ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠోరమైన శ్రమతోపాటు అదృష్టం కూడా ఉండాలని నటి తమన్నా చెబుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతోపాటు మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ ముంబయి భామతో మినీ ఇంటర్వ్యూ...
ప్ర. 13 ఏళ్ల వయస్సులో సినీ పరిశ్రమకు వచ్చారు. మీకెలా అనిపించింది...? జ. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత నేను చాలా రకాల పాత్రలు వేశాను. అంతేకాదు ఆ సమయంలో ఎంతోమందిని స్టడీ చేసి వారెలా మసలుకుంటున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది.
నేను ఉద్యోగంలో చేరుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డ్యూటీ చేసేదాన్ని. అదే ఈ రంగంలో ఉండటంతో అటుఇటుగా అంతే అయినా పెద్దగా శ్రమ తెలీదు. కష్టపడటం ఎక్కువే. దానికి అదృష్టం కూడా తోడైతే మరింత రాణించే అవకాశం ఉంటుంది. అలా నాకు వచ్చిన అవకాశమే హ్యాపీడేస్. ఆ చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు.
ప్ర. ఇప్పటి జీవితం ఎలా ఉంది..? జ. రేపటి గురించి కలలు ఉంటాయి. అవి కఠోరమైన కృషి చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. అటువంటి కలలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. రేపు కూడా ఎంతో బావుంటుందన్న నమ్మకం నాకు చాలా ఎక్కువ.
ప్ర. మీకు బాగా నచ్చిన పాత్రలేమైనా ఉన్నాయా..? జ. టైటానిక్ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అందులో విన్‌స్లెట్ పోషించిన "రోస్" లాంటి పాత్ర వస్తే చేయాలని ఉంది. "జబ్ వి మెట్" కూడా అంతే. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో నేను నటిస్తున్నాను. ఎన్నాళ్లుగానో నేను చేయాలనుకుంటున్న పాత్ర దొరకడం నిజంగా చాలా థ్రిల్ కలిగించింది.
ప్ర. పాత్రల ఎంపికలో తల్లిదండ్రుల పాత్ర ఎంత మేరకు? జ. పరిమితమే. కథ, హీరో, సంస్థ, దర్శకుడు నచ్చితే చాలు. నేనే ఓకే చేస్తా.