Sivaji, Missamma, Tata Birla Madyalo Laila, Mantra, Mass Role | అలా చూడటం ఇష్టం లేదేమో: శివాజీ
|
"మిస్సమ్మ" తర్వాత సరైన హిట్‌లేకపోయినా ఆయనతో పలువురు నిర్మాతలు చిత్రాలు తీస్తూనే ఉన్నారు. "టాటా బిర్లా మధ్యలోలైలా" కాస్త ఏవరేజ్‌గా ఆడినా, "సీతారాముడు" వంటి మాస్ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.
అందుకే ఛార్మి "మంత్ర"లో ఓ క్యారెక్టర్ పోషించారు. ఆ చిత్రం విజయవంతమయినా శివాజీకి పెద్దగా పేరు రాలేదు. ఇటీవలే "డైరీ" అనే సస్పెన్స్ తరహా సినిమాలో నటించారు. అదీ పెద్దగా ఆడలేదు.
ప్రస్తుతం తనే నిర్మాతగా హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 30న శివాజీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కొన్ని విషయాలు మీ కోసం..
ప్రశ్న.. నిర్మాతగా మారాలని ఎలా అనిపించింది?
జ.. నేను హీరోగా చేసిన చిత్రాల్లో నాకంటూ ఒక ప్రత్యేక శైలిలో తీయాలనుంటుంది. దాన్ని బయటి నిర్మాతలు చేయలేరు. అదీగాక సినిమా పూర్తయ్యాక ప్రమోషన్ చాలా కీలకం. దాన్ని నేనే అయితే చేసుకోగలను. గతంలో అలా చేయలేక చాలా చిత్రాలు సక్సెస్ కాలేకపోయాయి. అందుకే నిర్మాతగా మారాను.
ప్రశ్న.. ఇది ఏ తరహా చిత్రం?
జ.. ఇది కన్నడంలో విజయవంతమైన 'తాజ్‌మహల్' చిత్రం. దీన్ని రీమేక్ చేస్తున్నాను. మన నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు అందివ్వాలని అనుకుంటున్నాను. తెలుగులో ఇంకా పేరు పెట్టలేదు.
ప్రశ్న.. సోలో హీరోగా నటించిన "మిస్సమ్మ" అంత సక్సెస్ కాకపోవడంపై మీ విశ్లేషణ?
జ.. "మిస్సమ్మ"ను నీలకంఠ తన కొత్తదనమైన స్క్రీన్‌ప్లేతో చూపించారు. అది అందరి మన్నలను పొందింది. రొటీన్ ఫార్మెట్‌లా గాకుండా కొత్తదనంగా కొన్ని మాస్ చిత్రాలు చేశాను. వాటిని కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అంటే నన్ను మాస్ పాత్రలో చూడడం ఇష్టంలేదని గ్రహించాను. నా ఫేట్ బాగేలేదని చెప్పగలను. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలే చేయాలనుకున్నాను. అందుకు సరైన కథలు దొరికితే చేయాలని గతంలో చేసిన తప్పుల్ని చేయకుండా జాగ్రత్త పడుతున్నాను.
ప్రశ్న.. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతగా బాగోలేదనీ, విజయాలు లేవని తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?
జ.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూలేని విధానం ఈ ఏడాది ఉంది. వైవిధ్యమైన చిత్రాలు రాలేకపోతున్నాయని చెబుతున్నారు. కానీ ప్రతీ చిత్రాన్ని వైవిధ్యంగా తీయాలని దర్శకనిర్మాతలు కృషి చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకో? ఆ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందడంలేదు. ముఖ్యంగా ప్రేక్షకులికి ఎంటర్‌టైన్‌మెంట్‌కావాలని "కిక్" వంటి చిత్రాల ద్వారా రుజువుచేశాం. ఆ రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు వస్తే తప్పకుండా సక్సెస్ శాతం పెరుగుతుంది.. అంటూ ముగించారు.
