Actress Pranita interview | Pokiri | Em pillo Em Pillado | ఇండస్ట్రీని ఏలేద్దామని ఇక్కడకు రాలేదు: ప్రణీత
కన్నడ "పోకిరి" చిత్రంలో నటించిన ప్రణీతను తెలుగులో పోకూరి బాబూరావు తాను నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రానికి తీసుకవచ్చారు. కన్నడలో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తెలుగులో సిద్దార్థ్ సరసన "బావ" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమెతో వెబ్‌దునియా తెలుగు కాసేపు ముచ్చటించింది. ఆ వివరాలు మీకోసం...
మీ నేపధ్యం..?
ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ మోడలింగ్, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమా రంగం మాకు కొత్త. అమ్మా నాన్నా ఇద్దరూ డాక్టర్లే. కాలేజీ చదివే రోజుల్లో ఫంక్షన్లలో మోడలింగ్ చేసేదాన్ని. దానిని అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత బయట చిన్నచిన్న వ్యాపార ప్రకటనల్లో పాల్గొన్నాను. అయితే సినిమా అవకాశం వస్తే మాత్రం అంగీకరించలేదు. కానీ అమ్మానాన్నను ఒప్పించి చేశాను. కర్నాటకలో ఉండటంతో తెలుగు అర్థమవుతుంది. కానీ మాట్లాడలేను.
తెలుగులో అవకాశం ఎలా వచ్చింది...?
పోకూరి బాబూరావు ఓ సినిమా చేస్తున్నారనీ, అందులో తనీష్ పక్కన చేయాలని హీరోయిన్లకోసం సెర్చ్ చేస్తున్నారు. అప్పటికే నా స్టిల్స్‌ను వేణు అనే ఏజెంట్ చూపారు. అలా ఆయన నన్ను సంప్రదించి ఫోటో సెషన్ చేశారు. ఇక్కడ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. నటనలో కొన్ని మెళకువుల కూడా నేర్పారు.
మొదట్లో భాష కష్టంగా ఉండేది. నటనతోపాటు భాషను ఎలా మాట్లాడాలో కూడా నేర్పారు బాబూరావుగారు. ఆ తర్వాత దర్శకుడు రవికుమార్ చౌదరిగారు ఆయన అసిస్టెంట్ కొన్ని డైలాగులు రాసి దీని అర్థం ఇది అనీ, అలా పలకాలని చెప్పారు. అయితే షూటింగ్ పూర్తయ్యేసరికి కొంత తెలుగు చదవడం నేర్చేసుకున్నా. త్వరలో మాట్లాడేస్తా.
మీ బావ విషయాలేమిటి...?
ఈ చిత్రంలో తెలుగింటి ఆడపడచులా లంగా ఓణీల్లో కన్పిస్తాను. సినిమా మొత్తం గ్రామీణ ప్రాంతంలో జరిగింది. చక్కటి వాతావరణంలో సరదాగా సాగుతుంది. సిద్దార్థ్ మంచి నటుడు. ఇష్టమైన నాయకుల్లో ఒకరు. ఆయన మరదలుగా నటిస్తున్నాను. ఆటపట్టిస్తున్నాను.
మరి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కాస్త గ్లామర్ పాత్రలు చేయాలి కదా...?
అందంతోపాటు అభినయంతో కూడిన పాత్రలు చేస్తే కొంతకాలం నిలుస్తాం. ఏదో ఇండస్ట్రీని ఏలేద్దామని రాలేదు. నా పరిధి మేరకు వచ్చిన అవకాశాలకు న్యాయం చేస్తాను. నటిగా మొదటి స్టెప్ వేసినప్పుడే ఇది గమనంలో పెట్టుకున్నాను.
గ్లామర్ కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు...?
నీరు ఎక్కువగా తాగుతాను. ఆయిల్ కంటెంట్ ఫుడ్ పెద్దగా తీసుకోను. స్విమ్మింగ్ చేస్తాను.
నటిగా డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా...?
మగధీరలో కాజల్ అగర్వాల్ చేసిన యువరాణిలాంటి పాత్ర చేయాలనుంది. రియల్ లైఫ్‌లో ఎలాగో ఉండలేం. సినిమాల్లోనైనా కాసేపు ఉండవచ్చు కదా...( నవ్వుతూ..)
ప్రేమిస్తేనే తెలుస్తుంది. ఇంకా ఆ రుచి చూడలేదు. సినిమాల్లో మాత్రం యాక్షన్ అని ముందే తెలుస్తుంది అందుకే పెద్దగా ఫీలింగ్ తెలీదు.
అంటే ఎలాంటి వాడిని భర్తగా ఎంచుకుంటారు...?
నిజాయితీ, ఆత్మవిశ్వాసంగలవారుగా ఉండాలి.
ఏం పిల్లో ఏం పిల్లడో.. సక్సెస్ అయిందని భావిస్తున్నారా..?
ఆ విషయాలేమీ నాకు తెలియవు. ఈతరం బ్యానర్ సినిమా అంటే కొన్ని విలువల బ్యానర్. నేను విడుదలరోజు థియేటర్లో చూశాను. యువప్రేమికులకు బాగా నచ్చింది. నటిగా నాకు గుర్తింపు వచ్చింది.
