1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Pattikonda Kumaraswami

producer | Pattikonda Kumaraswami | Mohan Babu | Suresh Babu | వాళ్లు నిర్మాతల పాలిట బాబులు కాదు బాంబులు

నిర్మాత
WD
తెలుగు సినిమా నిర్మాతను బికారిని చేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. సినిమాల్లో కోట్లు పెట్టిన నిర్మాత తను బికారిగా మారిపోయి అందులో పనిచేసినవారిని ఆదుకుని వెళ్ళిపోతున్నాడు. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారస్వామి మొదటగా మూడు పాత్రలతో 'వంశం' అనే చిత్రాన్ని తీశాడు. ప్రయోగాత్మకంగా బాగానే ఉన్నా పెద్దగా లాభాలు రాలేదు.

మళ్ళీ ఏడాది గ్యాప్‌తో వచ్చి 'రాజు మహరాజు' సినిమాను నిర్మించారు. ఆ నిర్మాణంలో ఆయన అనుభవించిన బాధలు మరెవరికీ వద్దనీ, ఈ చిత్రంతో నాకు తెలుగులో సినిమాలు తీయాలంటేనే భయమేస్తుందని సెస్సేషనల్‌ ఇంటర్య్వూ యిచ్చారు. ప్రత్యేకంగా మీకోసం.

నిర్మాతగా ఎలాంటి చిత్రాలు నిర్మించాలని వచ్చారు?
సినిమా అనేది పూర్తి కమర్షియల్‌ అన్నమాట వాస్తవం. అయితే దానితోపాటు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యతనిచ్చి సినిమా తీయాలన్నది నా ఉద్దేశ్యం. సినిమా ద్వారా మంచి చెప్పకపోయినా ఫర్వాలేదుకానీ చెడు మాత్రం చెప్పకూడదు. అన్ని వర్గాలు మెచ్చే కుటుంబ కథా చిత్రాలు తీయాలనేది నా అభిమతం. కథ నుండి క్యారెక్టర్‌ పుడితే ఆ కథకు అందం వస్తుంది. అలాంటి ప్రయోగమే వంశం, రాజు మహరాజు చిత్రాలు.

ఈ చిత్రంద్వారా ఏం చెప్పదలచుకున్నారు?
జీవితానికి డబ్బే ముఖ్యం కాదు. మనుషుల్ని ప్రేమించాలి. మనం ప్రేమించబడాలి అదే ఈచిత్రం ద్వారా చెప్పాం. డబ్బుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు అన్నదే పాయింట్‌.

మోహన్‌పాత్ర ఎలా ఉంటుంది?
మనసుతో అందరినీ ప్రేమించేటట్లు చేయడమనే వ్యక్తిత్వంతోకూడిన పాత్రను ఆయన అద్భుతంగా పోషించాడు.

ఆయనకే ఎక్కువ పారితోషికం యిచ్చారని తెలిసింది?
వాస్తవమే. పాత్రపరంగా దర్శకుడు దుర్గాశంకర్‌నాథ్‌ కోరితే ఖర్చు ఎంతయినా ఫర్వాలేదని తీసుకున్నాం. దాదాపు రూ. 2కోట్లు ఆయనకు కేటాయించాం.

శర్వానంద్‌ హీరోగా మోహన్‌బాబు నటించే చిత్రానికి రూ. 15కోట్లు వెచ్చించి తీసిన ఓ అమాయక నిర్మాతగా ఇండిస్ట్రీలో అనుకుంటున్నారు?
బడ్జెట్‌పరంగా కొంత స్ట్రగుల్‌ ఎదుర్కొన్న మాట వాస్తవమే కానీ కథ డిమాండ్‌మేరకే పెట్టాం. ఖర్చంటారా.. హోటల్‌కు అందరమూ వెళతాం. నేను పిలిచాను కదా .. వారడిగింది.. యివ్వకపతప్పదు. కొంతమంది వెజిటేరియన్‌ తింటారు. మరికొంతమంది మాకు చికెన్‌, మరికొందరు మటన్‌, మరొకరు రొయ్యలు లేదా మరొకటి రకరకాలుగా ఆర్డర్లు యిస్తారు. కనుక ఖర్చు తప్పదు.

అంటే సినిమా తీసి వారి గొంతమ్మెకోర్కెలకు రాజీపడిపోయారా?
కథనుబట్టే తీశాను. మంచి సినిమా అని ఖర్చుకు వెనుకాడలేదు.

రిలీజ్‌ తర్వాత చాలా యిబ్బందులు ఎదుర్కొన్నారని వార్తలు వచ్చాయి. వాటిని వివరిస్తారా?
(మీకు రాసే ధైర్యం ఉంటే రాయండి.. నేను చాలామందికి చెప్పాను.ఎవరూరాయలేదు..) అంటూ. రిలీజ్‌ను నేను ఓన్‌గా చేయాలనుకున్నాను. కానీ ఇక్కడ వ్యాపారం సరిగ్గా తెలీదు. పైగా థియేటర్లన్నీ సురేష్‌బాబు చేతుల్లో ఉన్నాయని తెలిసింది. చేసేది లేక సురేష్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజర్‌ను సంప్రదించాను. వారు రిలీజ్‌చేశారు. రిలీజ్‌చేశాక కనీసం పబ్లిసిటీకూడా చేయడంలేదు.

మరి మీరే పబ్లిసిటీ చేసుకోవచ్చుగదా?
ఎలా చేసుకుంటాం. ఆల్‌రెడీ కష్టపడి తీసిని ప్రోజెక్ట వారిచేతుల్లో పెట్టాను. ఆ తర్వాత నిబంధనల ప్రకారం వారే పబ్లిసిటీ చేయాలి. ఆ విషయం తెలిసి చాలాసార్లు వారితో సంప్రదించాను. కనీసం రెండో వారం పోస్టర్‌కూడా వేయలేదు. అదేమని అడిగితే.. సరైన సమాధానం రాదు.

మరి మోహన్‌బాబు విషయంలోకూడా ఏదో జరిగిందని తెలిసింది?
పబ్లిసిటీకి ఆయన వస్తే బాగుంటుందని దర్శకుడు భావించి.. మోహన్‌బాబు వద్దకు వెళ్ళాం. మూడు రోజులు కుక్కలా యింటికి తిప్పుకున్నారు. కుక్క అని ఎందుకన్నానంటే... ఆయన యింటికి వెళ్ళి ఆయన దర్శనం కోసం కాపలా కాసినట్లుగా పొద్దున్నే వెళ్ళడం. మధ్యాహ్నంవరకు వేచి ఉండడం.. కానీ ఆయన దర్శనంకాదు. కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతగా ఎందుకు ఎదురుచూడాలనిపించింది. అదే ఆయన స్వంత సినిమా అయితే పబ్లిసిటీకి రారా?

హీరోయిన్‌ విషయంలోకూడా రూ. 10 లక్షలు అదనంగా ఖర్చుపెట్టారని తెలిసింది?
అవును. రాజు మహరాజులో మొదట స్నేహా ఉల్లాల్‌ను అనుకున్నాం. ఆమె ఫొటోసెషన్‌కోసం 4లక్షల ఖర్చు పెట్టాం. ఆమెతోపాటు నలుగురు అదనంగా వచ్చారు.వారికి స్టార్‌ హోటల్‌ సౌకర్యం కల్పించారు. వారంరోజులున్నారు. కానీ చివరిగా ఏదో కారణం చెప్పి డేట్స్‌ కుదరడంలేదని తప్పించుకుంది ఉల్లాల్. అప్పటికే ఆమెకు 10లక్షలు అడ్వాన్స్‌గా యిచ్చాం. దాంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, మా అసోసియేషన్‌కుఫిర్యాదు చేశాం. కానీ సరైన స్పందనలేదు. చేద్దాం.. అంటూ దాటవేస్తున్నారు.

ఎక్కడ లోపమని భావిస్తున్నారు?
ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రతీవారు నటులే. నేను గమనించిందది. తెరపై కంటే నిజజీవితంలో బాగా నటిస్తారు. అందుకు ఉదాహరణే మోహన్‌బాబు. ఆయన టైమ్‌ మెయింటేన్‌ చేయడంలో గ్రేట్‌ కావచ్చు. నిర్మాతలతో గొంతెమ్మకోర్కెలు కోరడం, వారికి సహకరించకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాను. పైగా నేను చేసిన తప్పేమీలేదు. కోట్లు పెట్టి సినిమా తీయడం తప్పేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా తీసి పబ్లిసిటీతో ముందుకు సాగాలంటే కొంత రౌడీయిజంకూడా తెలిసి ఉండాలి. సాఫ్ట్‌గా ఉంటే పిచ్చోడిగా జమకడతారు. నేను తెలుగులో సినిమా తీసి చాలా నష్టపోయాను. అందుకే యిక నుంచి తెలుగులో సినిమాలు తీయకూడదనే నిర్ణయానికి వచ్చాను.

పెద్ద హీరోలు ఆఫర్లు యిచ్చారని తెలిసింది?
నిజమే... ప్రముఖ హీరోలు ఆఫర్లు యిచ్చారు. నేను సిద్ధమని తెలియజేశాను. కానీ కొంతమంది నిర్మాతలు ఆ అవకాశం నాకు దక్కకుండా చేశారు. ఎక్కడినుంచో వచ్చినవాడికి డేట్స్‌ యిస్తున్నారని నన్ను తప్పించారు. ఇలా ఎన్నో రాజకీయాలు సినిమా ఇండిస్ట్రీలో ఉన్నాయి. కన్నడంలో, తమిళనాడులో అలా లేదు. అందుకే నేను కన్నడంలో ప్రముఖ హీరోతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తాను.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT