సినీ కష్టాల నేపధ్యమే ''నేనింతే'': పూరీ జగన్నాథ్
|
రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటాం. పనిలోపడి ఈరోజు ఏవారమని పక్కవాళ్ళను అడిగి తెలుసుకుంటాం. ఇలాంటి సినిమావాళ్ళ కథతో ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. వృత్తిపరంగా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. కథ రీత్యా పెద్ద డైరెక్టర్ కనబడాల్సివుంది. వి.వి. వినాయక్ ఆ పాత్రలో కనిపిస్తార"ని 'నేనింతే' దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.
రవితేజ, శ్రియ జంటగా యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్యాసెట్ విడుదలచేసి చిత్ర సంగీత దర్శకుడు చక్రికి అందించారు. మరో దర్శకుడు వి.వి. వినాయక్ సీడీ ఆవిష్కరించగా రవితేజ అందుకున్నారు.
చక్రి మాట్లాడుతు... "సినిమా వాళ్ళ కథను ఇతివృత్తంగా ఎంచుకుని తీసినందుకు జగన్ (పూరీ జగన్నాథ్) అన్నయ్య జన్మ ధన్యమైంది. రీరికార్డింగ్ సమయంలో బాధ తన్నుకొచ్చి అన్నయ్యకు ఫోన్ చేశాను. బ్యాంకాక్‌లో ఉండడంతో లైన్లు కలవలేదు. మంచి ఫీల్ ఉన్న చిత్రమిది. సినిమా వాళ్ళ కథలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు" అన్నారు.
గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ స్పందిస్తూ... "రెండు పాటలు రాశాను. 'కృష్ణా నగరే మామ... కృష్ణా నగరే... సినిమాలే లైఫురా మామా... లైఫంతా సినిమాలేరా మామా... పాట రాసి సినిమా తల్లి రుణం కొంత తీర్చుకున్నాను. ఈ పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాట రాయడం ద్వారా ఎనిమిదేళ్ళ కెరీర్‌లో తొలిసారి తియ్యని అనుభూతి పొందాను" అన్నారు.
'నేనింతే' గొప్ప సినిమా అవుతుందన్న అభిప్రాయాన్ని నిర్మాత వెలిబుచ్చారు. వి.వి. వినాయక్ మాట్లాడుతూ... "సినిమాలో కొన్ని సన్నివేశాలు చూశాను. సూపర్ హిట్ అవుతుందనిపించింది. పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్స్ అన్నీ వాస్తవంగా ఉన్నాయి. 'రూపాయి సంపాదనలేని ఏ వెధవకీ ప్రేమించే హక్కు లేదు' అన్న డైలాగ్ బాగా నచ్చింది. సినిమా చూస్తుంటే... తొలినాళ్ళలో మాలాంటి వాళ్ళు పడ్డ కష్టాలు, ఆనందాలు చాలా థ్రిల్ కల్గించాయి" అన్నారు. ఒక అద్భుతమైన సినిమా అవుతుందని రవితేజ అన్నారు.
