1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Village Lo vinayakudu

Saranya Mohan | Village Lo vinayakudu | Happy Happy Ga | Vennila Kabaddi Jattu | తెలుగులో ఓవర్ యాక్షన్ ఎక్కువ: శరణ్యామోహన్

శరణ్యామోహన్
File
FILE
కేరళకు చెందిన శరణ్యామోహన్ ఇటు తెలుగురంగంలోను పలు చిత్రాల్లో నటిస్తోంది. శరణ్యామోహన్ నటించిన తొలి తెలుగు చిత్రం "భీమిలి కబడ్డీ జట్టు" విడుదలై సక్సెస్‌గా సాగుతోంది. వరుణ్‌సందేశ్‌తో తాజాగా "హ్యాపీహ్యాపీగా" నటిచింది. ఈ నెల 20న (శుక్రవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా శరణ్యామోహన్ వెబ్‌దునియాతో వెల్లడించిన పలు విషయాలు మీ కోసం..

ప్రశ్న: అతి చిన్న వయస్సులో నటనారంగంలోకి ఎలా వచ్చారు.?
జ: నేను నటిగా మారతానని అనుకోలేదు. మా తండ్రిగారి కాలేజీ స్నేహితుడు దర్శకుడు ఫాజిల్. ఆయన నన్ను చిన్నతనంలోనే చూసి ముద్దుగా ఉందని చెప్పి "అనియత్తి ప్రావ్" చిత్రంలో వేషం వేయించారు. అలా ఐదు చిత్రాల్లో నటించాను. అమ్మానాన్న అలెప్పీలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అమ్మ మంచి డాన్సర్. నేను కూడా ఆ రంగంలోనే ఉండాలనుకున్నాను.

ప్రశ్న: తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నారా?
జ: అవును. మొదట్లో అస్సలు వచ్చేదికాదు. ఆ మధ్య సాయికిరణ్ అడవి దర్శకత్వంలో "విలేజ్‌లో వినాయకుడు" చిత్రంలో నటించాను. అందులో డైలాగ్స్ ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ ఎలా చెప్పాలో? దాని అర్థమేమిటో ఆయన సవివరంగా వివరించారు. దాన్ని బట్టి పలు మాటలు తెలుసుకోగలిగాను. పూర్తిగా తెలుగు రాదు కానీ.. మాట్లాడేదీ అర్థమవుతుంది. కొంచెంకొంచెం మాట్లాడగలను. పూర్తిగా త్వరలో మాట్లాడేస్తా.

ప్రశ్న: భారీకాయుడు హీరోగా అంటే మీకెలా అనిపించింది?
జ: ముందుగానే సబ్జెక్ట్ ఇలా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో విలేజ్‌లో వినాయకుడు సినిమా చేశాను. కథలో చాలా హ్యూమర్ ఉంది. అమాయకత్వంతో కూడిన కృష్ణుడి హావభావాలు కూడా నవ్వుతెప్పిస్తాయి. కథకు సరిపడా హీరో కనుక ఆయనతో నటించడానికి ఓకే అనేశాను.

ప్రశ్న: హీరోయిన్‌గా ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు?
జ: తమిళంలో ఆర్.బి. చౌదరి నిర్మించిన "వెన్నెల కబడ్డీ కుళు"తో హీరోయిన్‌గా పరిచయమయ్యాను.

ప్రశ్న: హ్యాపీహ్యాపీగా ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది?
జ: ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. నా అన్నగా సాయికుమార్ సోదరుడు రవి నటించారు. ఇందులో గ్రామీణ యువతిగా కనిపిస్తాను. అమాయకత్వం ఉట్టిపడేతత్త్వం. ఎదుటివారంతా మంచివారే అనుకునే పాత్ర. అటువంటి అమ్మాయికి హీరో వరుణ్ సందేశ్ తారసపడటంతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత కథ కొత్తరకంగా సాగడం జరుగుతుంది.

ప్రశ్న: మలయాళంలో పెద్ద హీరోలతో నటించారా?
జ: సురేష్ గోపి, మమ్ముట్టిలతో కూడా నటించాను.

ప్రశ్న: తెలుగు, మలయాళ భాషల్లో కన్పించిన వ్యత్యాసం ఏమిటి?
జ: మలయాళం కన్నా.. తెలుగు ఇండస్ట్రీ పెద్దది. బడ్జెట్ పరంగా, ఏరియా పరంగా చాలా పెద్దది. కానీ నటన మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే నేను తెలుగులోకి వచ్చేముందు తెలుగు యాక్టింగ్ ఓవర్‌యాక్షన్‌గా ఉంటుందని విన్నాను. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఓవర్‌గా చేయాల్సి ఉంటుంది. మలయాళంలో అంత ఓవర్‌గా ఉండదు.

ప్రశ్న: ఎటువంటి పాత్రలు చేయాలనుంది?
జ: పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలంటే ఇష్టం. గ్లామర్ పాత్రలకు నేను సూటుకాను. ఇప్పటికి తెలుగులోకి వచ్చి ఏడాదైంది.

ప్రశ్న: వరుణ్ సందేశ్‌తో నటించడం ఎలా ఉంది?
జ: వరుణ్ కెమెరా ముందు, బయట ఒకేలా ఉంటారు. చాలా స్పీడ్ మనిషి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

ప్రశ్న: హ్యాపీహ్యాపీగాలో మీకు నచ్చిన సన్నివేశం?
జ: చివరి 30 నిమిషాలు బాగా నచ్చింది. మణిశర్మ సంగీతం బాగుంది. ఆయన చిత్రంలో పనిచేయడం గొప్పగా ఉంది.

ప్రశ్న: డాన్సర్‌గా స్టేజ్‌షోలు చేశారా?
జ: స్కూల్‌డేస్‌లో చాలా చేశాను. ఇప్పడూ చేయాలనుంది. సినిమాల వల్ల కుదరట్లేదు. కొద్దిరోజుల్లో కేరళలో ఓనమ్ పండుగ జరుగబోతుంది. అక్కడ చాలా చోట్ల కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను.

ప్రశ్న: మీకు నచ్చిన డాన్సర్లు?
జ: అమ్మ, ఆ తర్వాత శోభన.

ప్రశ్న: డాన్స్ కథాంశంగల చిత్రాల్లో నటించాలనుందా?
జ: తప్పకుండా అవకాసం వస్తే నటిస్తా.

ప్రశ్న: మరి హ్యాపీహ్యాపీగాలో ఎన్ని పాటలకు డాన్స్ వేశారు?
జ: ఒక్క పాటలో ఒక్క బిట్‌లోనే వేశాను. నా కథ అలానే ఉంది.

ప్రశ్న: కొత్త చిత్రాలు?
జ: నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా చిత్రంలో నటించాను. తమిళంలో మూడు చిత్రాల్లో నటించాను. అంటూ ముగించింది.

శరణ్యామోహన్ పర్సనల్ టచ్ మీ కోసం..
పుట్టినతేదీ: 19, ఫిబ్రవరి
పుట్టిన ఊరు: అలెప్పీ, కేరళ,
తల్లిదండ్రులు: కళామండలమ్ దేవీమోహన్, వైకెబి మోహన్,
సోదరి: సుకన్యమోహన్,
విద్యాభ్యాసం: బి.ఎ. (ఇంగ్లీష్),
మాట్లాడే భాషలు: మలయాళం, తమిళం, ఇంగ్లీష్, కొద్దిగా తెలుగు,
డాన్స్‌లో ప్రావీణ్యం: క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం, మోహినీ ఆట్టం,
చైల్డ్ ఆర్టిస్టు: అనియత్రి ప్రావ్ (మలయాళం),
హీరోయిన్‌గా: వెన్నెల కబడ్డీకుళు,
ఆదర్శం: తల్లిదండ్రులే,
నచ్చిన హీరోయన్లు: శ్రీదేవి, రేవతి.
About Writer
SELVI.M