Tarun | Birth Day | Interview | Chukkalanti Ammayi-Chakkanaina Abbayi | Sasirekha parinayam | అప్పుడేమో వరదలు-ఇప్పుడేమో ఆందోళనలు.. ఇంకెక్కడ..?
WD
జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణస్టూడియో సమీపాన గల ఈ పబ్‌లో సినిమావాళ్లే ఎక్కువగా వస్తుంటారు. గ్యాప్ తీసుకున్నా ఏదో ఒక రంగంలో ఉన్నానంటున్న తరుణ్ తాజాగా "చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 8వ తేదీ (శుక్రవారం) తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చిట్‌చాట్ మీ కోసం..
ప్రశ్న: నటునిగా చాలా గ్యాప్ వచ్చింది? ఎందుకని?
జ: అవును. 2008 జనవరి 1న కృష్ణవంశీ దర్శకత్వంలో 'శశిరేఖా పరిణయం' విడుదలై హిట్ టాక్ వచ్చింది. నటునిగానూ మంచి పేరు వచ్చింది. ఆ ఏడాది పుట్టినరోజును ఎంతో ఆనందంగా జరుపుకున్నా. ఆ తర్వాత మంచి కథ వస్తే చేద్దామనుకున్నా. అలా వచ్చిన వాటిల్లో "చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి" కథ ఒకటి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదాపడుతూ వచ్చింది. ఒక పాట చిన్న ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తయ్యింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రశ్న: ఈ ఏడాది ఎలా పుట్టినరోజు జరుపుకుంటున్నారు?
జ: ఈసారి చేసుకోవాలని ఆలోచన రాలేదు. మొన్నటివరకు వరద బీభత్సాలతో రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పుడేమో ఆందోళనలు. వీటిమధ్య సామాన్యుడితో పాటు మాకూ మనశ్శాంతి కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు ఏం జరుపుకుంటాం చెప్పండి? ఏదైనా చేస్తే.. దాన్ని రాజకీయం చేస్తారు. అందుకే ఈసారి పుట్టినరోజు నాడు తిరుపతిలో దేవుని సన్నిధిలో ఉంటాను.
ప్రశ్న: మీరు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారు?
జ: మంచి కుటుంబంలో ఆ దేవుడు నన్ను పుట్టించాడు. ముందుగా శ్రీ వేంకటేశ్వరస్వామిని. ఆ తర్వాతే తల్లిదండ్రుల్ని. నా ఇష్టదైవం ఆయనే. ఆ తర్వాతే అభిమానులు.
ప్రశ్న: లవర్‌బాయ్ నుంచి సెక్సీబాయ్‌గా పేరువచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి?
జ: అవన్నీ కల్పితాలే. నువ్వేకావాలి నుంచి లవర్‌బాయ్‌గా పిలిచారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఈనాటి టాప్ హీరోయిన్లతో నటించాను. అందరూ నాతో నటిస్తుంటే.. చాలా సరదాగా ఉంటుందంటారు. దాన్ని సాకుగా తీసుకుని రకరకాల కథలు అల్లేస్తుంటారు.
ప్రశ్న: మీకు నచ్చిన హీరోయిన్?
జ: నాతో నటించిన అందరు హీరోయిన్లు నాకు నచ్చినవారే. అందరూ మంచి స్నేహితులే. ప్రత్యేకించి ఎవరూ లేరు.
ప్రశ్న: నటునిగా ఏ సందర్భంలోనైనా బోర్‌గా ఫీలయ్యారా..?
జ: అలాంటిది లేదు. రోజు రోజుకూ కొత్తగా ఉంటుంది. నటునికి ఓ అదృష్టం ఉంది. అదేంటో తెలుసా..? ఎన్ని సినిమాల్లో చేసినా ఇంకా కొత్తగా చేస్తున్నట్లే ఉంటుంది. వయస్సు కూడా తెలీదు. నటనను ప్రేమిస్తాను. నాకు వృత్తి.. ప్రవృత్తి రెండూ నటనే.
ప్రశ్న: గ్లామర్‌గా ఉండటానికి కారణం..?
జ: ఇందులో రహస్యాలేమీలేవు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఏ టెన్షన్ పెట్టుకోకూడదు. అదే నా గ్లామర్ రహస్యం.
ప్రశ్న: అంటే మీ చిత్రం ఫ్లాప్ అయితే మీకేమీ టెన్షన్ అనిపించదా..?
జ: కొంత బాధగానే ఉంటుంది. అసలు టెన్షన్ లేని జీవితం కూడా వేస్టే. కానీ ఏదో అతిగా ఊహించుకుని, అతిగా బాధపడటం తప్పే. అన్నీ దైవనిర్ణయాలే. మన చేతుల్లో ఏమీ ఉండదు. అది తెలిసి ప్రవర్తిస్తే సరిపోతుంది. కానీ అలా కొన్ని సందర్భాల్లో ఉండలేం కూడా.
ప్రశ్న: మీ క్యారెక్టర్ మీ క్రియేషన్ ఎంతవరకు ఉంటుంది..?
జ: ఓన్లీ కథా చర్చలోనే ఉంటుంది. సినిమా అంగీకరించాక దర్శకుడు చెప్పినట్లు చేయడమే. అంతేగాని ప్రతి సినిమాకు తరుణ్ ఇన్‌వాల్వ్ అవుతాడనేది అసత్యం, ఏ ఆర్టిస్టుకైనా ఎక్కడైనా చిన్నపాటి అనుమానం వస్తే రచయితకు, దర్శకుడికి సూచనలు ఇవ్వడం మామూలే.
ప్రశ్న: ఈ ఏడాదైనా ఎక్కువ సినిమాలు చేస్తారా..?
జ: ఇప్పటికి రెండు చిత్రాలు ఖరారయ్యాయి. సంక్రాంతికి తర్వాత ఫిబ్రవరిలో ఒక చిత్రం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి తర్వాత మరో చిత్రం ఉంది. ఇవి రెండు ఫుల్‌లెంగ్త్ కామెడీ చిత్రాలే. అందులో నా గెటప్స్ కూడా విభిన్నంగా ఉంటాయి.
