1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Interview

Sreenu Vitla | Interview | Namo Venkatesa | Venkatesh | Trisha, | కామెడీ దర్శకులుగా మిగిలిపోతారా...? శ్రీను వైట్లకు ప్రశ్న

శ్రీను వైట్ల
WD
విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "నమో వెంకటేశ" చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా వెబ్‌దునియా తెలుగు శ్రీనును పలుకరించింది. ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ...

"నమో వెంకటేశ" ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందని భావిస్తున్నారు?
వెంకటేష్ సినిమాలు స్టాడింగ్ హైలో ఉంటాయి. క్రమబద్ధంగా నిదానంగా ఆయన చిత్రాలు పుంజుకుంటాయి. ఆ తర్వాత హై రేంజ్‌కు వెళతాయి. కానీ ఈ చిత్రం మొదట్లోనే బాగా హైక్ వచ్చింది. అన్నిచోట్లా బాగానే ఆడుతోంది. తూర్పు గోదావరిలో నాలుగు రోజులకు 78 లక్షల షేర్ వచ్చింది. వారమయితే కోటి 8 లక్షలు వస్తుంది. వైజాగ్, సీడెడ్, నైజాం అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ టాక్

వెంకటేష్‌తో మీకెలా పరిచయం..?
నేను కాకినాడలో ఇంటర్ చదువుతుండగానే వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రతి ఒక్క సినిమాను చూసేవాడిని. చెన్నై వెళ్లి ఆయనతో సినిమా డిస్కషన్స్ చేసేవాడిని. ఆ తర్వాత 89లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇవివి సత్యనారాణయ దగ్గర అసిస్టెంట్‌గా అబ్బాయిగారు చిత్రానికి పనిచేశాను. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలనుకునేవాడిని. అది ఇప్పటికి కుదిరింది.

టైటిల్ పెట్టడానికి ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా...?
ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయ్యాక తిరుమల దర్శనానికి వెళ్లాను. అక్కడ లైన్‌లో ఉండగానే ఒక ఆలోచన వచ్చింది. "నమో వెంకటేశ" పేరు పెడితే ఎలా ఉంటుందనేది. దాంతో దాన్ని అందరికీ చెబితే సూపర్ అన్నారు.
WD


వినాయక్‌తో పోటీకి దిగారు...?
అనుకోకుండా సంక్రాంతికి అలా కుదిరింది. మేము ముందుగా డేట్ ఫిక్స్ చేశాము. వాళ్లు కొన్ని కారణాల వల్ల లేట్ అయి సంక్రాంతికి వచ్చారు.

సీనియర్ నటులను మీరు సరిగ్గా ఉపయోగించుకోలేదు.. కారణం?
నిజమే. కోట, తెలంగాణా శకుంతల, జీవా, పృధ్వీ వీరిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. నేను గతంలో చిన్న హీరోలతో చేశాను. అందుకే సపోర్టింగ్ పెద్దగా ఉపయోగించాను. ఇందులో వెంకటేష్‌ను హైలెట్ చేస్తూ వెళ్లాలి. అలాగే ఆయనతోపాటు బ్రహ్మానందం పాత్రకు చేయాలి. అందుకే కొంతమందిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం సాధ్యం కాలేదు.

మీ సినిమాల్లో కర్కోటకులుగా కనిపించే విలన్లు చివర్లో హఠాత్తుగా మారిపోతారు. కారణం?
ప్రతి మనిషిలోనూ రెండు కోణాలుంటాయి. "నమో వెంకటేశ"లోనూ విలన్లు వారి శత్రువుల్ని మాత్రమే చంపుతారు. ఆ తర్వాత వారిలోనూ ఓ మానవీయకోణం ఉంటుంది. దాన్ని హీరోలో చూసుకుని వెంటనే మారిపోతారు.

రొటీన్ కామెడీ ఉందనే విమర్శలున్నాయి...
ఉన్న కామెడీ సన్నివేశాల్నే భిన్నంగా చూపించే ప్రయత్నం చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదాహరణకు... తాగుబోతు సీన్ ఉంది. ఆ సీన్ చాలా సినిమాల్లోనూ ఉంది. వెంకీ చిత్రంలో మాస్టర్ భరత్‌కు రైల్వే ప్రయాణంలో తాగిన కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత సన్నివేశాలు, బ్రహ్మానందం, ఏవీఎస్ ఇలా... ఇదొక టైప్. అలాంటివి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకు పట్టాయి. వారు ఆ సన్నివేశాలను మళ్లీ చూపమన్నారు. దాంతో చేసేది లేక పాతవే అయినా కొత్తగా తీయాలని వెంకటేశ్వరస్వామి భక్తుడైన వెంకటేష్‌తో అతన్ని ఆటపట్టించే బ్రహ్మానందం జ్యూస్‌లో మందు కలిపి ఇవ్వడం. ఆ తర్వాత వెంకటేష్ రియాక్ట్ కావడం కొత్తగానూ, పిల్లలకు బాగా నవ్వు తెప్పించేదిగానూ ఉంది.

కామెడీ దర్శకుడిగా మిగిలిపోతారా...?
లేదు. నేను ఏ సినిమా చేసినా ఇంతవరకూ ఆ ముద్ర రాలేదు. ఎందుకంటే నా సబ్జెక్టులు సీరియస్‌గా ఉంటాయి. కాకపోతే ఎంటర్‌టైన్మెంట్ ప్రధానంగా ఉంటుంది. అందుకే ఇక చేయబోయే సినిమా కొత్తగా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

తదుపరి ప్రాజెక్ట్...?
మహేష్ బాబుతో ఉంటుంది. మార్చిలో ప్రారంభం కాబోతోంది. నమో వెంకటేశ నిర్మాతలే దాన్ని నిర్మిస్తున్నారు. ఇందాక చెప్పినట్లు కొత్త ముద్ర పడటానికి అవకాశమున్న స్క్రిప్ట్. మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. ఆయనకు నచ్చి ఓకే అన్నారు. కొత్త నిర్మాతల్ని ప్రోత్సహిస్తున్న మహేష్ బాబుకు చాలా థ్యాంక్స్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT