Actress Samanta | Ye maya Chesave | Nagachaitanya | Kiss scenes | నాగచైతన్యతో ''కిస్''లా..? అవి సినిమా ముద్దులు: సమంత
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ చిత్రం "ఏ మాయ చేసావె". సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో నాగచైతన్య హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఘర్షణ ఫేమ్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతంతో యువ నిర్మాత సంజయ్ స్వరూప్ నిర్మించిన చిత్రమిది.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైన భామ సమంత. ఆ సినిమాలో ఆమె నటించిన జెస్సీ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్‌ని జెస్సీ క్యారెక్టర్ ద్వారా బాగా ఆకట్టుకుంది సమంత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో "బృందావనం" చిత్రంలో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావె" సక్సెస్ నేపధ్యంలో ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
మీరు తెలుగు వారంటున్నారే..?
మా నాన్న తరపువారంతా తెలుగువారే. కొన్ని తరాలకు ముందు తమిళనాడుకు తరలివచ్చారు. అమ్మ మలయాళీ. ఇంట్లో తమిళం, ఇంగ్లీషు మాట్లాడుకుంటాం.
కొన్ని పదాలను పట్టుకోగలుగుతాను. మాట్లాడటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఏ మాయ చేసావె సమయంలో డైలాగులను బట్టీపట్టి చెప్పేదాన్ని. పెద్ద కష్టమేమీ అనిపించలేదు.
సినిమాల్లోకి ఎలా వచ్చారు...?
నేను చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజీలో బికాం చదివాను. అప్పుడే నాయుడు హాల్ షాపింగ్ మాల్ వస్త్రాలకోసం మోడలింగ్ చేశాను. అలా మోడలింగ్ రంగంలో ఉండగా ఓ తమిళ సినిమా అవకాశం వచ్చింది. అక్కడి నుండి గౌతమ్ మీనన్ సినిమాకోసం పిలుపు వచ్చింది. ముందు భయపడ్డాను. కానీ రెండుమూడుసార్లు పిలిచాక వెళ్లాను. నన్ను సెలక్ట్ చేసుకుంటారని అసలు అనుకోలేదు. అదంతా గాడ్ గ్రేస్.
దేవుడిని నమ్ముతారా...?
బాగా నమ్ముతాను. కాకపోతే అదేపనిగా పూజలు, వ్రతాలు చేయను కానీ నమ్మకమైతే ఉంది.
సమంత- మీ పేరు వైవిధ్యంగా ఉందే... అర్థమేమిటి..?
ప్రార్థనలను వినేది అని అర్థం.
ఇంతకు ముందు తెలుగు సినిమాలు చూసేవారా...?
లేదు. బొమ్మరిల్లు చాలా బాగుందంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం. భాష అర్థం కాకపోయినా ఏదో తెలియని భావోద్వేగం కట్టిపడేసింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష బాగా నటించిందని ఎవరో అంటే డీవీడి చూశాను. నాకు త్రిష అంటే చాలా ఇష్టం. ఆమె కూడా నా సినిమాలో నటించడం చాలా ఆనందంగా అనిపించింది.
లేదు. నేను బయట చీరలు, చుడీదార్లలో కనిపించడం చాలా అరుదు. మోడ్రన్ డ్రెస్సులే ఇష్టం. జెస్సీ పాత్రకు చీరలు, చుడీదార్లు నప్పుతాయంటే వేసుకున్నా. మీరు బాగా గమనిస్తే ఆ సినిమాలో నాకు మేకప్ కూడా ఉండదు. సహజంగా ఉండాలని గౌతమ్ వద్దన్నారు.
గౌతమ్ మీనన్‌ను చూసి భయపడ్డానన్నారు. ఆ భయం ఎప్పుడు పోయింది...?
గౌతమ్ సర్ సినిమాలంటే నాకు పిచ్చి. ఆయన అన్ని చిత్రాల్లోనూ హీరోయిన్ పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాకు నటన, ముఖ కవళికల విషయంలో గౌతమ్ చేసి చూపించిన దాన్ని నేను అలాగే కాపీ కొట్టానంతే. నువ్వు చెయ్యగలవు అంటూ గౌతమ్ ఇచ్చే ప్రోత్సాహం మర్చిపోలేనిది.
మీ హీరో నాగచైతన్యని ముద్దులతో మురిపించినట్లున్నారు...?
నాగార్జున సార్ కొడుకునన్న బందా చైతన్యలో అసలు లేదు. ఒకే వయసు వాళ్లం కాబట్టి చాలా సరదాగా ఉండేవాళ్లం. తనతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఎనర్జిటిక్ కో స్టార్. ఇక ముద్దు సీన్లు మా ఇద్దరికీ సంబంధించినవి కావు. గౌతమ్ మీనన్ చెప్పినట్లు చేశామంతే.
బృందావనం గురించి చెప్పండి
నిజంగా నేను అదృష్టవంతురాలిని. కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కో అవకాశం వెతుక్కుంటూ వస్తోంది. ఏ మాయ చేసావె షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, దిల్ రాజుగారి కాంబినేషన్లో వస్తోన్న బృందావనం కోసం అడిగారు. పాత్ర పేరు ఇందు. చాలా బాగా ఉంటుంది. మోడ్రన్‌గా కనిపిస్తాను.
సినిమాలకోసం ఏదైనా శిక్షణ తీసుకున్నారా...?
నటనలో శిక్షణ ఏమీ లేదు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ వింటూ ఉంటాను. నా తొలి చిత్రానికి ఆయన పనిచేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. డాన్స్ బాగా చేస్తానని మా కాలేజీలో అందరూ అనేవారు. తారక్‌తో స్టెప్పులేస్తే గానీ నాకొచ్చిన డాన్స్ ఏమిటో తెలియదు( కన్ను గీటుతూ)
ఏ మాయ చేసావె సినిమాకోసం బాగా కష్టపడి చేసిన సన్నివేశం ఏమిటి...?
కార్తీక్ నాకోసం గోవా నుంచి వస్తాడు. అప్పుడు నేను పైనుంచి కిందికి దిగుతాను. పెద్ద సీన్ ఉంటుంది. ఎక్కడా కట్ చెప్పకుండా ఏకబిగిన చెప్పాలన్నారు. ప్రామ్టింగ్ కూడా లేకుండా చేశాను. బాగా ఏకాగ్రతతో చేసిన సన్నివేశం అది. అమెరికా సెంట్రల్ పార్కులో వచ్చే సీన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం.
సినిమా చూసి ఇంట్లోవాళ్లు ఏమన్నారు...?
వాళ్లింకా సినిమా చూడలేదు. మా వాళ్లు సినిమాలు చూడటం చాలా తక్కువ. నేను ఈ రంగంలోకి వస్తానంటే ముందు ఒప్పుకోలేదు. తర్వాత నిదానంగా నచ్చజెప్పాను.
నటీమణుల్లో త్రిష అంటే ఇష్టమన్నారు. మరి హీరోల్లో...?
సూర్య. ఆయన సినిమాలను నా స్కూల్ డేస్ నుంచి చూస్తున్నా. హీ ఈజ్ హ్యాండ్‌సమ్
సినిమాను ఎంపిక చేసుకునేటప్పుడు మీ ప్రాధామ్యాలేమిటి...?
నా పాత్ర. కథ వింటున్నప్పుడే నా పాత్ర కళ్ల ముందు మెదులుతుంది. దాన్నిబట్టి నిర్ణయిస్తాను.
మీ కలల ప్రాజెక్ట్..?
ఏ మాయ చేసావెలో జెస్సీలాంటి గొప్ప క్యారెక్టర్ అవకాశం ఎవరికీ మొదటి సినిమాకే రాదు. నేను అదృష్టవంతురాలిని. ఆ పాత్ర చేశాక ఇంకా ఏదో పాత్రకోసం ఎదురుచూస్తున్నాను అనుకోవడం అత్యాశే అవుతుంది.
మీలో కమిలినీ ముఖర్జీ పోలికలున్నాయని అంటున్నారు...
నాతో కూడా చాలామంది అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడు ఆటపట్టిస్తున్నారనుకునేదాన్ని. ఇప్పుడు నన్ను నేను పరీక్షగా చూసుకుంటున్నాను. అది నిజమేనేమో అనిపిస్తుంది.
తెలుగు, తమిళ చిత్రాల్లో దేనికి ప్రాధాన్యం ఇస్తారు....?
తమిళం బాగా మాట్లాడాతాను. కాబట్టి ఇక్కడే భవిష్యత్ ఉంటుంది అనుకుంటున్నాను. మేకప్ మొట్టమొదటిసారి కోలీవుడ్‌లో వేసుకున్నా. నా తొలిచిత్రం విడుదలైంది మాత్రం టాలీవుడ్లోనే. అందుకే దృష్టంతా తెలుగుమీదే పెడుతున్నా అని చెప్పింది సమంతా.
