1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తా: సురేష్ గోపి

వినోదం వెండితెర ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ అభిమాని సురేష్ గోపి మలయాళం ఆ ఒక్కడు లాయర్ రోల్ శ్రీ మహాలక్ష్మి అంతిమతీర్పు
WD
మలయాళం సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, మమ్ముట్టి తర్వాత చెప్పుకోదగిన నటుడు సురేష్ గోపి. చాలా కష్టనష్టాలను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఈయన, 1965లో బాలనటుడిగా "ఒడయిల్ నిన్ను" అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. కాలక్రమంలో సరైన అవకాశాలు లభించని తరుణంలో విలన్ తరహా పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు.

కానీ అనతికాలంలోనే పోలీసు అధికారి పాత్రల్లో వచ్చిన గుర్తింపుతో ఒక్కసారిగా అగ్రస్థాయి నటుడిగా వెలుగొందారు. ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలు, చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఆయనకు ప్రత్యేక ఇమేజ్‌ను ఆపాదించాయి. నటుడికి భాషతో పనిలేదని అంటున్న ఆయన చాలా కాలం తర్వాత తెలుగులో "ఆ ఒక్కడు" చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో పవర్‌ఫుల్ లాయర్ పాత్రను పోషిస్తున్నారు. మలయాళం కంటే తెలుగులోనే నిర్మాణ వ్యయం ఎక్కువని చెబుతోన్న సురేష్ గోపీ (సురేష్ జి. నాయర్) చెబుతున్న ముచ్చట్లు మీ కోసం...

ప్రశ్న.. పోలీస్ పాత్రలు చేసే మీరు లాయర్‌గా చేయడానికి కారణం?
జ.. లాయర్‌గా నాకిది మూడో తెలుగు చిత్రం. 1988లో కృష్ణం రాజు కాంబినేషన్‌లో "అంతిమతీర్పు"లో చేశాను. ఆ తర్వాత మలయాళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన "చింతామణి కొలైకేసు"లోనూ పోషించాను. ఆ చిత్రాన్ని తెలుగులో శ్రీహరి కాంబినేషన్‌లో "శ్రీ మహాలక్ష్మి"గా రీమేక్ చేశారు. అందులోనూ లాయర్‌గా నటించాను. వీటిన్నింటికీ మించిన పవర్‌ఫుల్ పాత్ర "ఆ ఒక్కడు". ఇందులో నా పేరు శ్రీ కృష్ణ. థ్రిల్ ఏమిటంటే..? నాకిష్టమైన దేవుడు శ్రీ కృష్ణుడు. ఆ పేరే పాత్రకు పెట్టారు.

ప్రశ్న.. దేవుడిని బాగా నమ్ముతారా?
జ.. దేవుడిని నమ్ముతాను. దానికంటే ముందు హస్త్రసాముద్రికాన్ని బాగా నమ్ముతాను. దానికి ఓ కారణముంది. అలెప్పీలో ఉండే సమయంలో, ఓసారి అనుకోకుండా బురద గుంటలో పడిపోయాను. ఒకవైపు లోపల బురద లాగేస్తుంది. మరోవైపు చాలా కష్టపడి బాబాయ్ నన్ను పట్టి పైకి లాగేశాడు. ఎలాగో ప్రమాదం నుంచి బయటపడ్డాను.

ఆ తర్వాత చాలాసార్లు నా చేయిచూసిన జ్యోతిషులంతా.. 3 సంవత్సరాల లోపు జలగండం నుంచి బయటపడ్డావ్ అనేవారు. ఈ గండం తర్వాత తన ముద్దుల కుమార్తె కూడా చనిపోయింది. ఆ విషయాన్ని కూడా జ్యోతిషులు చేయి చూసి కరెక్ట్‌గా చెప్పేశారు. కేరళలో నాడి జ్యోతిషం చాలా ఫేమస్. ఈ జ్యోతిషాన్ని బాగా నమ్ముతాను.

ఇలా.. కొద్దికాలం కాలినొప్పి వల్ల రెస్ట్‌తీసుకున్నా. ఆ సమయంలో ఒక్క నిర్మాత కూడా దగ్గరికి రాలేదు. అంతకుముందు అడ్వాన్స్ ఇచ్చిన వారుకూడా వెనక్కి తగ్గారు. ఆ తర్వాత జ్యోతిషులు నా చేయి చూసి ఆంధ్రాభోజనం తింటావ్ అన్నారు. వాళ్ళు చెప్పినట్లే ప్రస్తుతం జరుగుతోంది. ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. అంతకుముందు రామానాయుడు సినిమాలో నటించాను. ఇప్పుడు "ఆ ఒక్కడు" అనే ఈ చిత్రం. రేపు మరో చిత్రం కావచ్చు.

ప్రశ్న.. కొత్తవారిని ప్రోత్సహించకుండా మీరే చేయడానికి కారణం?
జ.. (నవ్వుతూ).. ఎస్.. మీరన్నది కరెక్టే. కానీ, దర్శకుడు మూర్తి నన్ను కలిసి మీరే చేయాలన్నారు. గతంలో నా చిత్రాలను చూశానని చెప్పారు. కథ విన్నాక బాగా నచ్చి అంగీకరించాను. పాత్ర హుందాతనంగా ఉండాలని చెప్పారు. ప్రత్యర్థి లాయర్ కూడా నిండుగా ఉంటాడు.

WD
ప్రశ్న.. మలయాళం, టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరు గమనించిన వ్యత్యాసం?
జ.. ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువ. ఒకరకంగా వేస్టేజ్ ఎక్కువ. అక్కడ చాలా తక్కువ ఖర్చు పెడతారు. ఆంధ్రాలో మూడోవంతు వున్న కేరళలో సినిమాలు కూడా పరిమితమే. ఇక్కడ సినిమాలు 60-80 రోజులు పడితే.. అక్కడ 30 రోజుల్లో సినిమా పూర్తవుతుంది.

ప్రశ్న.. వేస్టేజ్ అంటే.. మీ ఉద్దేశ్యం?
జ.. మమ్ముటి, మోహన్‌లాల్, పృథ్విరాజ్, ఇలా అంతా స్వంత కారవాన్ (రెస్ట్‌రూమ్ ఉన్న వెహికల్) తీసుకువస్తాం. దానికి కేవలం డీజిల్ ఖర్చులే నిర్మాత అందజేస్తాడు. ఈ మధ్య నేను కూడా తీసుకు వస్తున్నా. ఇక్కడలా లేదని విన్నాను.

ప్రశ్న.. ఆర్టిస్టుగా సౌకర్యాలు ఎలా ఉంటాయి?
జ.. నేను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొంటాను. ఆ టైమ్‌లోనే నా పాత్ర పూర్తి చేస్తారు. ఆర్టిస్టుకు టైమ్ ప్రాధాన్యం. దాన్ని ఇంతవరకు నేను దాటిందిలేదు. సౌకర్యాల పరంగా చూస్తే.. కారవాన్ ఉండటం వల్ల ఎండ, దుమ్ము పడకుండా ఫేస్‌ను కాపాడుకోవచ్చు. షాట్‌గ్యాప్‌లో విశ్రాంతికి అనుకూలంగా ఉంటుంది. ఇక భోజనం విషయంలో అంతా కలిసి తింటాం. ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇక్కడ కంటే ముంబైలో మరీ లావిష్‌గా ఉంటుంది.

ప్రశ్న.. మీకు చాలా కష్టమైన సందర్భాలు?
జ.. బాంబు పేలుళ్ల షాట్లలో ఎక్కువగా పాల్గొన్నాను. పైన ఎండవేడితో పాటు, బాంబు పేలడం వల్ల దుమ్ముధూళి మంటలకు కంటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా నా కుడికన్ను కొద్దిగా దెబ్బతింది. అందుకే బయటకు వస్తే నల్లకళ్లజోడు పెట్టుకుంటాను.

ప్రశ్న.. లాయర్‌గా మీరు ఎటువంటి శిక్ష విధిస్తారు.?
జ.. సినిమా పరంగా అన్యాయం చేసేవారిని శిక్షిస్తాను. బయట జరిగే సంఘటనలు వింటుంటే కొన్ని థ్రిల్ కలిగిస్తాయి. తప్పుచేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. దుబాయ్‌లో తప్పు చేస్తే వేళ్ళు నరికేస్తారు. ఇటీవలే చైనాలో కూడా ఓ సంఘటన జరిగింది. అవినీతి, అన్యాయం చేసిన వారిని బహిరంగంగా కాల్చేశారు. కానీ నా సినిమాలో అటువంటి శిక్షలు లేవు.

ప్రశ్న... అవినీతిపై మీ అభిప్రాయం?
జ.. అందరూ అవినీతిని అంతం చేయడానికి కట్టుబడాలి. ఒక ఫ్లై ఓవర్ కడితే దానివల్ల పాలకులు లాభించకూడదు. ప్రజలు లాభపడాలి. అలాగే చాలా పనుల్లో పాలించేవారు లాభం పొందుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పైన చెప్పినట్లు, తప్పుకు సరైన శిక్ష ఉంటేనే అవినీతి తగ్గుతుంది.

ప్రశ్న.. రాజకీయాలపై మీ విశ్లేషణ?
జ.. రాజకీయాల పరంగా చెప్పాలంటే.. నాకు ఇందిరాగాంధీ అంటే ఇష్టం. నేను కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తా. గ్రేట్ మదర్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన మహిళ ఇందిరాగాంధీ. రాజీవ్‌గాంధీ లాంటి నాయకుడికి తల్లి ఆమె. అలాంటి మహిళ మళ్ళీ పుట్టడం అసాధ్యం. ఆ తర్వాత కామరాజ్‌నాడార్ అంటే నాకు చాలా ఇష్టం.

ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మీరేమనుకుంటున్నారు?
జ.. సంకటస్థితిలో ఉందనిపిస్తుంది. చంద్రబాబు లాంటి వ్యక్తిని ఎందుకు ప్రజలు వ్యతిరేకించారో అర్థం కాలేదు. రైతులకు న్యాయం చేయలేదనుకుంటే, ఇంకోపరంగా ఆయన్ను నివారించవచ్చు. కానీ ప్రజలు పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చేశారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ నటుడు నాయకుడై ప్రజలకు ఎంతో సేవ చేస్తే, దాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు.

ప్రశ్న.. చిరంజీవిని గురించి మీరేమనుకుంటున్నారు?
జ.. తెరపై మంటి నటుడు. మానవీయ విలువలున్న మనిషి. రాజకీయపరంగా నాకు పెద్దగా తెలీదు.
About Writer
SELVI.M