My Gratitude to cine Field: Dasari | కళామతల్లిని సత్కరిస్తున్నా..!: దాసరి
|
ప్రశ్న.. నటుడిగా మళ్ళీ కొనసాగుతారా?
జ.. చాలా తక్కువ చిత్రాలు చేశాను కాబట్టే నటుడిగా గౌరవాన్ని కాపాడుకుంటున్నా. కథాపరంగా నాది ప్రధాన పాత్ర అయితే బయటి చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.
ప్రశ్న.. మేస్త్రీ సినిమా ఏ మేరకు ప్రజలకు చేరువైందనుకుంటున్నారు?
జ.. మేస్త్రీ చిత్రంలో చెప్పిన ఓటుహక్కు సందేశం జనాల్లో చేరింది. పోలింగ్ శాతం పెరగడంతో కొంత నా పాత్ర కూడా ఉంది. ఓటుహక్కుతో ముసుగువేసుకున్న మోసగాళ్ళను నమ్మవద్దనే సందేశం జనాల్లో చేరింది. "మేస్త్రీ" ఓటుహక్కు సందేశం ఫలితం ఈ నెల 16న తేలుతుంది.
ప్రశ్న.. ఈ చిత్రాన్ని చూసి కొందరు భుజాలు తడుముకున్నారెందుకని?
జ.. ఆ పాత్రలకు వారికి సంబంధం ఉండివుండవచ్చు. ఎంతోమంది ఉన్నా వారేమీ మాట్లాడుకుండా.. కొంతమంది ఎందుకు మాట్లాడారో ఇట్టే తెలిసిపోతుంది.
ప్రశ్న.. ఫ్యామిలీ చిత్రాలకు ఆదరణ ఉందంటారా?
జ.. జగపతిబాబు నటించిన బంగారుబాబు సినిమా మే ఒకటిన విడుదలైంది. ఓపెనింగ్ చాలా డల్‌గా ఉన్నా, కానీ నిదానంగా మొదటి ఆటకు పుంజుకుంది. హిట్ టాక్ కూడా వచ్చింది. జగపతిబాబు నటన ఈ సినిమాలో అదిరింది. మహిళా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ప్రేమాభిషేకం తర్వాత మ్యూజిక్‌ను అంతగా ఆస్వాదిస్తున్నారు.
ప్రశ్న.. ఈ ఏడాది తీసుకోబోతున్న నిర్ణయాలు?
జ.. 149వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నా. అదీ సంచలనమైన కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అందరి అంచనాలకు దగ్గరగా ఉంటుంది. అదే విధంగా ఈ ఏడాది స్వంత నిధితో "నీడ" అనే సేవా సంస్థను ప్రారంభిస్తున్నా. వృద్ధాశ్రమం, చైల్ట్‌లేబర్లకు విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్ళమీద నిలబడేలా చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. నా ఆదాయంతో శాశ్వత సంస్థగా నెలకొల్పుతాను.
ప్రశ్న.. గత మూడేళ్ళుగా నిర్మాతల్ని, దర్శకుల్ని, టెక్నీషియన్లు గౌరవించడానికి కారణం?
జ.. బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ మనిషి, కాళ్ళకు చెప్పులు లేకుండా మద్రాసులో అడుగుపెట్టి ఒక వ్యవస్థ కాగలితే.. ఆ వ్యవస్థకు కారణభూతులైన నిర్మాతలు, తోటి సాంకేతిక నిపుణులు, సినిమా మూల స్థంభాలైన 24 క్రాఫ్ట్‌లవల్లే ఈ స్థితికి రాగలిగాను. అందుకే సీనియర్లను గౌరివిస్తున్నాను. కళామతల్లికి సత్కారం చేసుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత ఆలోచన.
ప్రశ్న.. మళ్ళీ రాజకీయ చిత్రం తీస్తారా?
జ.. ఎప్పుడు పడితే అప్పుడు తీయలేం. మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు తీస్తా.
ప్రశ్న.. మీ పతాకంపై కొత్త దర్శకులికి అవకాశం కల్పిస్తున్నారా?
జ.. రెండు, మూడు కొథలతో కొత్తవారు వచ్చారు. నచ్చితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం రేలంగి నరసింహారావు ఓ రచయితతో కథ తయారు చేశారు.
ప్రశ్న.. డైలీ పారితోషికంపై మీ అభిప్రాయం?
జ.. అదీ మంచిదే. తీయగలిగే స్తోమత ఉంటే చాలు.
ప్రశ్న.. మీ చేతిలో కొన్ని థియేటర్లున్నాయని వార్తలొస్తున్నాయి? వాటి గురించి?
జ.. నాకు సిటీలో మూడు థియేటర్లున్నాయి. ఆ మాత్రం లేకపోతే ఎలా. అంతకుమించి ఎక్కడా లేవు. అది తెలీక నాకు కొన్ని థియేటర్లున్నాయని కొందరు అంటున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని తర్వాత సారీ చెప్పారు.
ప్రశ్న.. మూడు ఛానళ్లపై నియంత్రణ కొనసాగుతుందా?
జ.. ఇక్కడే అసలు విషయం చెప్పాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌లో 11 అంశాలున్నాయి. ఇందులో పబ్లిసిటీ నియంత్రణకు మొదటి స్థానం. ప్రతిసారీ ఆ ఒక్క అంశంపైనే చర్చిస్తున్నారే తప్ప మిగిలినవన్నీ మరుగునపడిపోతున్నాయి. 50లక్షలతో సినిమా తీసిన రోజు నుంచి మొదలైన ఆంక్షలు, ప్రస్తుతం 25 కోట్ల సినిమా తీస్తున్నా కొనసాగుతూనే ఉంది. దాన్ని సరిగ్గా సమీక్షించాలి. అవసరమైతే ఆ మూడు ఛానల్స్‌తో మాట్లాడేందుకు నేను ప్రయత్నిస్తాను.
