సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తూ.. రాజ్ కె. ఎస్. గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం "తేజం". ఈ నెల 29న "తేజం" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ "యు" సర్టిఫికేట్‌ను పొందింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. మంచి టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం యువత మనోభావాలకి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉంటుందన్నారు. ప్రీతిజింగానియా స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ఒక హైలైట్ కాగా, ఛేజింగ్, బ్రహ్మానందం కామెడీ మరో హైలైట్‌గా నిలువనున్నాయని చెప్పారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన లభించింది. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో.. చిత్రీకరణ కూడా అంతకు తక్కువ కాకుండా ఉంటుంది.
వ్యాపారపరంగా కూడా మంచి ఆదరణ ఉందని అన్నారు. సెన్సార్ సభ్యుల నుంచి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మీద మంచి చిత్రాన్ని నిర్మించారన్న ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.