1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Birth day

Actor Rajasekhar | Birth day | 04-02-2010 | Tollywood | Politics | కలలు కనకండి... టీవీ షోలు జూదాల్లాంటివి: రాజశేఖర్

డాక్టర్ రాజశేఖర్
WD
డాక్టర్ నుంచి నటుడిగా మారిన డాక్టర్ రాజశేఖర్ చిత్రాలు ఈమధ్య తగ్గు ముఖం పట్టాయి. దానికి ఓ కారణముందంటున్నారు రాజశేఖర్. రాజకీయాల్లో ఉండటం, ఎన్నికలు రావడం వల్ల సినిమాలపై శ్రద్ధ పెట్టలేదని చెబుతున్నారు. తాజాగా ఆయన కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయన పుట్టినరోజు గురువారం( 4-2-2010)నాడు అన్నపూర్ణలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్య్వూ...

నటునిగా గ్యాప్ రావడానికి కారణం..?
"ఎవడైతే నాకేంటి" తర్వాత చాలా కథలు విన్నాను. అందులో రెండు చిత్రాలు సిద్ధం అయ్యాక షూటింగ్‌కు వెళదాం అనుకుంటుండగా మళ్లీ ఏవో లోపాలు కన్పించి ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కొన్ని గొడవలు సంఘటనలతో గ్యాప్ వచ్చింది.

పుట్టినరోజునాడు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా...?
ఉన్నాయి. ప్రతి ఏడాది చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా కొన్ని ఆర్గనైజేషన్లకు వెళ్లి అనాధలైనవారికి పండ్లు, ఫలహారాలు, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్‌‍లకు వైద్యునిగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు త్వరలో ఆఫీస్ రాగానే మొదలుపెడతాం.

వైద్య సేవ చేయాలని ఎందుకు అనిపించింది...?
నేను నటుడిగా మారినా, వైద్యునిగా నా వృత్తిని మర్చిపోలేదు. చాలామంది స్నేహితులు, బంధువులు కూడా ఏదో సమస్యపై వస్తుంటారు. వారికి తగు సేవ చేస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే మళ్లీ నేను డాక్టర్‌గా నేర్చుకోవాల్సి కొంత మిగిలిపోయింది. అందుకే ఎంబీబీఎస్ డాక్టర్ నేర్చుకోవాల్సిన వైద్య కోర్సు నేర్చుకుంటున్నాను.

హోమియోపతి, అల్లోపతి నేర్చుకుంటున్నా. దానికోసం ఇటీవలే అమెరికా సెమినార్‌కు వెళ్లాను. అక్కడ జీవితంపై పెద్ద ఉపన్యాసం విన్నాను. మనిషి పుట్టుక పరమార్థం ఏమిటి...? పుట్టడం, చనిపోవడమేనా జీవితం...? ఈ కాలంలో అతను ఏం చేస్తే పరిపూర్ణత వస్తుందనే విషయాలు తెలుసుకుని చాలా ఉత్తేజితుడినయ్యాను. అందుకే వైద్యునిగా మరింత సేవ చేయాలనుకుంటున్నా.

దీనికోసం ఫండ్ రైజింగ్ చేస్తున్నారా...?
ఇక్కడో విషయం చెప్పాలి. ఇటీవలే... సాయికుమార్ జెమినీలో ఢీ అంటే ఢీ అనే టీవీ కార్యక్రమం మొదలుపెట్టారు. దానిలో నన్ను పాల్గొనమని ఆహ్వానించారు. అందులో పాల్గొని దేవుడి దయవల్ల 10 లక్షలు గెలుచుకున్నా. టాక్స్ పోను 7 లక్షలు చేతికి ఇచ్చారు. ఆ డబ్బు చూడగానే... నేను ఎప్పటినుంచో అనుకుంటున్న సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నా. దాని ద్వారా సేవ చేస్తున్నాం. ఇంకా దాతలు ఇస్తే మరీ మంచిది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మీ అవగాహన ఏమిటి...?
రాజకీయ పరిస్థితులకంటే... నేడు ఎక్కడ చూసినా క్రైం పెరిగి పోయింది. గతంలో ఆడవారిపై యాసిడ్ దాడులు ఎక్కువయ్యాయి. నిన్నగాక మొన్న విజయవాడలో వైష్ణవి అనే పాపను అత్యంత దారుణంగా హత్య చేశారు. రోజూ పేపర్ చదువుతుంటే... నాకే బీపి ఎక్కువై బ్లడ్ ప్రెషర్‌తో ఏమైనా అయిపోతానేమోనని భయమేస్తుంది. అందుకే పేపర్ చూడాలంటేనే భయమేస్తుంది.

బేసిక్‌గా లోపం ఎక్కడుందని భావిస్తున్నారు...?
మనిషిలోనే ఉంది. ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తే... మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. వైష్ణవిని చంపినవారిని గురించి ఒక్కసారి ఆలోచిస్తే... మనిషేనా ఇలా చేసిందనిపిస్తుంది. ఆవేశంలో... కోపంలో... బీపీ ఎక్కువైతే ఎన్నో దారుణాలు జరుగుతాయి. అందుకే అందరూ నెగెటివ్‌గా ఆలోచించకుండా ఉంటే అదే సమాజానికి చేసే సేవ అవుతుంది.

వైఎస్ సినిమా లేనట్టేనా...?
ఈ విషయం చాలామంది అడుగుతున్నారు. మొదట చెప్పినట్లు వైఎస్‌పై సినిమా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం పూరీజగన్నాథ్ గోపీచంద్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక చేద్దామని చెప్పారు. తప్పకుండా ఉంటుంది.

మళ్లీ టీషోస్‌లో పాల్గొంటారా...?
లేదండీ... సాయికుమార్ స్నేహితుడు కనుక ఆహ్వానించారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నన్ను ఇప్పటికే వెయ్యిమంది దాకా అడిగారు... ఢీ అంటే ఢీ షోలో పాల్గొని 10 లక్షలు గెలుచుకున్నారు గదా. మమ్మల్ని కూడా పాల్గొనేలా చూడండి. మీరు మా అదృష్టం పరీక్షించుకుంటామన్నారు. అది నా చేతుల్లో లేదు. వారందరికీ చెప్పేది ఒక్కటే... ఇదొక జూదం. ఏదో లక్షలు వస్తాయని కలలు కనకండి. సిన్సియర్‌గా ట్రై చేస్తే ఆహ్వానం మీకు వస్తుంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT