1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. Interview

Nagarjuna| Interview| Kedi| Cinema| Mamata Mohandas| Nagachaitanya| King| Mahesh babu| Siva Prasad Reddy | ఇకపై.. అమ్మాయిల వెంట.. మా అబ్బాయి...: కింగ్

నాగార్జున
అక్కినేని వంశం నుంచి తెలుగు చిత్ర సీమను యువసామ్రాట్‌గా శాసిస్తున్న నటుడు నాగార్జున. నాగార్జున హీరో అయినప్పటి నుంచి కామాక్షిమూవీస్ అధినేత శివప్రసాద్‌రెడ్డి ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ఇప్పటివరకు 25 సంవత్సరాలు పూర్తయింది. అందుకు గుర్తుగా మళ్లీ అక్కినేని నాగార్జునతో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించారు. దీనికి "కేడి" అనే పేరు పెట్టారు.

ఇప్పుడు నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా కథానాయకుడయ్యాడు. త్వరలో తన పతాకాన్ని కామాక్షికళామూవీస్ అనే పేరు మార్చి నాగచైతన్యతో శివప్రసాద్ రెడ్డి ఓ కొత్త చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తన గురించి, తన కుమారుడి గురించి పలు విషయాలను వెల్లడించారు.

ప్రశ్న: "కేడి" అనే టైటిల్ పెట్టడానికి కారణం?
జ: కామాక్షి బేనర్‌లో సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. రమ్మీ, మోసగాడు, మాయగాడు అంటూ మీడియాలో రాసేశారు. శివప్రసాద్ నన్ను మాయగాడు చేశాడని మరికొన్నింటిలో రాసేశారు. సింపుల్‌గా ఉండే టైటిల్ పెట్టాలనుకుని "కేడి" అనే పేరు పెట్టాం. ఈ టైటిల్ పెడుతున్నట్లు చివరి వరకు నిర్మాతకు తెలియదు. ఈ చిత్రంలో పాత్రపరంగా కేడి పనులు చేస్తుంటాను. అందుకే సరైన టైటిల్ అని దాన్ని పెట్టాం.

ప్రశ్న: ఎవరికి "కేడి"? అమ్మాయిలకా?
జ: కానేకాదు. మనుషుల్ని మాయచేసి బతికేస్తుంటాను. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. చాలా సినిమాల్లో డిఫరెంట్ అనేపదం వాడుతారు. ఇది నిజంగా డిఫరెంట్‌గా ఉంటుంది. పలురకాల గెటప్స్ ఉంటాయి. మాస్, కింగ్‌లో కంటే ఎంటర్‌టైన్‌మెంట్ పార్టీ ఎక్కువగా ఉంటుంది. కానీ చివర్లో కాస్త సీరియస్‌గా ఉంటుంది. ఆఖరికి విలన్‌పాత్రలోనూ ఎంటర్‌టైన్ ఉంటుంది.

ప్రశ్న: రొమాన్స్ చిత్రాలు చేసే మీరు ఒక్కసారిగా ట్రెండ్ మార్చేందుకు కారణం?
జ: ఎన్నిరోజులు రొమాన్స్ చేయమంటారు. ఇంకా అమ్మాయిల చుట్టూ తిరగాలా? దానికి మా అబ్బాయి ఉన్నాడు. (పెద్దగా నవ్వుతూ) వాడే చూసుకుంటాడు. వయస్సును బట్టి కూడా కథలు ఎంపిక చేసుకోవాలి కదా..

ప్రశ్న: దర్శకుడిగా అనుభవంలేని కిరణ్‌ను ఎంపికచేసుకోవడానికి కారణం?
జ: అన్నపూర్ణ బ్యానర్‌లో రూపొందిన 'యువ' సీరియల్‌కు కిరణ్ డైలాగ్‌లు రాశాడు. అతను సీన్ చెప్పే విధానం నచ్చింది. అతని పనిమీద అతనికి పూర్తి నమ్మకం ఉంది. "కింగ్" తర్వాత మంచి స్క్రిప్ట్ చెప్పమని కిరణ్‌ను అడిగితే ఈ కథ చెప్పాడు. కథ నచ్చి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాను.

ప్రశ్న: డిసెంబర్ సెంటిమెంట్ ఈసారి తప్పినట్లున్నారు?
జ: నాకేమీ డిసెంబర్ సెంటిమెంట్ లేదండి. కాకపోతే ఆ నెలలో తక్కువ రిలీజ్‌లు ఉంటాయి అందుకే ఎవరో ఒకరు మొదలు పెట్టాలని నేను నా సినిమాలు రిలీజ్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు చాలామంది తమ సినిమాలతో డిసెంబర్‌లోనే ముందుకు వస్తున్నారు. అందుకే జనవరికి వెళ్ళాం. ఏదేమైనా మీరన్న సెంటిమెంట్ ప్రకారం "కేడి" చిత్రం షూటింగ్ మొత్తం డిసెంబర్ 20కే పూర్తవుతుంది.

ప్రశ్న: శివప్రసాద్ రెడ్డితో 'కేడి' ఎన్నో సినిమా?
జ: అసలు నా సినిమాలు ఎన్నో నాకే లెక్క తెలీదు. శివప్రసాద్ రెడ్డితో 'కేడి' చేయడానికి కారణం ఉంది. ఆయన నా దగ్గరకు వచ్చి మనమధ్య స్నేహం ఏర్పడి 25 సంవత్సరాలు గడిచాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా చేద్దాం అన్నారు. పైగా 25 ఏళ్లనాడు శోభన్‌బాబుతో ఆయన "శ్రావణసంధ్య" సినిమా చేశారు. అదిసూపర్ డూపర్ హిట్. 'కేడి' కూడా అంత హిట్ అవుతుందనే నమ్మకముంది. స్క్రిప్ట్‌, పాత్రల్లో వెరైటీ షేడ్స్ కూడా ఉన్నాయి. డబ్బింగ్ చెబుతున్నప్పుడే నాకు నేనే కొత్తగా కన్పించాను.

ప్రశ్న: మమతామోహన్‌దాస్‌ను తీసుకోవడానికి కారణం?
జ: మమతా వాయిస్‌కు నేను ఫ్యాన్‌ను. "కింగ్"లో నటించేటప్పుడు ఆమె లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఎఫెర్ట్‌ పెట్టి బాగా పనిచేస్తుంది. అందుకే ఆమెను తీసుకున్నాం.

ప్రశ్న: టైటిల్ విషయంలో ఇబ్బందిపడినట్లు తెలిసింది?
జ: అవును. చాలా ఇబ్బందిపడ్డాం. మొదట 'రమ్మీ' అనే టైటిల్ పెడుతున్నారని వార్తలు వస్తే.. అదేదో బాగుందని ఛాంబర్‌లో టైటిల్ రిజిష్టర్ చేస్తే.. ఆల్‌రెడీ ఆ టైటిల్ వేరే బేనర్‌లో రిజిష్టర్ అయి ఉంది. అయితే మోసగాడు, మాయగాడు ఇవన్నీ నచ్చలేదు. ఆఖరికి 'కేడి' నచ్చి రిజిష్టర్ చేయడానికి వెళితే.. దాన్ని కూడా ఎవరో రిజిష్టర్ చేసేశారు.

అతన్ని సంప్రదిస్తే 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఒక్కపైసా కూడా తగ్గనన్నాడు. నిజంగా సినిమా చేసేవాడైతే అంత డిమాండ్ చేయడు. ఏవో టైటిల్స్ పెట్టి వాటి క్యాష్ చేసుకోవాలని చూసేవాళ్లే వీరంతా. మహేష్ బాబు చిత్రానికి కూడా "కిలాడి" అనే టైటిల్ కావాలంటే అంతకుమందు రిజిష్టర్ చేసిన వ్యక్తి క్యాష్ డిమాండ్ చేశాడు. ఈ పద్ధతి మంచిదికాదు. వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఛాంబర్‌పై ఉంది. ఈ విషయాన్ని ఛాంబర్‌కు తెలియజేశాం. తగిన చర్యలు తీసుకుంటామని ఛాంబర్ కూడా హామీ ఇచ్చింది.

ప్రశ్న: "కేడి" ఏ దశలో ఉంది?
జ: ఇంకా రెండు పాటలు చిత్రీకరించాలి. రేపు గ్రీస్ వెళుతున్నాం. అక్కడ ఓ పాట పూర్తయ్యాక, తిరిగి వచ్చి మరో సెట్ సాంగ్ చేస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 10న ఆడియోను విడుదల చేస్తాం.. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.
About Writer
SELVI.M