రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. మే నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.
ఇటీవల ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి నటుడు, నిర్మాత అట్లూరి పుండరీకాంక్షయ్య ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించగా, అల్లరి నరేష్ సీడీని విడుదల చేశారు.
ఆడియో విడుదల సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. నాన్న వద్ద చౌదరి దర్శకత్వశాఖలో పనిచేశారన్నారు. ఎంతోకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ చిత్ర విజయంతో ఆయన కోరిక నెరవేరాలని ఆశించారు.
మరో అతిథి అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పాటలు ఇప్పుడే విన్నానని, వందేమాతరం బాణీల్లో కమర్షియల్ కిక్ ఉందన్నారు. అందరూ దమ్మున్నవాళ్లే తీసిన ఈ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందన్నారు.
పుండరీకాక్షయ్య మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను ఓ పాత్రను పోషించినట్లు చెప్పారు. ఎప్పుడో "పోలీస్ బ్రదర్స్"లో గ్రామపెద్దగా సెంటిమెంట్ వేషం వేశానని, అది చూసి చిత్ర దర్శకుడు చౌదరి తనను ప్రత్యేకంగా ఈ సినిమాలోని పాత్ర పోషించమన్నట్లు తెలిపారు. చౌదరి సమర్థవంతమైన దర్శకుడని, ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు చౌదరి మాట్లాడుతూ.. వందేమాతరం పాటలను క్వాలిటీ బాగా ఇచ్చారని, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా చూసి రిషిని ఎంపిక చేశామన్నారు. పాత్రగురించి చెప్పిన వెంటనే రిషి ఒప్పుకున్నారని, మాస్ హీరోగా రిషి నిలదొక్కుకుంటాడని చెప్పారు.