రంగంలోనూ రాణించారు. ప్రస్తుతం సినిమా నటుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భవిష్యత్‌లో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని కూడా కృష్ణంరాజు ప్రకటించారు. జనవరి 20, మంగళవారం ఆయన పుట్టినరోజు. సినిమా పరిశ్రమకు వచ్చి తాను చేసుకుంటున్న 42వ పుట్టిన రోజని చెబుతున్న కృష్ణంరాజు, ఈ ఏడాది తాను తీసుకోబోయే పలు నిర్ణయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన కబుర్లు మీకోసం...

ప్రశ్న... ఈ ఏడాది తీసుకుంటున్న నిర్ణయాలేంటి?
జ... గోపీకృష్ణా మూవీస్ బేనర్‌లో పాత పద్ధతిలోనే ఏడాదికి 2, 3 చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాం. అందులో మొదటగా ప్రభాస్‌తో "భిల్లా" చిత్రం నిర్మిస్తున్నాం. ఇవి కాకుండా, ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించడమేగాకుండా, గోపీకృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్‌పై పలు సీరియల్స్‌ను కూడా నిర్మించటం జరుగుతుంది. ప్రస్తుతం "ఈశ్వరుడు శనీశ్వరుడు", "విష్ణు పురాణం"లు రూపకల్పనలో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలా మా సంస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా, ప్రొడక్షన్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చే పనిలో ఉన్నాం.

ప్రశ్న... "భిల్లా" చిత్రం గురించి వివరించండి?
జ... ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభించాం. ప్రభాస్, నేను కలిసి నటించే కథ సమకూరింది కాబట్టి నటించాం. ప్రభాస్‌ను దర్శకుడు మెహర్ రమేష్ కొత్తకోణంలో చూపించారు. జేమ్స్‌బాండ్ తరహాలో ఉండేటట్లుగా ప్రభాస్ పాత్ర ఉంటుంది. రొటీన్ చిత్రాల మాదిరిగా కాకుండా, యాంటీ హీరో పాత్ర తనది. కథకు అనుగుణంగా 75 రోజుల పాటు మలేషియా చుట్టుప్రక్కల కౌలాలంపూర్, లంకావీ తదితర ప్రాంతాలలో షూటింగ్ చేశాం. ఇక్కడ నుండి 70 మందిని తీసుకెళ్ళాం. మూడు కెమెరాలను ఉపయోగించి అద్భుతంగా షూట్ చేశాం.

ప్రశ్న... దుబాయ్‌లో షూటింగ్ చేసేందుకు గల కారణం?
జ... షెడ్యూల్ ప్రకారం దుబాయ్‌లో షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అక్కడ దొంగతనం జరిగి, డబ్బు, తుపాకులు పోయాయి. దాంతో అక్కడ షెడ్యూల్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

ప్రశ్న... ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
జ. అంతర్జాతీయ స్మగ్లర్‌లా ప్రభాస్ నటిస్తున్నాడు. ఆ స్థాయిలో చిత్రంలో ఉండాలని విదేశాల్లో చిత్రీకరించాము. రెండు పాటలు కూడా పూర్తయ్యాయి. స్మగ్లర్ అయిన ప్రభాస్‌ను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ ప్రయత్నిస్తుంది. వారికి కూడా సాధ్యంకాకపోవడంతో స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చే పాత్రను నేను పోషించాను.

ప్రభాస్ కేశాలంకరణ, హావభావాలు అంతా ఫ్రెష్‌గా ఉంటాయి. 13 రోజులపాటు క్లైమాక్స్‌ను విమానాశ్రయంలో చిత్రీకరించాం. హాలివుడ్ సినిమాను చూసిన ఫీలింగ్ ఈ చిత్రాన్ని చూస్తే కలుగుతుంది. ఒకప్పుడు నేను 15 అడుగుల ఎత్తునుంచి దూకేవాడిని, ఇప్పుడు ప్రభాస్ అంతకంటే ఎత్తునుంచి దూకుతుంటే చూడలేక వెళ్లిపోయాను. చాలా రిస్క్ తీసుకుని రియాలిటీగా ప్రభాస్ ఇందులో చేస్తున్నాడు.

ప్రశ్న... "జీవన తరంగాలు" సీరియల్ ఆగిపోవడానికి గల కారణం ఏంటి?
జ... అందులో చిన్న తప్పు జరిగింది. ఒరిజినల్ కథ, చాలా బాగుంది. దాన్ని సీరియల్‌గా తీసేందుకు కుదరలేదు. పైగా రేటింగ్ కూడా రావటం లేదని చెప్పడంతో ఆపేయమని చెప్పాము.

WD
ప్రశ్న... రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి?
జ... గందరగోళంగా ఉన్నాయి. ఏ ఇద్దరో, ముగ్గురో అయితే పోటీ బాగుంటుంది. ప్రస్తుతం నాలుగు పార్టీలు నువ్వా, నేనా? అన్నట్లుగా ఉన్నాయి.

ప్రశ్న... పీఆర్పీ బీజేపీ కలుస్తుందనే వార్తలు వస్తున్నాయి?
జ. ఎలక్షన్ ముందు రకరకాల వార్తలు వస్తుంటాయి. కలుస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

ప్రశ్న... మహాకూటమిపై మీరేమనుకుంటున్నారు?
జ. నిన్నటివరకూ పబ్లిక్‌గా పచ్చిపచ్చిగా తిట్టుకున్నారు. ఇప్పుడు కలిసి ఉండి ఏదో చేద్దామంటున్నారు. సిద్ధాంతపరంగా అందరికీ తేడాలున్నాయి. ఏది ఏమైనా కాలమే సమాధానం చెబుతుంది.

ప్రశ్న... చిరు పార్టీ ప్రభావం ఎలా ఉంది?
జ. నా వరకు బాగానే ఉంది. మా ఊరువాడే. "మన ఊరి పాండవులు", "పులి బొబ్బిలి" లాంటి చిత్రాల్లో కలిసి నటించాం. అన్నయ్య అని నన్ను పిలుస్తాడు. పార్టీ పెట్టిన మొదట్లో ఏదోలే అనుకున్నాం. కానీ.. జనాలు రావడం, ప్రస్తుత పరిస్థితుల రీత్యా నాయకుడిగా ఆమోదముద్ర పొందాడనిపిస్తుంది.

ప్రశ్న... నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి గల కారణం?
జ. కథ, హీరో డిమాండ్‌ను బట్టే నిర్మాణ వ్యయం ఉంటుంది. ఫలానా హీరో ఉంటే వ్యాపారం అవుతుందనుకుంటే, అంతే ఖర్చు చేస్తాం. ఆ రోజుల్లో "తాండ్ర పాపారాయుడు"ను కోటిన్నర రూపాయలతో నిర్మించాం. అదే ఈరోజుల్లో అయితే 50 కోట్లయినా అయ్యేవి. ఆ రోజుల్లో టెక్నికల్ వాల్యూస్ లేవు. 45 రోజుల్లో సినిమా పూర్తయ్యేది. ఈరోజుల్లో అయితే దాదాపు 100 రోజులు పడుతుంది. అన్ని ఖర్చులూ పెరిగిపోయాయి. అప్పట్లో మంచినీళ్ళు ఫ్రీగా తాగేవాళ్ళం, ఇప్పుడు కొనాల్సి వస్తుంది.

ప్రశ్న... "విశాల నేత్రాలు" ఆగిపోవడానికి కారణం?
జ. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానికి నేనే దర్శకత్వం వహిస్తానా, వేరే ఎవరికైనా ఇస్తానా? అనేది ఇప్పుడే చెప్పలేను. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుంది. అది వైవిధ్యమైన కథాంశం. హీరో పాత్ర భక్తకన్నప్ప తరహాలో ఉంటుంది. ఫోక్, పౌరాణికం కలగలసిన సబ్జెక్ట్ అది. విశాల వంటి నేత్రాలు కలిగిన అమ్మాయి దొరకలేదు? అందుకే ఆగిపోయిందని వార్తలు రాశారు. అది తప్పుడు సమాచారం.

అసలు కథకు వస్తే... ఈశ్వరుని కళ్లు విశాల నేత్రాలు. ఆ నేత్రాలతో అందర్నీ కాపాడతాడు. హీరో తపస్సు చేసి ఆ కళ్ళు చూడాలనుకుంటాడు. ఈ జన్మలో జరగదు. వచ్చే జన్మలో సాధ్యమవుతుందనే వరం పొందుతాడు. మరు జన్మలో హీరోయిన్‌లో ఆ నేత్రాలు చూసి ఇతను ప్రేమిస్తాడు. ఇదీ కథ. కానీ కథ సరిగ్గా లేదని మళ్ళీ తగిన మార్పులు చేయాలనుకున్నాం అంతే...!
About Writer
SELVI.M