Actress Katrina Kaif | Raajneeti | Indian democracy | Indian elections | "రాజనీతి" కోసం అన్నిటినీ త్యాగం చేస్తున్న కత్రినా
IFM
ఇంతకీ కత్రినా కైఫ్ అంతగా కష్టపడి నటిస్తున్న "రాజనీతి" సినిమా కథ ఏమిటీ..? అని ఒక్కసారి తొంగి చూస్తే... రాజనీతి చిత్రం భారత రాజకీయాలను ప్రతిబింబించే కథ. భారత ప్రజాస్వామ్యం నేడు ఎలా ఉన్నదో కళ్లకు కట్టి చూపించే ఓ ప్రయత్నం. అంతేకాదు.. భారతదేశంలోని ఎన్నికలు, రిగ్గింగ్‌లు, పీఠంకోసం ఎత్తులకు పైఎత్తులు, అధికారం కోసం ప్రభుత్వాలను కూలదోసే నాయకులు, స్వార్థ ప్రయోజనాలకోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమ బాటలో పయనింప చేసే పద్ధతులు..
ఇలా ఒకటేంటి.. ఈ విశాల భారతావనిలో రాజకీయ వికృత క్రీడలన్నీ ఈ రాజనీత ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెపుతున్నారు. అయితే ఇన్ని ఒడిదుడుకులను సైతం ఎదుర్కొని ప్రజాస్వామ్యం ఘనంగా ఎలా ముందుకు వెళుతుందీ... ప్రజలు ఎలా నెగ్గుకొస్తున్నదీ రాజనీతి సారాంశం అంటున్నారు.
ఇక రాజనీతి చిత్రంలోని పాత్రలను ఒకసారి పరికిస్తే... ఫైర్ బ్రాండ్ లెఫ్టిస్ట్ లీడర్ భాస్కర్ సన్యాల్( నసీరుద్దీన్ షా) ఒంటి చేత్తో తన పార్టీని ప్రజల్లోకి తీసుక వెళ్లి తనకంటూ ఓ గుర్తింపును సాధిస్తాడు. తన భావాలకు ప్రజలు విశేషంగా ఆకర్షితుల్ని చేస్తాడు. అయితే కొన్ని తప్పిదాల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాడు. ఇక సూరజ్( అజయ్ దేవగణ్) వెనుకబడిన తరగతులకు చెందిన రాజకీయవేత్త. అయితే ఇతడిని దురదృష్టం వెన్నాడుతుంటుంది. దీంతో హృదయంలో ఉన్న కోర్కె కార్యరూపం దాల్చలేకపోతుంది.
జీన్ కొలిన్స్( సారా థామ్సన్) రాజకీయాలను ఆసరా చేసుకుని భూమ్మీద హింసను పురిగొల్పేందుకే పుట్టాడా అన్నట్లు ఉంటాడు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతటి దారుణానికి ఒడిగట్టేందుకు సిద్ధం. ఎన్ని ప్రాణాలను తీయడానికైనా రెడీ. ఇలా ఒక్కో పార్టీకి చెందిన నాయకుడు ఒక్కో తీరులో ఉంటారు.
వీరందరి మధ్య ఇందు సక్సేరియా( కత్రినా కైఫ్) రాణి, అందగత్తె, అణకువ.. ఇలా అన్ని మంచి లక్షణాలను పుణికిపుచ్చుకున్న యువతి. అయితే తను అమితంగా ప్రేమించే వ్యక్తి భవిష్యత్ ఎన్నికలతో ముడిపడి ఉంటుంది. ఒకానొక దశలో ఈ రాజకీయాలు ఇందు జీవితంలో పెను అలజడిని సృష్టించి తన జీవితాన్ని శాసిస్తాయి. ఆ పరిస్థితుల్లో ఇందు సక్సేరియా ఏం చేసింది...? రాజకీయ నాయకుల రూపంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న శక్తులను ఆమె ఏం చేసింది. రాజకీయాలలోనూ ఆమె రాణిగా కొనసాగిందా...? చివరికి కత్రినా కైఫ్ రాజనీతి ఏం చెపుతుందన్నది తెలుసుకోవాలంటే 2010 జూన్ 4వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
