చిరంజీవి నాకు నచ్చిన వ్యక్తి: పోసాని
|
ఆ తర్వాత హీరోలపై విరుచుకుపడ్డారు. మొత్తానికి హీరోలు జీరోలని కృష్ణమురళీ తేల్చి చెబుతున్నారు. ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ వంటి చిత్రాలను రూపొందించిన ఆయన తాజాగా "రాజావారి చేపల చెరువు" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇందులో ఆయనే కథానాయకుడు. ఆయనే దర్శకుడు. ఈ మధ్యనే రాజకీయ అవతారమెత్తి మెగాస్టార్ చిరంజీవి పార్టీ అయిన పీఆర్పీలో చేరారు. ప్రరాపాలో కార్యకర్తగా చేరానని, చిరంజీవి మంచి తనమే తనను దగ్గర చేసిందంటోన్న పోసాని పలు విషయాలపై స్పందించారు. అందులో కొన్ని సంగతులు మీ కోసం..
ప్రశ్న.. "రాజావారి చేపల చెరువు" ద్వారా ఏం చెప్పబోతున్నారు..?
జ.. ఇది రాజకీయ నేపథ్యంలో కూడిన కథ. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌ను. ఓ సంఘటనతో నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఊరికి దూరంగా వెళ్ళి చేపల చెరువు పెడతాను. నా విధి నిర్వహణలో నిజాయితీ మెచ్చుకుని మీడియా అంతా నాకు సపోర్ట్ చేస్తుంది.
నా దృష్టిలో మీడియా అనేది శాశ్వత ప్రతిపక్షం. ఎన్ని పార్టీలు వచ్చినా పాజిటివ్, నెగటివ్ అంశాలకు అద్దంపట్టేది మీడియానే. ఆ మీడియా కూడా ఎలా ఉండాలి? అనేది ఈ చిత్రంలో చెప్పాను. క్లైమాక్స్‌లో చక్కని సందేశముంది. నాయకుడు అనేవాడు సేవకుడు. కేవలం పార్టీకే కాదు.. ప్రజలకు కూడానూ.. అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాను.
ప్రశ్న.. ఇండస్ట్రీలో ఉంటూ దానిపైనే దుమ్మెత్తిపోయడం ఎంత వరకు సమంజసం..?
జ.. నా దృష్టిలో సమంజసమే. వేరే రంగం గురించి నాకు అంతగా తెలియదు. ఈ రంగంలోనే డక్కాముక్కాలు తిన్నవాడిని. ఇంకా చెప్పాలంటే.. నా దృష్టిలో ఎదుటివాడు దొంగ అని ఫీలవుతాను. ఒకవేళ మోసపోతే.. ముందుగానే దొంగ అనుకున్నాం కదా.. మోసపోతే పోయాం. అని సరిపెట్టుకునే వాడిని. సినీ ఇండస్ట్రీలో కమేడియన్స్ మంచి వాళ్ళే. వాళ్ళని నమ్మవచ్చు. కానీ హీరోలనే నమ్మకూడదు. నా సినిమా ప్లాప్ అయితే ఏ హీరో ఫోన్‌కూడా ఎత్తడు. సార్! ఈజిప్ట్‌కు వెళ్ళారని అసిస్టెంట్ చేత చెప్పిస్తారు. ప్లాప్ అయినా హిట్ అయినా ఒకేలా ఉండాలి. అది నా నైజం.
ప్రశ్న... సినిమాకు స్క్రిప్ట్ ముఖ్యమా? లేదా హీరో, దర్శకుడు కీలకమా?
జ.. స్క్రిప్ట్ వల్ల సినిమాలు ఆడవు. అందులో అన్ని అంశాలుండాలి. నేను చేసిన మొదటి సినిమా "శ్రావణ మాసం". ఆ సినిమాలో అందరూ కమేడియన్స్ ఉన్నారు. హీరోలూ ఉన్నారు. అది స్క్రిప్ట్ బాగుంది. కానీ ఆడలేదు. ఆ తర్వాత ఆపరేషన్ దుర్యోధన కూడా కేవడం కమేడియన్స్, మాటల వల్ల ఆడింది. హీరోలు లేని చాలా చిత్రాలు కూడా హిట్టయ్యాయి.
|
జ.. ఈ సినిమా రాజకీయ చిత్రమే కానీ. ఏ పార్టీని, నాయకుడిని ఉద్దేశించి రూపొందించింది కాదు. అసలు నాయకుడు ఎలా ఉండాలి. ప్రజలు ఎలా ఉండాలి. ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి. అనే అంశాల్నే చెప్పాను.
ప్రశ్న.. ఈ తరహా చిత్రాలు గతంలోనే చాలానే వచ్చాయి కదా?
జ.. వచ్చాయి. కానీ నా చిత్ర కథ నేటి ట్రెండ్‌కు తగినట్లుంటుంది. రాజకీయ నాయకులు చాలా సులభంగా అసత్యాలు పలుకుతారు. దాన్ని తర్వాత కాపాడుకుంటారు. అలా ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అవుతారు. కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలకు అవే సమస్యలు తలెత్తుతాయి. మరి చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి? దీన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? చేసిన వాగ్దానాలను నెరవేర్చని రాజకీయాలకు ప్రజలే పుల్‌స్టాప్ పెట్టాలి.
ప్రశ్న... పీఆర్పీలో ఉన్నారు? మీరు చెప్పినవన్నింటినీ ఎలా అన్వయించుకుంటారు?
జ.. నేను పీఆర్పీలో ఉన్నా. అంతకంటే ముందు నేను సమాజంలో ఒకడిని. సమాజంలో ఏ పార్టీని ఎవరైనా కామెంట్ చేయవచ్చు. నేనూ అదే చేస్తున్నా. సిద్ధాంతాలు పక్కన పెడితే.. చిరంజీవి నాకు నచ్చిన వ్యక్తి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశా. తర్వాత తెలుగుదేశం, సీపీఎం పార్టీలకు కూడా ఓటు వేశాను. కానీ వారికంటే మంచి వ్యక్తి చిరంజీవి అనుకుని ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పార్టీకి ఓటేశాను.
ప్రశ్న.. మరి చిరంజీవి మాత్రం ప్రజలకు మంచి చేస్తాడని ఎలా అనుకుంటున్నారు?
జ.. అధికారంలోకి వస్తే గానీ తెలీదు. పెళ్ళయిన తర్వాతగానీ పెళ్ళాం మంచిదో కాదో తెలీదు. అలాగే ఇది కూడా. రేపు అధికారంలో వచ్చి చెప్పిన మంచి పనులు చిరంజీవి చేయకపోతే ముందుగా మీడియాకు చెప్పేది నేనే.
ప్రశ్న.. వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు సమంజసం?
జ.. వ్యక్తిగత విమర్శలకు నేను వ్యతిరేకం. ఏది నిజం, ఏది అసత్యం తెలుసుకుని ఎవరైనా మాట్లాడాలి. ఓ మహిళానాయకురాలు చిరంజీవి గురించి ఎడాపెడా మాట్లాడేసింది. ఆవిడేకాదు. చాలామంది నాయకులు అలానే విమర్శించారు. నాయకుడిని, పార్టీని, పార్టీ అజెండాపై దుమ్మెత్తిపోయడం చేయొచ్చు.
కానీ చిరంజీవి కుమార్తెను, తమ్ముడు, తల్లిని ఇలా వేలెత్తి చూపే నీచమైన రాజకీయాలను మానండి. పదిసార్లు విమర్శిస్తే ఊరుకున్నాం. ఇంకా ఊరుకుంటే.. ఇదే నిజమేమో? అనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. అందుకే ఎదురుదాడికి దిగాం. దీన్ని వారు గ్రహించాలి. ప్రతి వ్యక్తిలోనూ లొసుగులుంటాయి. అవన్నీ చిట్టా విప్పిస్తే... ఇక ఎలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటాయో చెప్పలేం.
