జేబుకోసం చేసిన సినిమా అది: కణ్మణి
|
ప్రశ్న.. తమిళంలో చిత్రాలు చేయకపోవడానికి కారణం?
జ... మొదటిగా నేను దర్శకత్వం వహించింది.. తమిళంలోనే. "ఆహా ఎత్తనై అళగు" అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ తర్వాత తెలుగులో "నా ఊపిరి"తో కెరీర్‌ను ప్రారంభించాను. ఆ చిత్రమే నాకు మంచి పేరు తెచ్చింది.
ప్రశ్న.. "నా ఊపిరి" ఆశించినంత విజయం కాకపోవడానికి కారణం?
జ.. కొత్తస్క్రీన్‌ప్లేతో మానవీయ విలువగల కథ అది. చిత్రం పూర్తయ్యాక మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం వచ్చింది. అప్పటికే నిర్మాతలు ఖర్చు ఎక్కువగా భావించి రిలీజ్ ముందు సరిగ్గా ప్రమోషన్ చేయలేకపోయారు. అదే మైనస్‌గా భావించాను.
ప్రశ్న.. ప్రతి దర్శకుడికీ ద్వితీయవిఘ్నం జరుగుతుంది. దీనికి ఏకీభవిస్తారా?
జ... అది ఏమో తెలీదు గానీ... నేను దర్శకత్వం వహించిన "నా ఊపిరి" తర్వాత ద్వితీయ ప్రయత్నం "కాల్‌సెంటర్". ఈ సినిమా కూడా అంతగా ఆదరణకు నోచుకోలేక పోయింది. ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ఒక్కోసారి నిజమేనేమోనని అనిపిస్తుంది.
ప్రశ్న.. "కాల్‌సెంటర్" ఫెయిల్యూర్‌పై మీ విశ్లేషణ?
జ... కాల్‌సెంటర్ ఉద్యోగుల ప్రవర్తనలపై రూపొందిన కథ అది. అది నేను ఇచ్చిన స్క్రిప్ట్ కాదు. ఓన్లీ దర్శకత్వం మాత్రమే చేశాను. కొన్ని జాబ్స్ తృప్తినిస్తాయి. కొన్ని జేబుని తృప్తిపరుస్తాయి. జేబుకోసం చేసిన సినిమా అది. దాని ఫెయిల్యూర్‌పై ఎవరినో నిందించడం కంటే.. అది నా తప్పిదమే అంటాను.
ప్రశ్న.. కాల్‌సెంటర్‌పై పలు చిత్రాలు వచ్చినా అదే ప్రయత్నం చేయడానికి కారణం?
జ.. నిర్మాతలు కాల్‌సెంటర్లు నడిపేవారు. అప్పటికే చాలా చిత్రాలు వచ్చినా కాల్‌సెంటర్లలో కూడా మంచి వాళ్ళు పనిచేస్తారనే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కథలో చిన్నలోపం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ప్రశ్న... మరి "నువ్వేనా సఖి"లో ఏం చెబుతున్నారు? ఆ వివరాలు కాస్త చెప్పండి...?
జ... ప్రేమిస్తే.. ఫేమ్ సంధ్య హీరోయిన్. నటి సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. అనుకున్నట్లు దీనికి తగినట్లు కొత్తవాడైతే బాగుంటుందని హీరోని ఎంపికచేశాం. యువత టీనేజ్‌లో తమకు నచ్చిన అమ్మాయినే లవ్ చేస్తున్నట్లు ఫిక్స్ అయిపోతారు. కానీ ఆమెకు ఇతడిపై ఎటువంటి అభిప్రాయం ఉందనేది పట్టించుకోవడం లేదు.
ఒన్‌సైడ్‌లవ్‌తో సాగుతూ.. లేడీస్‌ను గందరగోళపరుస్తారు. జీవితంలో అవగాహన, మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, కేవలం తనకు ఏది నచ్చితే అది చేసే అబ్బాయికి మధ్య జరిగే కథ ఇది. ఇందులో సెంటిమెంట్ కూడా ఉంది. యువతను ఆలోచించేట్లుగా ఈ సినిమా ఉంటుంది.
ప్రశ్న... అయితే కుర్రాళ్ళకు పనీపాటా లేకుండా ప్రేమే ముఖ్యమని చెప్పబోతున్నారా?
జ... అలా అని కాదు. ఈనాటి కుర్రాళ్ళు ఎలా ఉంటున్నారో చూపిస్తున్నాం. దానివల్ల వారెలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితం అంటే ప్రేమేకాదు. చాలా ఉందని తెలుసుకునేట్లుగా సందేశాత్మకంగా చెప్పబోతున్నాం.
ప్రశ్న.. ఈ ఏడాది సినిమారంగం ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
జ.. ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో మాదిరిగానే తమిళంలోనూ పెద్ద చిత్రాలు ఏవీ విజయవంతం సాధించలేదు. కొత్త చిత్రాలు నిర్మాణం పెద్దగా కన్పించడం లేదు. ఆర్థికమాంద్యం ప్రభావం మున్ముందు చూపుతుందేమోనని నేనూ వింటున్నాను. బహుశా ఆ ప్రభావం రెండు మూడు నెలల్లో ఎక్కువగా కన్పిస్తుందేమో..
