Actress Anushka | Interview | Panchakshari | Chiranjeevi | చిరంజీవిగారు నన్ను గుర్తు పట్టలేదు: అనుష్క
WD
పంచాక్షరి ఎలా ఉంది...?
నేను ప్రతి సినిమాను మెయిన్ థియేటర్లో మొదటి రోజే చూస్తాను. కానీ ఈ సినిమాను షూటింగ్ బిజీతో మూడు రోజుల తర్వాత చూశాను. బి, సి సెంటర్లలో టాక్ బాగానే ఉంది.
పంచాక్షరిలో రెండు పాత్రలు పోషించారు. వాటిలో మీకు నచ్చిన పాత్ర ఏది..?
పల్లెటూరి పిల్ల పాత్ర నాకు బాగా నచ్చింది. రెండు జడలు వేసుకుని లంగా - ఓణిలో నటించడం చాలా నచ్చింది. ఈ పాత్రలో ఎలా నటించాలన్నదానిపై దర్శకుడు నాకు చాలా సూచనలు చేశారు.
అదిసరే అమ్మోరు తరహా పాత్రలో నటించారు కదా... దీనికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా...?
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. నాకంటే దర్శకులే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో నాన్ వెజ్ వాసన కూడా చూడలేదు. కఠోర నియమాలను పాటించామనే చెప్పాలి.
దేవి పాత్రలో నటించేటపుడు నాపై కుంకుమ, పసుపు చల్లడం వంటివి వారం రోజులపాటు జరిగింది. ఈ సన్నివేశ చిత్రీకరణలో నా శరీరంపై తరచూ పసుపు, కుంకుమ పడటంతో నా శరీర రంగు కూడా మారిపోయింది. ఏదేమైనా నాకు అటువంటి సన్నివేశంలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం.
దేవుడ్ని మీరు నమ్ముతారా..?
శివుడు, అమ్మవార్లను నేను నమ్ముతాను. నమ్మడమే కాదు ఆ దేవుడిని, దేవతను నిజంగా చూడాలనిపిస్తుంటుంది.
చూడాలని ఉంటుంది
పంచాక్షరి షూటింగ్ సమయంలో మీకు ఎదురైన అనుభవాలు - విశేషాలు..?
అమ్మవారు సన్నివేశం చేస్తున్నప్పుడు ఓ అమ్మాయికి పూనకం వచ్చింది. పూనకం తగ్గడానికి వడిబియ్యం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి "అమ్మవారికి కట్టింది ఈ రోజు చీర కాదు నిన్నటిది. చీరను మార్చండి" అని చెప్పింది. నిజానికి ఆ అమ్మాయికి నేను కట్టుకున్న చీర నిన్నటిదని ఎలా తెలిందన్నది నాకు అంతుపట్టలేదు. అదే దేవీ మహత్యం అనిపించింది.
తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. కారణం..?
తమిళంలో రెండు సినిమాలను అంగీకరించాను. అయినా ఏదో రకంగా చేస్తూనే ఉన్నాను కదా
అరుంథతి - పంచాక్షరి.. వీటిలో ఏది మంచి చిత్రమని అనుకుంటున్నారు...?
రెండు సినిమాలు రెండు వేర్వేరు కథలను ఇతివృత్తంగా తీసుకుని చిత్రీకరించబడ్డాయి. వీటి మధ్య పోలిక కుదరదు.
విజయశాంతిలా యాక్షన్ చిత్రాలు చేస్తారా...?
నాకు చేత కాదు
సూపర్ టు పంచాక్షరి కెరీర్ ఎలా ఉంది...?
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఒక దశలో చిత్ర పరిశ్రమను వదలి వెళ్లిపోదామనుకున్నా. అయితే ఆ సమయంలో విక్రమార్కుడు చిత్రం అవకాశం వచ్చింది. ఆ చిత్రం సక్సెస్‌తో నాలో ధైర్యం వచ్చింది. ఇక ఇప్పుడు కొంచెం స్థిరపడ్డాననుకుంటున్నాను.
తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా...?
నా నాలుక మందం. కొన్ని మాటలను స్పష్టంగా పలుకలేను. అందుకే డబ్బంగ్ జోలికి పోలేదు.
పంచాక్షరి చిత్రం మీకు ఎలాంటి గుర్తింపునిచ్చింది...?
ఇటీవల మెగాస్టార్ ఓ పంచాక్షరి పోస్టర్ పై ఉన్న నన్ను చూసి ఎవరా అమ్మాయి అని అడిగారట. దాంతో ఓ కార్యక్రమంలో మేం ఇద్దరం పాల్గొన్న సందర్భంలో ఆయన ఇదిగో ఈ అమ్మాయే పంచాక్షరిలో నటించిందని పరిచయం చేశారు. అప్పుడు చిరంజీవిగారు నన్ను చూసి... నువ్వేనా ఆ సినిమాలో నటించిందీ... అని ప్రశ్నించారు. పంచాక్షరిలో నన్ను చాలామంది గుర్తుపట్టలేక పోయారు.
మీ రాబోయే చిత్రాలు...?
నేను 2012 వరకూ ఫుల్ బిజీ. నాగార్జున, వెంకటేష్, రవితేజలతో సినిమాలు చేస్తున్నా. 2012 డిసెంబరులో పంచాక్షరి నిర్మాతతోనే మరో సినిమా చేస్తాను. అయితే అది ఎటువంటి సినిమా అని మాత్రం మీరడక్కూడదు అని ముగించింది అనుష్క.
