Dasari Narayana Rao | Birth Day | may 4 | Tollywood | పదవి కోసం జెండాలు మార్చను... అది నా బ్లడ్‌లో లేదు: దాసరి
WD
ఈ ఏడాది పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారు?
ఈ ఏడాది అస్సలు జరుపుకోను. నా భార్య పద్మ చనిపోవడంతో... జరుపుకోరాదని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే అభిమానులకు, స్నేహితులకు చెప్పేశాను. ఆ రోజునాడు నా ఇంటి ఆవరణలో దాసరి పద్మ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈసారి పుట్టినరోజు బ్రేక్ అయింది.
అసలు మీ పుట్టినరోజు జరుపుకోవడం ఎప్పుడు ప్రారంభించారు?
కటకటాల రుద్రయ్య షూటింగ్‌లో ఉండగా... వడ్డే రమేష్ ఏర్పాటు చేశారు. నేను ప్రతి పుట్టినరోజు నాడు ఎక్కడున్నా... ఆరోజు ఇంటికి వచ్చేస్తా. అప్పటికే నా భార్య పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తుండేది. అన్నదానం చేసేది. మొదటి పుట్టినరోజును మదరాసులో చేసుకున్నాను.
అప్పట్లో అదే వీధిలో ఎన్.టి.ఆర్. వెళుతూ ఏమిటిదని కారుడ్రైవర్‌ను అడిగారట. దాసరిగారు పుట్టినరోజని చెప్పాడట. దాంతో.. ఏం బ్రదర్ మేం లేకుండా పుట్టినరోజు జరుపుకుంటారా? అని చనువుగా మాట్లాడుతూ... తన ఇంటి దగ్గర నుంచి నడచుకుంటూ వచ్చారు. అది అప్పటి నటుల ఆప్యాయతలు.
కొత్త సినిమాల ప్రణాళిక?
నాలుగు పెద్ద చిత్రాలు రెడీగా ఉన్నాయి. అవన్నీ త్వరలో చెబుతాను. అందులో ఫాంటసీ చిత్రం కూడా ఉంది. దీనికి కొత్త దర్శకులు, పాత దర్శకులు కూడా పనిచేస్తారు.
రాజకీయంగా మీ ప్రణాళిక?
అంటే ప్రశ్నలోనే.. చిన్న కన్‌ఫ్యూజ్‌లో పడేశారు. అంటే.. దాసరి.. ఏదో పార్టీ మార్చేస్తున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి. ఆ అర్థమా? లేక.. రాజకీయాల్లోనే ఉంటారా అనా? ఏది ఏమైనా...నేను పార్టీలు మార్చను. స్వలాభం కోసం... పదవుల కోసం నమ్ముకున్నవారిని నట్టేట ముంచేసి స్వార్థం చూసుకోను. పదవి కోసం జెండాలు మార్చను. అది నా బ్లడ్‌లో లేదు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. ఎప్పుడైనా కాంగ్రెస్‌వాదినే. ఏదో సిద్ధాంతపరంగా భేదాలు వస్తే మొహమాటం లేకుండా చెబుతాను.
ఉదయం పత్రిక అని చాలాసార్లు చెబుతున్నారు. అది ఎప్పుడు?
త్వరలో వస్తుంది. దానికోసం వర్క్ జరుగుతుంది.
మారిన పరిస్థితులనుబట్టి సినిమా తీయడంలో మీరు ఎంతవరకు మారారు?
నేను ఎప్పుడూ అప్‌డేట్‌లోనే ఉన్నాను. పరమవీర చక్ర సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. చూడకుండా ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారు. నేను రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాను. మొన్న రిలీజ్ అయిన 'దమ్ము' కూడా చూశాను. ఇలా ప్రతి సినిమా చూస్తాను. టెక్నాలజీ అవగాహన చేసుకుంటాను.
ప్రయోగాత్మక చిత్రాలు తీస్తారా?
గతంలో 'నీడ' తీశాను. మళ్ళీ అటువంటి ప్రయోగం చేస్తే జనాలు చూస్తారనే గ్యారంటీ లేదు. మొన్నటికిమొన్న 'దేవస్థానం' సినిమా తీస్తే... దాన్ని చూపించడానికి థియేటర్లు దొరకలేదు. హైదరాబాద్‌లోనే ఒక్క థియేటర్‌లో ఒక్క షో మాత్రమే వేసే పరిస్థితి.
థియేటర్ల గురించి ఇండస్ట్రీ పెద్దగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారు?
నేను తీసుకొనేదేంటి.. ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు. వారంతా కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పగలను. ఏ సమస్య వచ్చినా.. ఆ చిత్ర నిర్మాత ఆ టైమ్‌లో ముందుకు వస్తున్నాడు. మిగతావారు రావడంలేదు. పర్సనల్ సమస్యరా.. అంటూ పక్కవాడ్ని కామెంట్ చేస్తున్నారు. రేపు అతనికి సమస్య వస్తే.. ఇతనూ అలానే మాట్లాడతాడు. అలాకాకుండా సమిష్టిగా కలిసి పోరాడితే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.
ఈ రోజుల్లో తర్వాత అలాంటి సినిమాలు ఎక్కువయ్యాయి. దీనిపై మీరెలా స్పందిస్తారు?
ఈ రోజుల్లో అనే సినిమా విడుదలయింది కాబట్టే దాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటివి రిలీజ్ కానివి ఎన్నో ల్యాబ్స్‌లో మూలుగుతున్నాయి. అవన్నీ కొత్తగా వచ్చేవారికి తెలీవు. ఒకవేళ చెప్పినా వినరు. స్వానుభవం రుచి చూశాక.. నక్షత్రాలు కన్పిస్తాయి. సినిమా తీశాక.. రిలీజ్ చేయడం గగనం. అవన్నీ అర్థం చేసుకుని దిగాలి. ఈ రోజుల్లో తీసిన నిర్మాత లాభపడింది లేదు. థియేటర్లు సహకరించవని... వచ్చిన రేటుకు అమ్మేసుకున్నారు. దాన్ని కొనుక్కున్న మధ్యవ్యక్తులు బాగుపడ్డారు.
మీ అబ్బాయితో సినిమా ఎప్పుడు?
నేను ఏడాదికి నాలుగు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను. అందులో మా అబ్బాయి అరుణ్ కుమార్ సినిమా ఉంటుంది. చాలా గ్రాండ్‌గా కొత్త తరహాలో అరుణ్ కన్పించబోతున్నాడు అని చెప్పారు.
