SS Rajamouli | Maryada ramanna | Rayalaseema | Sunil | Saloni | ఇప్పుడు భయం లేదు.. అందుకే కథ చెపుతున్నా: రాజమౌళి
WD
ఈ రెండింటి మధ్య హాస్యాన్ని ప్రధానంగా తీసుకుని కథ తయారు చేశాం. 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఉండే విలన్ తమ్ముడిని హీరో తండ్రి చంపేస్తాడు. కాలక్రమంలో హీరో వీటన్నింటికీ దూరంగా సిటీలో ఉంటాడు. తండ్రి కూడా చనిపోతాడు. తన బతుకు బతకాలంటే ఊరిలో ఉన్న పొలాన్ని అమ్మాలి. అందుకు హీరో వస్తాడు. విలన్ ఇంటికే అతిథిగా వస్తాడు హీరో.
విలన్‌కు తన ప్రత్యర్థి కొడుకు అని తెలీదు. తర్వాత విషయం ఇద్దరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి..? అతిథిగా వచ్చాడు కాబట్టి చంపకూడదు. విలన్ ఆచారం ప్రకారం గుమ్మం దాటితే శత్రువు, లోపల ఉంటే అతిథి. ఆ దశలో హీరో సునీల్ ఏం చేశాడు..? అన్నది సినిమా. అంటూ దర్శకుడు రాజమౌళి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ...
ఎప్పుడూ కథలు చెప్పని మీరు ఎందుకు చెపుతున్నారు...?
సినిమా ఫీల్డులో కొత్తగా రావడం, అమాయకత్వంతో ఉండటం వల్ల కథలు చెప్పాలంటే భయపడేవాడ్ని. ఇది సరదాగా తీసిన సినిమా. గతంలో ఉన్న భయం, ఆందోళనలు లేవు. అందుకే చెప్పేశాను.
"మగధీర" భారీ చిత్రం. అంత హిట్ వచ్చిన మీరు ఇటువంటి సినిమా తీయడానికి కారణం..?
మగధీర చిత్రం బడ్జెట్ ఎక్కువే. ఒక మాదిరి ఆడుతుందని అనుకున్నా. కానీ అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత లోబడ్జెట్ సినిమా తీయాలని చేశాను.
మగధీర తర్వాత అంచనాలు ఎక్కువని ఇలాంటి కథలు చెపుతున్నారా..?
కరెక్ట్ ప్రశ్న వేశారు. అదే నా అభిప్రాయం కూడా. ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయి. వారిని మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికి ఇలా చేశాను.
మీ నాన్నగారి పాత్రెంత మేరకు...?
నాన్నగారు విజయేంద్రప్రసాద్‌గారు ఓ టెక్నీషియన్. ఆయన సహాయం సినిమా వెనుక చాలా ఉంటుంది.
ఈ కథ ఎలా తయారైంది...?
రాయలసీమాలో ప్రసాద్ ల్యాబ్స్ రమేష్ ప్రసాద్ సోదరుడు నాగినీడు ఉంటున్నారు. ఆయన ఓ సందర్భంలో నా సోదరుడు ఎస్.ఎస్.కాంచీకి రాయలసీమ అంటే చాలు... అంతా ఫ్యాక్షన్ చిత్రాలు తీస్తారు. అసలు వారు చాలా మర్యాదస్తులు అని చెప్పారు. వెంటనే నా సోదరుడు అక్కడ పరిస్థితి వివరించారు. అలా కథ పుట్టింది.
ఈ సినిమాకోసమే సునీల్‌ను 6 ప్యాక్ చేశారా...?
హీరోగా ఉండాలంటే కాస్త లావు తగ్గాలి అని చెప్పాను. ఆయన ఇంకాస్త ఎక్కువ చేసి 6ప్యాక్ సైజులోకి వెళ్లాడు.
ఈ సినిమాకోసం అంతా తగ్గినట్లున్నారు...?
అవును తగ్గడం పెరగడం కోసమే. పెరగడం తగ్గడం కోసమే. మగధీర రేంజ్ నుంచి కాస్త తగ్గాలని మేమే అంతా అనుకుని అన్ని విధాలా తగ్గి ఈ చిత్రాన్ని రూపొందించాం.
దర్శకునిగా ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు..?
మనిషి ఎత్తుకు ఎదిగినా ఎలా తగ్గాలి. కెమేరాలో క్లోజ్ షాట్‌లు ఇంకాస్త ఎఫెక్ట్‌గా ఎలా తీయాలనేవి నేర్చుకున్నాను.
ఆడియో ఎప్పుడు...?
వచ్చే నెల మొదటి వారంలో విడుదలవుతుంది. వేల్స్ రికార్డ్ ద్వారా.. సినిమా జులై 25న విడుదలవుతుంది.
హీరోయిన్ ఎంపిక ఎలా జరిగింది...?
మగధీరలో షేర్ ఖాన్ పాత్ర సెకండ్ పాత్రలో సలోని డాన్స్ చేసింది. ఆమెపై కొన్ని సన్నివేశాలున్నాయి. కానీ ఎడిటింగ్‌లో పోయాయి. అప్పుడే ఆమె నటన నచ్చింది. హావభావాలు బాగా పలికించింది. మర్యాద రామన్న కథకు ఈమే కరెక్ట్ అని భావించాం. అని ముగించారు రాజమౌళి.
