1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. MM Keeravani

Music director | MM Keeravani | July 4 | బ్లూ ఫిలిమ్స్‌క్కూడా అవే ట్యూన్లు: కీరవాణి

సంగీతం
WD
శ్రావ్యమైన సంగీతానికి మారుపేరు ఎం.ఎం.కీరవాణి. రాగాల్లో కీరవాణి రాగం ప్రశస్తమైనది. ఆ పేరును పెట్టుకుని సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న కీరవాణి సంగీతంలో ఉన్నవి కొన్ని ట్యూన్లే అనీ, అవి రిపీట్ అవుతుంటాయనీ, సినిమా సినిమాకూ కొత్తగా ట్యూన్లు అనేవీ ఉండవని తేల్చి చెప్పారు. కీరవాణి పుట్టిన రోజు జూలై 4. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వరాలు సమకూర్చిన "మర్యాద రామన్న" చిత్రం ఆడియో శిల్పాకళా వేదికలో విడుదల కానుంది. పుట్టినరోజు సందర్భంగా ఇంటర్య్వూ ప్రత్యేకంగా మీకోసం...

ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయింది...?
ఎందుకు... డైరెక్టుగా చెపుతాను. నాకు 49 ఏళ్లు. ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లయింది.

ఇన్నాళ్లలో మీరు చేసిన ప్రయోగాలు ఏమిటి..?
ట్యూన్స్ అనేవి కొత్తగా పుట్టవు. ఉన్న రాగాలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాం.

మగధీర వంటి సినిమాకు చేశాక.. మర్యాదరామన్న వంటి చిన్న సినిమాకు చేయడానికి కారణం..?
సినిమా అనేది పెద్దదా చిన్నదా అనేది మనం నిర్ణయించలేం. బాక్స్ బయటకు వచ్చి థియేటర్ వరకూ వస్తే అది పెద్ద సినిమానే. కోట్లు వెచ్చించి తీసినా కొన్ని ల్యాబ్‌ల్లోనూ ఉంటున్నాయి. మగధీర హిట్ అయింది కాబట్టి సెన్సేషనల్ అంటున్నారు. నాకు చిన్నా పెద్దా తేడాలేదు. ఎటువంటి సినిమా అయినా చేయాల్సిందే.

అన్నమయ్య వంటి చిత్రాలకు మర్యాదరామన్న చిత్రానికి తేడా ఏమిటి...?
సంగీతంలో ప్రతిదీ ట్యూనే. రామరామ కృష్ణకృష్ణకు ట్యూన్స్ ఇచ్చినా.. బ్లూఫిలిమ్‌కు ట్యూన్స్ చేయాల్సి వచ్చినా అదే ట్యూన్స్ ఉంటాయి. వేరే మారవు. సందర్భానుసారంగా, సన్నివేశపరంగా సౌండ్‌లు మారుతుంటాయి. అంతే తేడా.

బలవంతంగా ట్యూన్స్ ఇచ్చిన సందర్భాలున్నాయా..?
ఉన్నాయి. ఒకసారి కె.ఎస్.రామారావు నిర్మించిన బాయ్‌ఫ్రెండ్స్‌కు ట్యూన్స్ ఇవ్వమన్నారు. దానికి ముందుగా రాజ్ కోటిని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నాకు ఆ కథ నచ్చలేదు. సన్నివేశాలు కూడా బాగోలేవు. అటువంటి చిత్రానికి నన్ను అడిగారు. నేను చేయనని చెప్పాను. అయినా బలవంతం చేశారు. చేసేది లేక రెండు ట్యూన్స్ ఇచ్చి చేతులెత్తేశాను. ఆ తర్వాత మలయాళ దర్శకుడితో మిగిలినవి పూర్తి చేశారు.

ఇన్నాళ్ల అనుభవంలో మీరు గ్రహించింది ఏమిటి...?
కీరవాణి అనేవాడికి ఎంత తెలుసు అనేదానికంటే... ముందు సినిమా హిట్టా... ఫట్టా... అనేది కొలమానం. అది లేకపోతే మొహం కూడా చూడరు.

మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా దుస్తుల్లోనూ ఎక్కువగా కనబడతారు. ఇటీవలే మోడ్రన్‌గా ఉంటున్నారు. కారణం..?
ప్రతివారు మోడ్రన్‌గా ఉండాలనే చూస్తారు. ఆధ్యాత్మికం అనేది మనసుకు సంబంధించింది. మోడ్రన్ అనేది దుస్తులకు సంబంధించింది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే జీవితం.

ఆడియో రంగం బాగోలేదని చాలా కంపెనీలు అంటున్నాయి. మీరు వేల్స్ రికార్డింగ్ పెట్టి ఎంతవరకు సక్సెస్ అయ్యారు...?
వేల్స్ రికార్డ్ కంపెనీ పెట్టాక రెండే సినిమాలు హిట్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ లాస్‌నే చూపాయి. అయినా ఆడియోరంగం గురించి చెప్పాలంటే.. అదొక పెద్ద కథ. ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం

రీమిక్స్ సంగీతంపై మీ అభిప్రాయం...?
రీమిక్స్ అనేది మంచిదే. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించకూడదు. అంతకుముందు చేసిన సంగీత దర్శకుడిని అవమానించేటట్లుగా ఉండకూడదు. ఒకవేళ రీమిక్స్ చేస్తే... ముందు చేసిన దర్శకుడి పేరు వేయాలి. లేదా పర్మిషన్ తీసుకోవాలి. ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి నేడు మృగ్యమైపోతున్నాయి.

మీతరంలో సీనియర్ దగ్గర నేర్చుకునేవారు. ఇప్పటితరం డైరెక్ట్‌గా వచ్చేస్తున్నారు. దీనివల్ల నష్టం లేదా...?
అనుభవం అనేది చాలా ముఖ్యం. అనుభవాన్ని బట్టే సారం వస్తుంది. అదే కలకాలం నిలుస్తుంది. అనుభవం లేకుండా వచ్చేవారు 1,2 సినిమాల వరకే పరిమితం అవుతారు. కొంతమంది యూత్ స్వతహాగా సంగీత జ్ఞానం ఉన్నవారు కూడా ఉన్నారు. అటువంటివారు చేయడంలో తప్పులేదు. విద్య అనేది గురువు దగ్గరే నేర్చుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

రాజమౌళికి ఒక రకమైన సంగీతం.. మిగతా వారికి మరోలా ఇస్తారా...?
అదేం లేదు. మనవాడైనా పరాయివాడైనా సంగీతం విషయంలో తేడాలుండవు. ఒకటికి రెండుసార్లు పరీక్షించి ట్యూన్స్ ఇస్తుంటాం.

సాహిత్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?
ముఖ్యంగా సంగీత దర్శకుడికి సాహిత్యం గురించి తెలిస్తే బెటర్‌గా చేయగలడు. తెలియకపోతే తెలుసుకుని చేయాలి. ఎస్ఎ రాజ్ కుమార్ ఉన్నారు. ఆయనకు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ద్వారా అర్థాలు తెలుసుకుని పనిలోకి దిగుతాడు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి