1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

వెండితెర అద్భుతం: ప్రేక్షకుల ముందుకు రేపు ''దశావతారం''

వెండితెర అద్భుతం ప్రేక్షకుల రేపు దశావతారం
WD PhotoWD
కమల్‌హసన్ పది పాత్రల్లో నటించిన 'దశావతారం' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత రెండున్నరేళ్లుగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం అప్పటినుంచి నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది. భారీ బడ్జెట్ చిత్రంగా, వివాదాస్పద కథ ఉన్న చిత్రంగా దశావతారం ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలవడం విశేషం.

కమల్ ఈ చిత్రానికి స్వయంగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ పది పాత్రల్లో నటించడం గమనార్హం. వెండితెరపై తొలిసారిగా ఒక నటుడు పదిపాత్రల్లో ఒకే చిత్రంలో నటించడం ఈ చిత్రానికి సంబంధించిన చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పటివరకు ఎవరూ చేయని ఈ అద్భుతాన్ని తాను మాత్రమే చేయగలనని నిరూపిస్తూ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి కమల్ ఈ చిత్రంలో నటించారు. కమల్‌తోపాటు అసిన్, జయప్రద, మల్లికాషెరావత్ లాంటి పేరున్న స్టార్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.


ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఓ అద్భుత కావ్యాన్ని తెరకెక్కించాలన్న ఒకే ఉద్ధేశ్యంతో ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 50 కోట్లకు పై చిలుకు బడ్జెట్‌తో రూపొందించిందడం కూడా గొప్ప విషయమే. తమిళంలో కమర్షియల్, హిట్ చిత్రాల దర్శకుడుగా పేరున్న కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అలాగే ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేషి రేషమ్మియా సంగీతాన్ని అందించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన నేపథ్య సంగీతాన్ని మాత్రం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అందించడం విశేషం. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీఛాన్ చేతులమీదుగా విడుదల కావడం మరో గొప్ప విశేషం.

వీటన్నింటితో పాటు ఈ చిత్రంలో వైష్ణవులను కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయంటూ చెన్నైకి చెందిన ఇద్దరు సుప్రీంకోర్టుకు వెల్లడం గమనార్హం. అయితే సుప్రీంకోర్టు వీరి పిటిషన్‌ను త్రోసిపుచ్చింది.

ఇన్ని రకాల విశేషాలను, వివాదాలను కలిగిన దశావతారం దాదాపు వెయ్యి ప్రింట్లతో రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.