Kasco Audio, Vaibhav, Hyderabad, | "కాస్కో" వైభవ్ మినీ రవితేజ
గొడవ ఫేమ్ వైభవ్ బాడీ లాంగ్వేజ్‌లో చిలిపితనముంది. ఎంతో చలాకీగా నటిస్తున్నాడు. అతను మినీ రవితేజ అవుతాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఎ.కోదండరామిరెడ్డి సమర్పిస్తున్న కాస్కో చిత్ర ఆడియో ఆవిష్కరణ జూబ్లీ హిల్స్‌లో జరిగింది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సునీల్ రెడ్డి, భారతి నిర్మిస్తున్నారు. ఆడియో సీడీని పద్మశ్రీ బ్రహ్మానందం విడుదల చేసి డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణకు అందించారు.
ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు ఎ. కోదండరామిరెడ్డితో తమకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను అవకాశాలకోసం ఎదురు చూస్తున్న రోజుల్లో కోదండ రామిరెడ్డిని కలిసి సిరిమల్లె పువ్వు కథ చెప్పాను. నచ్చలేదు. ఆయన మంచి ఆర్టిస్ట్. తన చిత్రాలకు ఆయనే బొమ్మలు గీసి చూపిస్తాడు. వారి తనయుడు వైభవ్ తొలి సినిమా గొడవకు నేనే రాశాను. కాస్కో మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాన"ని పరుచూరి అన్నారు.
దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ, "కోదండ రామిరెడ్డిగారి పెద్దబ్బాయి నిర్మాతగా రెండవ అబ్బాయి హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి సక్సెస్ కావాల"ని ఆకాంక్షించారు. "వంద సినిమాలు చేసినా భేషజం లేని కోదండ రామిరెడ్డి ప్రవర్తన తననెంతో ముగ్ధుడ్ని చేసిందనీ, సరోజ అనే సినిమాలో వైభవ్‌తో కలిసి చేశాననీ అందులో నటించిన ప్రేమ్‌జీ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చడం విశేషమ"నీ బ్రహ్మానందం తెలిపారు.
