Srihari | Magadheera | Sharekhan | Birthday | Bhairava | ''మగధీర''లోని ఆ పాత్ర జీవితంలో మరచిపోలేనిది: శ్రీహరి
WD
ప్రశ్న: పోలీసు పాత్రలు చాలా చేశారు? ఇందులో స్పెషల్ ఏముంది?
జ: నా కెరీర్‌లో 'పోలీస్' చిత్రంతోనే ప్రారంభమైంది. అంతకుముందు విలన్‌గా ప్రముఖ హీరోల సరసన నటించినా, కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ పోలీస్ పాత్రే. అందుకే 'పోలీస్' హిట్ అయ్యాక అటువంటి కథలతో చాలా సినిమాల్లో నటించాను. అయితే వేటికవి ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇటువంటి పాత్రలు ప్రముఖ హీరోలు చాలామంది వేశారు. నాకు ప్రత్యేక శైలి ఆపాదించారు. ఈసారి 'భైరవ'లో సీఐగా నటిస్తున్నాను. ఇక్కడో విషయం చెప్పాలి. నేను జిమ్నాస్టిక్ నేషనల్ ఛాంపియన్‌ను. సీఐ పాత్రకోసం స్పోర్ట్‌కోటాలో ఉద్యోగం అడిగితే ఇవ్వనన్నారు. విచిత్రమేమిటంటే? అంతకంటే పైస్థాయి పాత్ర పోషిస్తుండటమే.
ప్రశ్న: 'భైరవ'లో డీల్‌చేసే పాయింట్?
జ: పోలీసులకు తెలియకుండానే నేరస్థులు ఏమీ చేయరు. అందుకే పోలీసులు కూడా నేరస్తుల్లాగా వారీ డ్యూటీ వారేచేస్తే ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరమైన పాయింట్. నా ఏరియాలో ఉన్న పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ఏదైనా దొంగతనాలు, అన్యాయం జరిగితే అది నా ఆధ్వర్యంలో పరిష్కారం చూపుతాను. చూపే విధానం వెరైటీగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అనాధల్ని డీల్‌చేశాను. అదే చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.
ప్రశ్న: మీ కెరేర్ విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తుంది?
జ: 'నువ్వు వస్తానంటే నే నొద్దంటానా' తర్వాత నా కెరీర్ మరో మలుపు తిరిగింది. ప్రధాన క్యారెక్టర్లు వస్తున్నాయి. అలాంటిదే 'మగధీర'లోనిది. అందులో షేర్‌ఖాన్ పాత్ర జీవితంలో మర్చిపోలేనిది. పదేళ్లు వెనక్కి తిరిగిచూసుకోకుండా చేసింది. ఈ పాత్రకు ఎంతో పేరుతెచ్చిన షేర్‌ఖాన్ పాత్ర చేసే అవకాశం మరోసారి రాదని అనిపించింది.
ప్రశ్న: పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు?
జ: గతంలో మెదక్ సమీపంలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని మినరల్ వాటర్‌ను ఏర్పాటు చేశాను. అలాగే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఏదో సమస్యలు చెబుతుంటారు. చేతనైతే సాయం చేస్తుంటాను. ఈసారి అనాధలైన సైనికుల పిల్లల్ని చేరదీయాలని కంకణం కట్టుకున్నాను. మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకుంటాను. ఈ సలహా నా సతీమణి శాంతి ఇచ్చింది.
ప్రశ్న: ఇకపై మీరు చేయబోయే చిత్రాల గురించి..?
జ: ఎన్టీఆర్ "బృందావనం"లో మంచి పాత్ర చేస్తున్నాను. అలాగే అల్లరి నరేష్‌తో ఓ చిత్రముంది. ఆర్.పి. పట్నాయక్‌తో 'బ్రోకర్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాను. బ్రోకర్ కథ బాగుంది. మంచి సందేశం అందించే అవకాశం ఉన్న పాత్ర. దాసన్న చిత్రం తర్వాత నట్టికుమార్‌తో "భైరవ" చేస్తున్నాను. ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ, ప్లానింగ్ బాగా నచ్చాయి. వచ్చే ఏడాది స్వంత సినిమా నిర్మాణం ఉంటుంది.
