1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

కూర్గ్ నేపథ్యంలో తెరకెక్కిన టార్గెట్

కూర్గ్ నేపథ్యం టార్గెట్
WD PhotoWD
ముమైత్‌ఖాన్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న టార్గెట్ చిత్రం కూర్గ్ నేపథ్యంతో సాగుతుందని ఆ చిత్ర దర్శకుడు రమేష్‌రాజా అన్నారు. ఈ చిత్రంలోని కథ ప్రకారం ముమైత్, శివబాలాజీలు ఓ టార్గెట్‌తో కూర్గ్ చేరుకుంటారని ఆయన తెలిపారు.

అయితే హీరో, హీరోయిన్ల మనస్సుల్లో ఉన్న టార్కెట్ ఏంటి అనేది ప్రస్తుతం సీక్రెట్ అని ఆయన అన్నారు. శివబాలజీ, ముమైత్‌ఖాన్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సిరిసాయి సూర్యమూవీస్ బేనర్‌పై సంగిశెట్టి దశరథ, బి. రామకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు కర్నాటకలోని కూర్గ్‌లో చిత్రీకరించారు. అక్కడ షూటింగ్ సందర్భంగా జరిగిన విశేషాలను చిత్ర దర్శకుడు వివరించారు. ఆయన మాట్లాడుతూ కూర్గ్‌లోని మడికరి పట్టణ పరిసరాల్లో షూటింగ్ జరిపామని తెలిపారు.

కావేరి నది పుట్టిన ప్రదేశమైన తలకావేరి గుడిలోను, తలకావేరి విండ్‌మిల్, అభేఫాల్స్, కాఫీ తోటల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీహర్ష రాసిన అడుగు అడుగు నీ వెనక... నా అతడు నువ్ కనుక... అనే పాటను శివబాలాజీ, ముమైత్‌ఖాన్‌లపై చిత్రీకరించామని తెలిపారు.

నిర్మాత దశరథ మాట్లాడుతూ హీరోయిన్, హీరో ఇద్దరు కూడా తమ టార్గెట్‌ కోసం దగ్గరవుతారని, అందుకే ఈ చిత్రానికి టార్గెట్ అనే పేరు పెట్టామని తెలిపారు. కూర్గ్‌లో జరిగిన షూటింగ్‌తో ఓ పాట మినహా షూటింగ్ పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించి మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

కోటి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో శ్రద్ధాదాస్, విశ్వజిత్, అలీ, వేణుమాధవ్, ఆహుతీ ప్రసాద్, కొండవలస, అభినయశ్రీ, మందాకిని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు- వెలిగొండ శ్రీనివాస్, కెమెరా- వి.ఎన్. సురేష్‌కుమార్.
About Writer
Munibabu