Nagarjuna| Interview| Naga Chaitanya| Dil Raju| Vasu Varma | మనిషి అనేవాడు ఖాళీగా ఉండకూడదు: నాగార్జున
|
తన వారసునిగా నాగచైతన్యను సొంత బేనర్‌లో కాకుండా బయట బేనర్ దిల్‌రాజుతో సినిమా చేయిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాసువర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలున్నాయి.
తాజాగా "కింగ్" (నాగార్జున) కొత్త చిత్రం ఈనెల 24న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన తన చిత్ర విషయాలకంటే తన వారసుని విషయాలను తెలియజేశారు. అందులో కొన్ని మీ కోసం...
ప్రశ్న: నాగచైతన్యను సొంత బేనర్‌లోకాకుండా బయట నిర్మాతలకు అప్పగించడం పట్ల మీ అభిప్రాయం?
జ: నాగచైతన్యను హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాం. ఎప్పుడు ఎలాగా? అనే ఆలోచనలో ఉండగానే బయట నిర్మాతలు అడిగారు. అందరికీ చూద్దాం అని చెప్పాను. కానీ ఒక ఆఫర్ దగ్గర నేను ఆగిపోయాను. అదే దిల్‌రాజు.
ప్రశ్న: ఆయనతో మీరు సినిమాలు చేయలేదు కదా?
జ : చేయకపోయినా యూత్ సినిమాలు తీయడంలో దిల్‌రాజుకు మంచి పట్టుంది. సమర్థవంతంగా సాఫీగా తీయగలడనే నమ్మకముంది. దీనికి ఆయన గత చిత్రాలే నిదర్శనం.
ప్రశ్న: మరి దర్శకుడు కూడా కొత్తవాడే కదా?
జ: అయినా పర్వాలేదు. వాసువర్మ దిల్‌రాజు సినిమాలకు కథలు రాశాడు. అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఆర్య ద్వారా సుకుమార్‌ను, బొమ్మరిల్లు ద్వారా భాస్కర్‌ను పరిచయం చేశాడు. టాలెంట్ ఉంటే నేనెలా ప్రోత్సహిస్తానో దిల్‌రాజు కూడా అంతే.
ప్రశ్న: దిల్‌రాజు కథకే ప్రాధాన్యత ఇస్తారు. హీరోగా మీ అబ్బాయి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారని భావిస్తున్నారు?
జ: స్టార్ కొడుకైనా ముందుగా కావాల్సింది కథే. అదే హీరో. నా సినిమాలన్నీ చాలామటుకు కథలే హీరోలు. శివలో కథే హీరో. అది లేకపోతే నేనులేను.
ప్రశ్న: చైతన్య సెషన్ చూశారు కదా.? ప్రేక్షకుడిలా మీకేమైనా లోపాలు కన్పించాయా?
జ: బాగున్నాడు. బాగా చేశాడు. ఈ దశలోనే ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు.
ప్రశ్న: ఈ జనరేషన్‌లో హీరోలు ఏడాదికి, రెండేళ్ళకు ఒక సినిమా చేస్తున్నారు. మరి నాగచైతన్యను ఎలా చేయిస్తారు?
జ: నా అభిప్రాయం ప్రకారం తను సంవత్సరానికి ఖచ్చితంగా మూడు సినిమాలు చెయ్యాలి. నటనను వృత్తిగా స్వీకరించాక వెనుకాడకూడదు. నాకంటే నా వయస్సుకి ఇమేజ్‌కి తగిన కథలు దొరకడం కష్టం. తనకు ఆ ఇబ్బంది లేదు. తను కష్టపడాలి. సంక్రాంతికి, దసరా, దీపావళికి ఒకటి చొప్పున చేయాలి.
ప్రశ్న: కొంతమంది యువ హీరోలు తక్కువగా చిత్రాలు చేయడంపై మీ ఫీలింగ్?
జ: అది చాలా తప్పు. మనిషి అనేవాడు ఖాళీగా ఉండకూడదు. ఎనర్జీని ఏదోవిధంగా ఉపయోగించాలి. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. నేను అలా ఉండను. ఏదో పని చేస్తూనే ఉంటాను. జూనియర్స్ కొంచెం కథలపై కుస్తీపడాలి. వచ్చిన అవకాశాన్ని
ఉపయోగించుకోవాలి.
ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటించే అవకాశముందా?
జ: ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఏదైనా అద్భుతమైన కథ లభిస్తే అప్పుడు తప్పకుండా చేస్తా.
