1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

రజనీకాంత్ "శివాజీ" ఈ నెల 31న విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం శివాజీ ఈనెల 31వ తేదీ విడుదల
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం "శివాజీ" ఈనెల 31వ తేదీన విడుదలకానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఎ.ఆర్.రెహమాన్ రూపొందించిన పాటలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. చంద్రముఖి తరువాత రజనీకాంత్ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ కార్యక్రామలు నడుస్తున్నాయని "శివాజీ"ని తెలుగు ప్రేక్షకులు ముందుకు తెస్తున్న బెల్లంకొండ సురేష్ విలేకరులకు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల్లో ఇదే తొలి స్థానంలో ఉందని బెల్లంకొండ సురేష్ తెలిపారు.

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని చిత్రంలోని ప్రతి సన్నివేశాన్నీ చాలా జాగ్రత్తగా తెరకెక్కించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ "వేటగాడు"లో ఉన్న " ఆకుచాటు పిందతడిచే..." పాటను రజనీకాంత్, శ్రేయలపై చిత్రీకరించామని బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఈ వారంలో శివాజీ తొలి కాపీ సిద్ధమవుతుందని, దీనిని అత్యధిక ప్రింట్లతో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.